గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Aug 04, 2020 , 02:32:25

స్కూళ్లు ఇప్పుడే తెరువొద్దు

స్కూళ్లు ఇప్పుడే తెరువొద్దు

  • ముందుగా 8, 9, 10వ తరగతులు ప్రారంభించాలి
  • n వారంలో మూడు రోజులే  నడిపించాలి 
  • n వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాతే తెరువాలి
  • n జీరో ఇయర్‌గా ప్రకటిస్తే ఇంకా మంచిది
  • n ఇదీ తల్లిదండ్రుల  అభిప్రాయాలు
  • n మెదక్‌ జిల్లాలో విద్యా  శాఖ అధికారుల సర్వే

‘కరోనా నేపథ్యంలో స్కూళ్లను ఇప్పుడే తెరువొద్దు.. మహమ్మారి ఇంకా వీడి పోలేదు.. వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాతే తెరువాలి.. ముందుగా 8, 9, 10వ తరగతి విద్యార్థులకు క్లాసులు ప్రారంభించారు. అవి కూడా వారంలో మూడు రోజులే నిర్వహించాలి.. జీరో ఇయర్‌గా ప్రకటిస్తే ఇంకా మంచిది’.. అని విద్యాశాఖ నిర్వహించిన సర్వేలో తల్లిదండ్రులు అభిప్రాయ పడ్డారు. కొవిడ్‌-19 నేపథ్యంలో పాఠశాలలు తెరువాలా? తెరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పాఠశాలలు తెరిస్తే తల్లిదండ్రులు విద్యార్థులను పంపడానికి సిద్ధంగా ఉన్నారా? బడులు తెరువకుంటే విద్యార్థులు వెనుకబడకుండా ఏ విధంగా ముందుకెళ్లాలి? ప్రసార మాధ్యమాలను ఏవిధంగా ఉపయోగించుకోవాలి? గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆన్‌లైన్‌ విద్యను ఏ విధంగా అందజేయాలి? జీరో ఇయర్‌ చేయాలా? సిలబస్‌ తదితర అంశాలపై మెదక్‌ జిల్లా వ్యాప్తంగా ఇటీవల రెండు రోజుల పాటు విద్యా శాఖ సర్వే నిర్వహించింది. అందులో కొందరు పై విధంగా చెప్పగా, సదరు సర్వే నివేదికను జిల్లా విద్యాశాఖ ప్రభుత్వానికి అందజేసింది.

మెదక్‌ : కరోనా విశ్వమారి విజృంభిస్తున్న నేపథ్యంలో గుళ్లు,  బళ్లు అన్నీ మూతపడ్డాయి. అయితే ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇస్తుండడంతో ఇప్పటికే ఆలయాలు తెరుచుకున్నాయి. బడులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పట్లో అయ్యే సూచనలు కూడా కనిపించడం లేదు. ప్రజా శ్రేయస్సే పరమావధిగా పనిచేస్తున్న కేసీఆర్‌ సర్కారు విద్యార్థుల సంక్షేమం కోసం ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుంది. పదో తరగతి విద్యార్థులు పూర్తిగా పరీక్షలు రాయకున్నా అందరినీ ప్రమోట్‌ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఇంటర్‌ విద్యార్థుల విషయంలోనూ వారికి వెసులుబాటు కల్పించింది. ఇక పాఠశాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని జూన్‌లో ప్రారంభం కావాల్సిన స్కూళ్లను ఇప్పటి వరకు కూడా ప్రారంభించలేదు. కరోనా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టే వరకు పాఠశాలల పునః ప్రారంభం ఉండదని తెలుస్తోంది. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రులతో సర్వేలు నిర్వహిస్తున్నారు. అనంతరం స్కూళ్ల రీఓపెనింగ్‌ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నారు. మెదక్‌ జిల్లాలో పాఠశాలల ప్రారంభంపై తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారనే విషయంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..

 1680 మంది అభిప్రాయాల సేకరణ..

