ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Aug 05, 2020 , 23:58:06

రెవెన్యూ సిబ్బంది భూ కథనం

రెవెన్యూ సిబ్బంది భూ కథనం

తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌, వీఆర్వో రూ.80కోట్ల అసైన్డ్‌ ల్యాండ్‌కు ఎసరు పెట్టారు.. దాని కోసం ఓ నోటు తయారు చేసుకున్నారు. అందులో అన్నీ రాసుకొని పక్కా ప్లాన్‌ వేశారు. ఆ నోట్‌ ప్రకారం జిన్నారం మండలం ఖాజీపల్లిలోని 181 సర్వే నెంబర్‌లో ఐదెకరాల చొప్పున నలుగురు మాజీ సైనికులకు చనిపోయిన తహసీల్దార్‌ ఫోర్జరీ సంతకాలతో పట్టాలూ అందజేశారు. వ్యూహాత్మకంగా 2007 నుంచి పహానీ మొదలుకొని, అన్ని రికార్డుల్లో భూమి మాజీ సైనికుల పేరున ఉన్నట్లు ట్యాంపరింగ్‌ చేసి, ఫైళ్ల కథ నడిపించారు. ఆ భూమికి ఎన్వోసీ ఇవ్వాలని కోరుతూ 2019లో కలెక్టర్‌కు మాజీ సైనికులు దరఖాస్తు పెట్టుకున్నారు. కలెక్టర్‌కు వచ్చిన ఫైళ్లలో రెవెన్యూ సిబ్బంది ముందుగా రాసుకున్న ఆ నోట్‌(ప్లాన్‌ పేపర్‌) ప్రత్యక్ష్యమైంది. దీంతో అసలు విషయం బయటికొచ్చింది. దీంతో కలెక్టర్‌ హనుమంతరావు విచారణకు ఆదేశించి, సర్కారుకు నివేదిక పంపారు. కాగా, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలతో పాటు ఆ భూమి పట్టాలు రద్దు చేసి, స్వాధీనానికి సర్కారు చర్యలు తీసుకోనున్నది. 

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఆ గ్రామం అసైన్డ్‌మెంట్‌ భూకేటాయింపుల నిషేధిత జాబితాలో ఉన్నది. అయినా ఐదుగురు మాజీ సైనికులకు ఐదెకరాల చొప్పున రూ.80 కోట్ల విలువైన భూమి కేటాయించారు. ఇది ఎలా సాధ్యం..? ఇలాంటి అసాధ్యాన్ని కూడా తహసీల్దార్‌, డిప్యూ టీ తహసీల్దార్‌, మరో వీర్వో కలిసి సుసాధ్యం చేశారు. పహానీ మొదలుకుని అన్ని రికార్డుల్లో ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారు. వ్యూహాత్మకంగా చక్రం తిప్పారు. ఎప్పుడో చనిపోయిన ఓ తహసీల్దార్‌ సంతకాలను ఫోర్జరీ చేసి పట్టాలు తయారు చేశారు. అలా పొందిన ఆ భూమికి ఇప్పుడు రైతు బంధు సాయం కూడా అందుతున్నది. దొంగతనం ఎప్పుడో ఓ సారి బయటకు రాకతప్పదన్నట్లు.. ఆ భూమికి ఎన్వోసీ కావాలని సదరు మాజీ సైనికులు దరఖాస్తు పెట్టుకోవడంతో ఈ అక్ర మం వెలుగులోకి వచ్చింది. ఫైళ్లు తనిఖీ చేసిన కలెక్టర్‌కు అక్రమాలు కళ్ల ముందు కనిపించాయి. తక్షణమే విచారణ అధికారిని నియమించడం, ఆయన అక్రమాల చిట్టా నివేదిక రూపొందించడం, ఆ నివేదికను కలెక్టర్‌ ప్రభుత్వానికి సమర్పించడం చకచకా జరిగిపోయాయి. పట్టాలు రద్దు చేసి ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అధికారులు చర్యలు చేపట్టారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. ఔటర్‌ రింగు రోడ్డుకు సమీపంలో జిన్నారం మండలం ఖాజీపల్లిలో జరిగింది ఈ అక్రమ భూ కేటాయింపు బాగోతం.

ఎన్వోసీకి దరఖాస్తుతో వెలుగులోకి..

నాగేందర్‌రావు, ఉప్పు రంగనాయకులు, తోట వెంకటేశ్వర్లు, ఎం.మధుసూదన్‌ మాజీ సైనికులు. తమకు జిన్నారం మండలం ఖాజీపల్లి గ్రామంలోని 181 సర్వే నెంబర్‌లో 5 ఎకరాల చొప్పున ప్రభుత్వం భూమి కేటాయించిందని, ఆ భూమికి ఎన్వోసీ ఇవ్వాలని కోరుతూ 2019లో కలెక్టర్‌కు మాజీ సైనికులు దరఖాస్తు పెట్టుకున్నారు. 2007లో తమకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని, చట్టం ప్రకారం 10ఏండ్లు పూర్తయినందున తమకు ఎన్వోసీ ఇవ్వాలని విన్నవించుకున్నారు. అయితే ఖాజీపల్లి గ్రామం అసైన్‌మెంట్‌ నిషేధిత గ్రామ జాబితాలో ఉన్నది. అంటే ఈ గ్రామంలో అసైన్డ్‌ భూమి ఎవరికి కేటాయించొద్దు. అలాంటి గ్రామంలో మాజీ సైనికులకు భూమిని ఎలా కేటాయించారని కలెక్టర్‌ హనుమంతరావుకు అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక్కసారి పూర్తి ఫైల్‌ తిరిగేస్తే, అక్రమాల చిట్టా మొత్తం వెలుగులోకి వచ్చింది.

