శుక్రవారం 23 అక్టోబర్ 2020
Medak - Aug 02, 2020 , 23:15:25

వన సంపదను పెంచాలి

వన సంపదను పెంచాలి

జిన్నారం: వృక్ష సంపదను పెంచేందుకు ప్రతి ఒక్కకూ కృషిచేయాలని,  రాష్ట్రంలో అడవుల శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నదని, అడవుల్లోనే కాకుండా పల్లె ప్రకృతి వనాలు, పార్కులు, సామాజిక అడవుల పెంపకం,   బండ్‌ ప్లాంటేషన్‌ను ప్రభుత్వం చేపడుతోందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు.భూమిపుత్ర ఎన్‌జీవోస్‌, ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జిన్నారం మండలంలోని కొడకంచి అటవీ ప్రాంతంలో డ్రోన్‌ల ద్వారా విత్తన బంతులను చల్లే కార్యక్రమాన్ని ఆదివారం పద్మశ్రీ వనజీవి రామయ్యతో కలిసి కలెక్టర్‌ హనుమంతరావు  ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మనుషులు వెళ్లలేని అడవుల్లోని ఖాళీ ప్రాంతాల్లో డ్రోన్‌ల ద్వారా విత్తన బంతులను చల్లి మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఉన్న చోట నుంచే డ్రోన్‌ల ద్వారా మూడు కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా విత్తనాలు చల్లవచ్చన్నారు. కొడకంచి అటవీ ప్రాంతంలో లక్ష విత్తన బంతులను డ్రోన్‌ల ద్వారా చల్లుతామని తెలిపారు. అడవుల్లో వన సంపదను పెంచేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 

హరితహారం కార్యక్రమంలో పల్లెపల్లెకొ లక్ష్యం మేర మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఇస్మాయిల్‌ఖాన్‌ పేటలో మహిళా సంఘాలు బాగా పనిచేస్తున్నాయని తెలిపారు. విత్తన బంతులను తయారు చేసేందుకు మహిళా సంఘాలను ప్రోత్సహిస్తామని కలెక్టర్‌ అన్నారు. విత్తన బంతుల చల్లెందుకు ఈ సమయం అనుకూలమైందని, స్వయం సహాయక సంఘాల మహిళల చేత విత్తన బంతులు తయారు చేయిస్తామని తెలిపారు. నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ అటవీ ప్రాంతాలలో మనుషులు వెళ్లలేని ఖాళీ ప్రాంతాల్లో డ్రోన్‌ల ద్వారా రెండు లక్షల విత్తన బంతులను చల్లి వన సంపదను పెంచుతామని కలెక్టర్‌ హనుమంతరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తామన్నారు.  ప్రకృతికి సేవ చేస్తే మనుషులకు చేసినట్లే, మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడితే మంచి గాలి వస్తుందన్నారు. పద్మశ్రీ వనజీవి రామయ్య గారి జీవితం అందిరికీ ఆదర్శం అన్నారు. ఇప్పటి వరకు ఆయన కోటి మొక్కలు నాటారు. సీడ్‌బాల్స్‌ ద్వారా కోతులకు ఆహారం ఇచ్చే చెట్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.  

చెట్టు కన్నతల్లి లాంటిది: వనజీవి రామయ్య

చెట్టు కన్నతల్లి లాంటిది. లాటరీ టికెట్‌ కొంటే లాభం వస్తుందో రాదో తెలియదు కానీ, మొక్క నాటితే పండ్లు, నీడ, గాలి ద్వారా లాభం వస్తుందని పద్మశ్రీ వనజీవి రామయ్య అన్నారు. అడవుల్లో పచ్చదనం పెంచడానికి సీడ్‌ బాల్స్‌ మంచి ప్రయత్నమన్నారు. సహజంగా మొలకెత్తిన మొక్క బలంగా పెరుగుతుందని, నీటిలో చేప ఉన్నట్లుగా భూమిలో పండ్లు ఉన్నాయని, చేపను బయటకు తీయడానికి గాలం వేసినట్లుగా, భూమిలో పండ్లను బయటికి తీయడానికి మొక్క నాటాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ విధ్వంసం కొనసాగుతోందని, ప్రతిరోజు 50 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అడవి అంతరించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ మనుగడకు మొక్కల పెంపకం తప్ప ప్రత్యామ్నాయం లేదన్నారు.జ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వరావు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, ఎంపీపీ రవీందర్‌గౌడ్‌, బీట్‌ ఆఫీసర్‌ వెంకటేశ్‌, డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ రఘుపతిస్వామి, ఎంపీడీవో సుమతి, తహసీల్దార్‌ దశరథ్‌, సర్పంచ్‌ శివరాజ్‌, ఎంపీటీసీ సంతోష మహే శ్‌, ఉపసర్పంచ్‌ అభిలాష్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు. 


logo