శనివారం 24 అక్టోబర్ 2020
Medak - Aug 08, 2020 , 22:49:25

పేదోడికి ఉపాధి, శ్రీమంతుడికి ఆరోగ్యం

పేదోడికి ఉపాధి, శ్రీమంతుడికి ఆరోగ్యం

రామాయంపేట : పేదలకు ఉపాధి కల్పిస్తున్న మక్క రొట్టెలకు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల్లో  భలే గిరాకీ ఉంది. మార్కెట్‌లో మక్కరొట్టె పేదోడికి ఉపాధి, శ్రీమంతుడి ఆరోగ్యానికి ఆహారంగా మారింది. మలబద్ధ్దకం, బీపీ,మధుమేహాన్ని నియంత్రించే శక్తి కేవలం మక్క రొట్టలకే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా జొన్నలను పట్టించిన పిండితో ఇంట్లో తయారు చేసుకోలేక, సమయం దొరకక ఉద్యోగులు, వ్యాపారులు రొట్టెల విక్రయ కేంద్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో రొట్టెల తయారీ కొందరికి ఉపాధినిస్తోంది. మెదక్‌ జిల్లా రామాయంపేట మండలంలో  భిక్కనూరు, దోమకొండ, బీబీపేట, నిజాంపేట, నార్సింగిలే కాకుండా సుదూర ప్రాంతాల వారు సైతం విక్రయ కేంద్రాల్లో  రొట్టెలు తీసుకుని వెళ్తున్నారు. పూర్వీకుల కాలంలో వ్యవసాయ కూలీలు, కార్మిక, కర్షకులు, సంచార జాతులవారు మక్క రొట్టెలను ప్రధాన ఆహారంగా తీసుకునేవారు. ముఖ్యం గా చెప్పాలంటే ఈ రొట్టెలు తయారు చేయడంలో గిరిజనులే ఒకప్పుడు సిద్ధ్దహస్తులుగా పేరు తెచ్చుకున్నారు.

గిరిజన మహిళలు చేతుల్లోనే రొట్టెను తయారు చేసి పెంకుమీద కాల్చి నైపుణ్యాన్ని చాటుకున్నారు. గతంలో కొందరు రొట్టెలను తయారు చేసి విక్రయించేవారు రానురాను ఇతరులు రొట్టెలు తయారు చేయడం నేర్చుకుని ఉపాధి పొందుతున్నారు. రామాయంపేట పట్టణంలోని పాత రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట కొంత మంది యువకులు షాపులను అద్దెకు  తీసు కుని మక్క రొట్టెలను తయారు చేస్తున్నారు.  ప్రతిరోజు  మూడు దుకాణాల్లో కలిపి రోజుకు 600 రొట్టెల వరకు అమ్ముడవుతున్నాయని తెలిపారు. ఆర్డర్‌పై విందులకూ రొట్టెలను తయారు చేసి విక్రయిస్తున్నారు. నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ కమాన్‌ వద్ద ఇద్దరు మహిళలు రొట్టెలను తయారు చేసి విక్రయిస్తున్నారు. రామాయంపేట పట్టణంలో గతంలో రెండు మూడు ఉన్న రొట్టెల దుకాణాలు ప్రస్తుతం పదిపైగానే వెలిశాయి. పల్లె ప్రాంతాల నుంచి పట్టణానికి వలస వచ్చిన మహిళలు ఈ మక్క రొట్టెలను చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఒక్కో రొట్టె ధర రూ.10 నుంచి 15 వరకు ఉంటుంది.  

ఆరోగ్యానికి మేలు 

మొక్కజొన్న రొట్టె ఆరోగ్యానికి మంచి ఆహారం.  ఈ మక్కలతో రొట్టె లే కాకుండా గట్కా కూడా తయారు చేసి విక్రయాలు జరుపుతున్నారు. మక్కల్లో ఫైబర్‌ కాల్షియం అధికంగా ఉంటుంది. చక్కెరను రక్తంలో కలపకుండా నియంత్రించే గుణం ఈ పదార్థంలో ఉంది. మలబద్దకాన్ని, షుగర్‌ను తగ్గించే శక్తి కూడా ఉంది. అందుకే ఎక్కువ శాతం షుగర్‌ పేషెంట్లకు జొన్నరొట్టె మంచి ఆహారం. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఒకటి లేదా రెండు చొప్పున తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

మక్కరొట్టెలతో ఉపాధి పొందుతున్నా..

మక్క రొట్టెలతో ఉపాధి పొందుతున్నాం.  ఆర్డర్‌ ఇస్తే 500 రొట్టెలైనా తయారు చేసి ఇస్తాం. మా కుటుంబానికి ఇదే జీవనాధారం.  మాది రామాయంపేట పట్టణమే అయినా ఇతర పనులు లేకపోవడంతో మక్క రొట్టెలతయారీపైనే బతుకుతున్నాం. మా ఇంట్లో వారు రొట్టెలతో పాటు ఆర్డర్‌పై చికెన్‌, మటన్‌ వంటలను వండిస్తాం.-రాజేందర్‌గౌడ్‌, షాపు యజమాని

ప్రభుత్వం రుణాలిస్తే ..

ప్రభుత్వం రుణాలిస్తే కిస్తీల వారీ గా అప్పును ముట్టజెప్తాం. రొట్టె లు ప్రతిరోజూ రెండు వందలకు పైగానే విక్రయిస్తాం. పందిళ్లలో తయారు చేసే మాకు ప్రభుత్వం ఏదైనా షెడ్ల కోసం రుణాలను మంజూరు చేస్తే ఉపాధి పొందుతాం. రొట్టెల ద్వారా మా కుటుంబాన్ని పోషించుకుంటాం.- బురానీ స్వరూప, తయారీదారు 


logo