శనివారం 24 అక్టోబర్ 2020
Medak - Aug 02, 2020 , 23:15:27

‘గజ్వేల్‌'కు.. పచ్చనిహారం

‘గజ్వేల్‌'కు..  పచ్చనిహారం

సీఎం కేసీఆర్‌ కృషితో గజ్వేల్‌ నియోజకవర్గంలో పచ్చదనం పరిఢవిల్లుతున్నది. గ్రామాలు, అటవీ ప్రాంతాలు పచ్చదనంతో  కళకళలాడుతున్నాయి. గజ్వేల్‌ అటవీ రేంజ్‌ పరిధిలోని గజ్వేల్‌, వర్గల్‌, ములుగు, జగదేవ్‌పూర్‌, మర్కూక్‌ మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో ఆరేండ్లుగా నాటిన మొక్కలు.. నేడు మానులుగా మారి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ప్రకృతి ప్రేమికుల మనసు దోస్తున్నాయి. అటవీ రేంజ్‌ పరిధిలో 1,417 హెక్టార్లలో పండ్లు, పూలు,ఇతర మొక్కలు నాటగా.. ఏపుగా పెరిగి కనువిందు చేస్తున్నాయి. గజ్వేల్‌ అర్బన్‌ పార్కులో ఏర్పాటు చేసిన పద్మవ్యూహంలో నాటిన 5వేల కోనోకార్ఫస్‌ మొక్కలు సందర్శకులను మైమరిపిస్తున్నాయి. సంగాపూర్‌, సింగాయిపల్లి, బంగ్లా వెంకటాపూర్‌, కోమటిబండ అటవీ ప్రాంతాలు నేడు అధికారులు, ప్రజాప్రతినిధులకు సందర్శన ప్రాంతాలుగా మారాయి. వివిధ రాష్ర్టాలకు చెందిన అధికారులు,ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి మొక్కల పెంపకాన్ని పరిశీలించి, హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 గజ్వేల్‌ రూరల్‌ : గజ్వేల్‌ అటవీ రేంజ్‌ పరిధిలోని గజ్వేల్‌, వర్గల్‌, ములుగు, జగదేవ్‌పూర్‌, మర్కూక్‌ మండలాల్లోని ఆయా గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతాల్లో గత ఆరేండ్లుగా నాటిన మొక్కలు పచ్చదనంతో పరిఢవిల్లుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం కేసీఆర్‌ అడవుల సంరక్షణపై దృష్టి సారించారు. ప్రభుత్వ నిర్ణయంతో కలప కోసం వెళ్లే అక్రమార్కులకు చెక్‌ పడింది.  గజ్వేల్‌ రేంజ్‌ పరిధిలో 2015-16 సంవత్సరంలో బంగ్లావెంకటాపూర్‌ అటవీ ప్రాంతంలో 52 హెక్టార్లు, ధర్మారెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో 25 హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ రకాల మొక్కలను నాటారు. 2016-17లో నర్సంపల్లిలో 50 హెక్టార్లు, మినాజీపేటలో 110 హెక్టార్లు, కోమటిబండలో 160 హెక్టార్లు, మిషన్‌ భగీరథ ట్యాంకుల ప్రాంతంలో మరో 55 హెక్టార్లు, బంగ్లావెంకటాపూర్‌ అడవిలో 21 హెక్టార్లు, గజ్వేల్‌ అర్బన్‌ పార్కు కల్పకవనంలో 105 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కలను నాటారు. 2017-18 ములుగు, నర్సంపల్లిలో 200 హెక్టార్లు, గజ్వేల్‌ షరీఫ్‌(కోమటిబండ)లో 200 హెక్టార్లలో అధికంగా మొక్కలను నాటించారు. 2018-19లో శివారు వెంకటాపూర్‌లో 40 హెక్టార్ల అటవీ భూములను అధికారులు స్వాధీనం చేసుకొని మొక్కలను నాటారు. నర్సంపల్లి బ్లాక్‌ అటవీ మసీద్‌ శివారులో 40 హెక్టార్లు, జప్తిసింగాయిపల్లిలో 20 హెక్టార్లు, రాజీవ్‌ రహదారి మార్స్‌ కంపెనీ పక్కన 42 హెక్టార్లు, గజ్వేల్‌ షరీఫ్‌ కోమటిబండలో 110 హెక్టార్లు, అర్బన్‌ పార్కులో 85 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కలను నాటడంతో అవి పెరిగి నేడు పచ్చగా కనిపిస్తున్నాయి. 2019-20లో మర్కూక్‌ మండలం కర్కపట్లలో 80 హెక్టార్లలో మొక్కలు నాటారు. అక్కడే 400 ఎకరాల అటవీ భూములను అధికారులు స్వాధీనం చేసుకొని 8 కిలోమీటర్ల వరకు కంచెను ఏర్పాటు చేశారు. అడవుల సంరక్షణలో భాగంగా ప్రభుత్వ ఆదేశానుసారం అధికారులు రేంజ్‌ పరిధిలో అడవుల పెంపకంపై ఎక్కువ దృష్టి సారించారు. ఈ యేడాది(2020-21) నర్సంపల్లి అటవీ ప్రాంతంలో 22 హెక్టార్ల విస్తీర్ణంలో 25 వేల మొక్కలను నాటారు. 

ఆరేండ్లలో 1417 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కల పెంపకం...