రూ.80 కోట్ల విలువైన భూమి..

మాజీ సైనికులకు ఖాజీపల్లిలో భూ కేటాయింపు కోసం 2005 జనవరి 3న అసైన్‌మెంట్‌ కమిటీ ఆమోదం తెలిసింది. ఇక్కడ రెవెన్యూ సిబ్బంది అయిన తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌, వీర్వోలు తమ అక్రమ తెలివిని ప్రదర్శించారు. అసైన్‌మెంట్‌ జాబితాలో లేని ఖాజీపల్లిని అందులో ఇరికించి, కమిటీని కూడా తప్పదారి పట్టించారు. జిన్నారం మండలంలోని కిష్టాయపల్లి, కానుకుంట, మంబాపూర్‌, గుమ్మడిదల, కొత్తపల్లి, కొడకంచి, మాదారం, నల్తూర్‌, సోలక్‌పల్లి ఈ తొమ్మిది గ్రామాలతో పాటు ఖాజిపల్లిని కూడా ఇదే జాబితాలో ఇరికించి, 10 గ్రామాలతో కూడిన జాబితాను అసైన్‌మెంట్‌ కమిటీ ముందుంచారు. దీంతో మాజీ సైనికులకు భూ కేటాయింపునకు అసైన్‌మెంట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత 2007 డిసెంబర్‌ 15న నలుగురు మాజీ సైనికులకు 5 ఎకరాల చొప్పున 20ఎకరాల భూకేటాయించినట్లు పట్టాలు వచ్చాయి(వచ్చినట్లు చూపించారు). దాదాపు ఎనిమిదేండ్ల తర్వాత 2013లో ఈ భూములకు హద్దులు చూపించారు. ప్రస్తుతం ఈ భూమి ఎకరాకు రూ.4 కోట్ల వరకు ధర పలుకుతున్నది.

చనిపోయిన తహసీల్దార్‌ సంతకాలతో పట్టాలు..

అసైన్‌మెంట్‌ కమిటీ 2005లో ఆమోదం తెలిపితే, 2007 డిసెంబర్‌లో పట్టాలు వచ్చినట్లు చూపించారు. వాస్తవానికి ఈ ఫైలును 2013లో కొత్తగా తెరిచారు. అప్పటి వరకు ఎలాంటి పట్టాలు జారీ చేయలేదు. అయితే 2007లో తహసీల్దార్‌ పరమేశ్వర్‌ పేరున సంతకాలు ఫోర్జరీ చేశారు. అప్పటికే తహసీల్దార్‌ పట్టాలు ఇచ్చారని (చనిపోయారు), ఇం దుకు సంబంధించిన భూమి చూపించాలని 2013లో తహసీల్దార్‌కు మాజీ సైనికులు దరఖాస్తు పెట్టుకున్నారు. ఇందుకు కలెక్టర్‌ అనుమతి కావాలని సీనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి సిబ్బంది వ్యతిరేకించినా, వాటిని లెక్క చేయకుండా తహసీల్దార్‌ హద్దులు చూపించారు. ఎక్కడ కూడా అనుమానం రాకుండా వ్యూహాత్మకంగా 2007 నుంచి పహానీ మొదలుకొని, అన్ని రికార్డుల్లో భూమి మాజీ సైనికుల పేరున ఉన్నట్లు ట్యాంపరింగ్‌ చేశారు. ట్యాంపరింగ్‌ ఇలా చేస్తే ఎవరు గుర్తు పట్టరు అనే విషయంలో ఈ అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌, వీఆర్వో.. ఓ నోటు తయారు చేసుకున్నారు. అందులో అన్నీ రాసుకొని, ఈ నోట్‌ ప్రకారం ఈ ముగ్గురు ఈ ఫైళ్ల కథ నడిపించారు. విచిత్రంగా ఏమరపాటుతో ఆ నోటును కూడా ఫైలులోనే పెట్టడం గమనార్హం. అంటే దొంగతనం ఎలా చేయాలని రూపొందించుకున్న ప్లాన్‌ పేపరు కూడా కలెక్టర్‌ వద్దకు వచ్చిన ఫైలులోనే ఉందన్నమాట.

ప్రత్యేకాధికారి విచారణ సర్కారుకు నివేదిక..

ఖాజీపల్లిలో మాజీ సైనికులకు భూ కేటాయింపు ఫైలు పూర్తి స్థాయిలో పరిశీలిస్తే అక్రమాలు జరిగినట్లు సంగారెడ్డి కలెక్టర్‌ గుర్తించారు. విచారణ కోసం జిల్లా మైనార్టీ వెల్ఫేర్‌ అధికారి తిరుపతిరావును నియమించారు. ఆయన విచారణ చేపట్టి నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. ఈ భూ కేటాయింపులో పూర్తిగా అక్రమాలు జరిగాయని, తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌, వీఆర్వో అక్రమాలకు పాల్పడ్డారని విచారణ అధికారి రిపోర్టు ఇచ్చారు. రికార్డుల్లో ట్యాంపరింగ్‌కు చేశారని, వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో కూ డిన నివేదికను కలెక్టర్‌ ప్రభుత్వానికి సమర్పించారు. అక్రమ ఈ భూకేటాయింపునకు సంబంధించిన పట్టాలను తక్షణమే రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. చనిపోయిన తహసీల్దార్‌ పేరుతో ఇచ్చిన పట్టాలు, సర్టిఫికెట్లను రద్దు చేసి, భూమిని తిరిగి స్వాధీనం చేసుకోనున్నారు. ఇందులో అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌, వీఆర్వోపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. కలెక్టర్‌ హనుమంతరావు ప్రత్యేక చొరవతో కోట్ల రూపాయల భూమి తిరిగి సర్కారు జాబితాలో చేరనున్నది.logo