మెదక్‌ జిల్లాలో పాఠశాలల పునః ప్రారంభించడంపై విద్యాశాఖ ఆన్‌లైన్‌ ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సేకరించిన అభిప్రాయాలను డీఈవో విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు అందజేశారు. కరోనా పరిస్థితుల్లో పాఠశాలలను ఈ ఏడాది పూర్తిగా మూసివేయాలి.. ముందుగా 8 నుంచి 10వ తరగతి వరకు ప్రారంభిస్తే బాగుంటుంది.. ఒక వేళ స్కూళ్లు తెరిస్తే వారంలో 3 రోజులు మాత్రమే స్కూళ్లు నడిపించాలి.. ఉదయం కొన్ని తరగతులు మధ్యాహ్నం కొన్ని తరగతులను నిర్వహించాలి...టీవీల్లో వివిధ చానెళ్ల ద్వారా పిల్లల చదువు కొనసాగిస్తే మంచిది.. సిలబస్‌ 50 శాతం తగ్గించాలి.. స్కూళ్లల్లో మధ్యాహ్న భోజనం కొంత కాలం వరకు వద్దు.. పరీక్షలను 2 ఎఫ్‌ఏ ప్లస్‌ ఎస్‌ఏ సరిపోతుంది.. ఇలా రకరకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జిల్లాలో సర్వేలో 1680 మంది పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు. వీరిలో 1487 మంది మెదక్‌ జిల్లాకు చెందిన వారు కాగా, మిగిలిన 193 మంది ఇతర జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. 

వాట్సాప్‌, టీ శాట్‌ ద్వారా పాఠాలు..

కరోనా వైరస్‌ నేపథ్యంలో విద్యార్థులను తల్లిదండ్రులు పాఠశాలలకు పంపే ఆలోచన లేదు. అందుకని స్కూళ్లు తెరిచేంత వరకు వీడియో పాఠాలు, వాట్సాప్‌, టీ శాట్‌, మొబైల్‌ యాప్‌, యూట్యూబ్‌ మాధ్యమాల ద్వారా పాఠాలను ప్రసారం చేస్తే సరిపోతుంది. ప్రతి స్కూల్‌లో తరగతుల వారీగా వాట్సాప్‌ గ్రూపులు తయారు చేసి ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తే మంచిది.  గ్రామీణ ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ బోధన సరి కాదనే అభిప్రాయం ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది టీవీల్లో, వీడియో పాఠాలు ప్రసారం చేస్తే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. 

 8,9,10 తరగతులే ప్రారంభించాలి..

పాఠశాలలు తెరిస్తే ముందుగా 8, 9, 10 తరగతులకు మాత్రమే స్కూళ్లు ప్రారంభిస్తే సరిపోతుంది. వారంలో మూడు రోజులు స్కూళ్లను నడపాలి. ఒక గదిలో పది మందిని మాత్రమే అనుమతించాలి. ఒకే తరగతికి ఉదయం కొందరు, మధ్యాహ్నం కొందరు ఉండేలా చూడాలి. సిలబస్‌ను 50 శాతం తగ్గించాలి. ప్రతి విద్యార్థికి శానిటైజర్లు, మాస్కులు యాజమాన్యం తప్పకుండా ఇవ్వాలి. పాఠశాల పూర్తి కాగానే ఇంటికి చేరేంత వరకు పిల్లలు భౌతిక దూరం తప్పకుండా పాటించే విధంగా అవగాహన కల్పించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లను ప్రారంభించే వరకు టీవీల్లో వివిధ చానెళ్ల ద్వారా పాఠాలు బోధించాలి. పాఠశాలలో మధ్యాహ్న భోజనం కొంత కాలం వరకు రద్దు చేయాలి.   

 నివేదికలను పంపాం.. 

మెదక్‌ జిల్లాలో నిర్వహించిన సర్వే నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాం. జీరో ఇయర్‌  చేయాలని 28 శాతం మంది, ముందుగా 8,9,10 తరగతులను ప్రారంభించాలని 66.8 శాతం, వారంలో మూడు రోజులే పాఠశాలలు నడుపాలని 30.2 శాతం మంది సర్వేలో అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పాఠశాలల విద్యార్థ్ధులకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు వాట్సాఫ్‌ ద్వారా పాఠాలను బోధించాలని ఇది వరకే సూచనలు ఇచ్చాం.

-రమేశ్‌కుమార్‌, డీఈవో


logo