2015 నుంచి ఇప్పటి వరకు ఆరేండ్ల కాలంలో 1417 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ అధికారులు మొక్కలు నాటారు. వీటిలో ప్రధానంగా నెమలినార, బట్టఘనం, రావి, మర్రి, జువ్వి, వేప, నీరుదా,అల్లనేరడి, ఇరికి, పసరగాని, అడవిమామిడి, చింత, ఏగిసా,  మద్ది, వాగునుతి, ఉసిరి, తాని, కరకతో పాటు వివిధ రకాల మొక్కలు ఉన్నాయి. పండ్ల మొక్కలు పక్షులు, జంతువులకు ఎంతో ఉపయోగకరంగా మారాయి.  సింగాయిపల్లి అటవీ ప్రాంతంలో 5హెక్టార్ల విస్తీర్ణంలో 50 వేల మొక్కలను ఏఎన్‌ఆర్‌ ప్లాంటేషన్‌లో నాటారు.

మియావాకిలో 10 వేల మొక్కల పెంపకం...

గతేడాది అటవీ అధికారులు గజ్వేల్‌ అర్బన్‌ పార్కులో హెక్టారు విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మియావాకిలో 10 వేల మొక్కలను నాటారు. ఇందులో పండ్ల మొక్కలతో పాటు అటవీ ప్రాంతాల్లో విరివిగా పెరిగే 22 రకాల మొక్కలకు ప్రాధాన్యతను కల్పించారు. హెక్టారు విస్తీర్ణంలో 10 వేల మొక్కలను మీటరుకు ఒకటి చొప్పున నాటడంతో ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. ఈ మొక్కలు ఏపుగా పెరగడంతో ప్రస్తుతం అందులోకి ప్రవేశించేందుకు వీలుపడదు.

పద్మవ్యూహంలో 5వేల మొక్కలు...

గజ్వేల్‌ అర్బన్‌ పార్కులో ఏర్పాటు చేసిన పద్మవ్యూహంలో కోనోకార్ఫస్‌కు చెందిన 5వేల మొక్కలను నాటారు. ఇందులో ప్రవేశ మార్గంతో పాటు బయటకు వచ్చేందుకు వీలుగా దారులను ఏర్పాటు చేశారు. అందులోకి ప్రవేశ మార్గం గుండా వెళ్లిన వారు గజిబిజిగా ఉండే పద్మవ్యూహంలో బయటకు రావడం కష్టతరంగా ఉంటుంది. పచ్చదనంతో కోనోకార్ఫస్‌ మొక్కలు ఏపుగా పెరిగాయి. తెలియని వారు వెళితే రావడానికి సమయం పడుతుంది. అధికారులు ఎంతో శ్రమించి ఈ పద్మవ్యూహాన్ని ఏర్పాటు చేయించారు. 

ప్రయోగశాలగా మారుతున్న అటవీ ప్రాంతం...

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనలలో జిల్లా అటవీ అధికారి శ్రీధర్‌రావు, అటవీ రేంజ్‌ అధికారి వెంకటరామారావులు సంగాపూర్‌, సింగాయిపల్లి, బంగ్లావెంకటాపూర్‌, కోమటిబండ అటవీ ప్రాంతాల్లో నాలుగేండ్ల కింద విరివిగా మొక్కలను నాటారు.  వివిధ రాష్ర్టాలకు చెందిన అధికారులు ఇక్కడికి వచ్చి మొక్కల పెంపకాన్ని పరిశీలించారు.   ప్రతి ఏటా అధికారుల పర్యటనతో ఈ ప్రాంతం ప్రయోగశాలగా మారిందని చెప్పొచ్చు. అక్కడి అటవీ ప్రాంతాన్ని ఐఏఎస్‌, ఏఎఫ్‌ఎస్‌ అధికారులతో పాటు శిక్షణాధికారులు పర్యటించిన సందర్భంలో గజ్వేల్‌ అటవీ అధికారులపై ప్రశంసల వర్షం కురుస్తున్నది.

మంత్రులు, కలెక్టర్లతో కలిసి పర్యటించిన సీఎం కేసీఆర్‌...

గడిచిన సంవత్సరం సీఎం కేసీఆర్‌ మంత్రులతో కలిసి సింగాయిపల్లి, కోమటిబండ అటవీ ప్రాంతాలను పరిశీలించారు. అధికారుల ద్వారా అడవుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అడవుల పెంపకంపై ప్రత్యేకంగా చొరవ తీసుకొవాలని మంత్రులు, కలెక్టర్లకు సీఎం కేసీఆర్‌ సూచించారు.

అందరి కృషి ఫలితమే అటవీ సంరక్షణ

ఉన్నతాధికారుల సూచనలతో రేంజ్‌ పరిధిలోని అటవీ ప్రాంతాలను పచ్చదనంగా మార్చాం. ఇందులో బీట్‌, సెక్షన్‌ అధికారులతో పాటు జిల్లా అధికారుల కృషి ఎంతో ఉంది. ఆరేండ్ల పాటు కష్టపడడంతో నేడు అటవీ ప్రాంతాలు పచ్చని చెట్లతో కనిపిస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడడంతోనే మంచి ఫలితం దక్కింది. త్వరలోనే అడవుల్లో పెట్టిన పండ్ల మొక్కల ఫలాలు అందనున్నాయి. అర్బన్‌పార్కులో వివిధ రకాల మొక్కలను పెంచడంతో పాటు కొత్తగా మార్చాం.

- వెంకటరామారావు, ఎఫ్‌ఆర్‌వో, గజ్వేల్‌logo