గురువారం 26 నవంబర్ 2020
Medak - Aug 07, 2020 , 22:36:03

ఇంటింటికీ సు జలధార

ఇంటింటికీ సు జలధార

గజ్వేల్‌ అర్బన్‌:దశాబ్దాలుగా తాగునీటి కష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గజ్వేల్‌ ప్రాంత ప్రజల గోసను సీఎం కేసీఆర్‌ మొదటిసారి అధికారం చేపట్టగానే గుర్తించారు. స్థానిక ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజల తాగునీటి కష్టాలను తీర్చిన తర్వాతనే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని సంకల్పాన్ని తీసుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇంజినీరింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించి, తక్కువ ఖర్చుతో తాగునీటిని అందరికీ అందించాలని చర్చించారు. స్వయంగా సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ ప్రాంతమంతా పరిశీలించి మిషన్‌ భగీరథ సంప్‌హౌస్‌ను కోమటిబండ గుట్టపై నిర్మించాలని, తద్వారా నీటి పంపిణీకి మోటర్ల ఖర్చు తక్కువ అవుతుందని గుర్తించారు. వెంటనే అధికారులకు సూచించి ప్రతిపాదనలు సిద్ధం చేయించడంతో పాటు పనులను ప్రారంభించారు. 2015 నవంబర్‌ 27న అప్పటి మంత్రి కేటీఆర్‌ పనులను ప్రారంభించారు.అధికారులు రికార్డు స్థాయిలో కేవలం 9 నెలల్లోనే పనులను పూర్తిచేశారు. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా 2016 ఆగస్టు 7న కోమటిబండ మిషన్‌ భగీరథ సంప్‌హౌస్‌పై మిషన్‌ భగీరథ పైలాన్‌ను ఆవిష్కరించి, ఇంటింటికీ నీటి సరఫరాను ప్రారంభించారు. 

అధ్యయన కేంద్రంగా కోమటిబండ సంప్‌హౌస్‌..

గజ్వేల్‌ ప్రాంత దాహార్తి తీర్చడానికి రూపొందించిన కోమటిబండ మిషన్‌ భగీరథ ప్రాజెక్టు రానురాను రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని వివిధ రాష్ర్టాల ప్రజాప్రతినిధులు, అధికారులకు తాగునీటి పథకాల రూపకల్పనకు అధ్యయన కేంద్రంగా మారింది. మిషన్‌ భగీరథ పథకం గజ్వేల్‌లో విజయవంతమైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి ఐఏఎస్‌లు, ఇంజినీరింగ్‌ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సైతం ఇక్కడకు వచ్చి ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ, శుద్ధీకరణ, ఇంటింటికీ నీటి సరఫరా పద్ధతులను తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో పాటు ఆయా రాష్ర్టాల సీఎంలు, గవర్నర్లు, మంత్రులు, జలమండలి సభ్యులు, ఇంజినీర్లు, ఐఏఎస్‌లు గజ్వేల్‌ కోమటిబండ సంప్‌హౌస్‌ను సందర్శించారు. తాగునీటి సరఫరాకు మిషన్‌ భగీరథ నిర్వహణ విధానాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నారు, ఇప్పటికే పలు రాష్ర్టాల్లో మిషన్‌ భగీరథ తరహా ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. రోజురోజుకు సందర్శకుల తాకిడి ఎక్కువ అవుతుండడంతో కోమటిబండ మిషన్‌ భగీరథ సంప్‌హౌస్‌పై మిషన్‌ భగీరథ నాలెడ్జ్‌ సెంటర్‌ను నిర్మించారు. వచ్చిన వారందరికీ నాలెడ్జ్‌ సెంటర్‌లోనే ప్రాజెక్టు గురించి పూర్తిగా వివరిస్తున్నారు.

రూ.30 కోట్ల అంచనాతో నర్సాపూర్‌ సెగ్మెంట్‌ పనులు...

గజ్వేల్‌ కోమటిబండ నుంచి నర్సాపూర్‌ నియోజకవర్గానికి తాగునీటి సరఫరాకు రూ.30కోట్ల అంచనా వ్యయంతో ఇటీవల పనులు ప్రారంభమయ్యాయి. నర్సాపూర్‌ సెగ్మెంట్‌ ద్వారా మరో 500 గ్రామాలకు తాగునీరు అందనుంది. ఇప్పటికే 80శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 20శాతం పనులు వేగంగా చేపడుతున్నారు.

ఎన్నో గ్రామాల దాహార్తి తీరుస్తూ...

రూ.850 కోట్ల వ్యయంతో నిర్మించిన గజ్వేల్‌ సెగ్మెంట్‌ ద్వారా గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాలతో పాటు సిద్దిపేటలోని కొన్ని ప్రాంతాలకు నీటిని అందిస్తున్నారు. మొత్తంగా 566 గ్రామాలు, 4 మున్సిపాలిటీల్లో ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తున్నారు. నిత్యం 1.70 లక్షల ఇండ్లకు కోట్ల లీటర్ల మేర తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రారంభం మొదలుకొని ఈనాటి వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నీటిని విజయవంతంగా సరఫరా చేస్తున్నారు. దీంతో ప్రజలకు తాగునీటి కష్టాలు తీరాయి. గతంలో వెయ్యి లీటర్ల నీటి సరఫరా చేయడానికి వివిధ ప్రభుత్వ పథకాలు, పంచాయతీ, మున్సిపాలిటీ నిధుల నుంచి రూ.13 ఖర్చు చేసేవారు. మిషన్‌ భగీరథ ద్వారా కేవలం రూ.3 వ్యయంతో వెయ్యి లీటర్ల నీటిని ప్రజలకు అందిస్తున్నారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు రూపకల్పన ద్వారా ప్రభుత్వానికి వ్యయభారం తగ్గడంతో పాటు ప్రజలకు శుద్ధినీరు అందుతున్నది.

సహజ మినరల్స్‌తో వ్యాధులు దూరం

బోరు నీటితో ఏర్పాటు చేసుకునే వాటర్‌ ఫిల్టర్ల ద్వారా తయారు చేసుకునే నీటి కన్నా మిషన్‌ భగీరథ నీరు ఎంతో ఆరోగ్యకరమైనవని వైద్యులు తేల్చి చెప్పారు. సహజంగా గోదావరి నదిలోని మంచినీటినే ఫిల్టర్‌ చేసి ఆరోగ్యకర, స్వచ్ఛ తాగునీటిని ప్రజలకు మిషన్‌ భగీరథ ద్వారా అందిస్తున్నారు. దీంతో ప్రజల్లో బోరు నీటి ద్వారా వచ్చే ఫ్లోరోసిస్‌ తదితర వ్యాధుల ప్రబలే ప్రమాదం లేకుండాపోయింది. ఫలితంగా ప్రజలకు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు.

నిత్యం నీటి సరఫరా.. 

గజ్వేల్‌ సెగ్మెంట్‌ ద్వారా ప్రతిరోజు గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాలతో పాటు సిద్దిపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నాం. ముందస్తుగా నిర్ణయించిన మేరకు మున్సిపాలిటీల్లో ఉదయం, గ్రామాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో నీటిని అందిస్తున్నాం. ఒక్కో వ్యక్తికి వందలీటర్ల చొప్పున సరఫరా చేస్తున్నాం. మరమ్మతులు ఏమైనా ఉంటే ఒకరోజు ముందస్తుగా సమాచారాన్ని అందిస్తున్నాం. మరమ్మతులు పూర్తయ్యే వరకు సంప్‌హౌస్‌ నుంచి నీటి సరఫరాకు ముందస్తుగానే నిల్వ చేస్తున్నాం. - నాగార్జున, కోమటిబండ మిషన్‌ భగీరథ సంప్‌హౌస్‌ డీఈఈ    

ఆలోచన, ప్రణాళిక పూర్తిగా సీఎం కేసీఆర్‌దే..

మిషన్‌ భగీరథ ప్రాజెక్టు ఆలోచన, ప్రణాళిక పూర్తిగా సీఎం కేసీఆర్‌దే. గుట్టపై సంప్‌హౌస్‌ నిర్మాణం చేపట్టడంతో పాటు తక్కువ ఖర్చుతో నీటిని నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ సరఫరా చేయాలన్న ఆలోచన ఆయన ఇంజినీరింగ్‌ ప్రతిభను చూసి, ఆ రోజంతా మేము ఆశ్చర్యానికి గురయ్యాం. ప్రాజెక్టును ఏవిధంగా నిర్మించాలో ఆయన చెప్పినట్టే పూర్తిచేశాం. మిషన్‌ భగీరథలో పనిచేసిన ఇంజినీర్లంతా ఈ ప్రాజెక్టు ద్వారా ఎంతో అనుభవాన్ని సంపాదించుకున్నాం. ఇంటికి సరఫరా అయిన నీరు తిరిగి పైపుల్లోకి వెళ్లకుండా ఏర్పాటు చేసిన రిటర్నింగ్‌ వాల్‌ ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా రూపొందించాం. ప్రజలందరికీ శుద్ధినీటిని అందిస్తున్నందుకు సంతృప్తిగా ఉంది.

- రాజయ్య, కోమటిబండ మిషన్‌ భగీరథ సంప్‌హౌస్‌ ఈఈ