గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Aug 01, 2020 , 23:46:52

నేస్తమే సమస్తం

నేస్తమే సమస్తం

సృష్టిలో అత్యంత మధురమైనది స్నేహం ఒక్కటే. చిన్నప్పుడు ఏర్పడిన అనుబంధాలు... అనుభూతులకు నెలవై అత్మీయతకు చిహ్నంగా మారేదే స్నేహం. ఆస్తులను ఆర్జించేవాడు కాదు... ఆప్తులను సంపాదించుకున్నవాడే నిజమైన స్నేహితుడని చెప్పక తప్పదు.  

హుస్నాబాద్‌ టౌన్‌ : కష్టాలు... కన్నీళ్లు ఎదురైనా.... తోడుండేవాడే నిజమైన స్నేహితుడు. దీనికి వాస్తవ రూపుమిచ్చే మనుషులు ధన్యులు.. వారిని పొందినవారు ధన్యజీవులు. మానవ సంబంధాలు నేడు ఆర్థికపరమైన బంధాలుగా ముడిపడుతున్న ప్రస్తుత కాలంలో స్వచ్ఛమైన స్నేహం కోసం తాపత్రయపడేవాళ్లు ఎందరో ఉన్నారు. ఉరుకులు.. పరుగులతో కాలం వెళ్లదీస్తున్న అనేక మందికి ఊరట నిచ్చేదే స్నేహం. ఎంత ఎత్తుకు ఎదిగినా పిలుపు మారదనడానికి స్నేహమే నిదర్శనం. ఆయా పరిస్థితుల్లో  ఎదురవుతున్న సమస్యలను సైతం కుటుంబ సభ్యులకు చెప్పుకోకుండా స్నేహితులతోనే పంచుకునే పరిస్థితులు ఉన్నాయంటే స్నేహంలో ఉండే నిజాయితీకి నిదర్శనం. పరిస్థితులు మారినా స్నేహానికి విలువనిస్తూ... తోటివారి సమస్యలను పంచుకోవడమే కాకుండా వాటిని పరిష్కరిస్తూ.. ఆదుకునే స్నేహితులను సంపాదించు కున్నవారు ధన్యులు.  స్నేహమేరా జీవితం... స్నేహమేరా శాశ్వతం అంటూ హుస్నాబాద్‌ ప్రాంతంలో పలువురు స్నేహితుల దినోత్సవాన్ని ఏటా ఘనంగా నిర్వహించుకుంటున్నారు.

కష్టాల్లో తోడుగా నిలుస్తున్న స్నేహితులు.. 

 హుస్నాబాద్‌లో 1984ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌కు చెందిన పలువురు తమతో చదువుకున్న మిత్రులకు అండగా ఉంటూ ఆర్థికంగా అదుకుంటున్నారు. వీరి మిత్రుడు నల్లబెల్లి శ్రీకాంత్‌ మృతి చెందగా.. కూతురు వివాహానికి 2.60లక్షల ఆర్థిక సాయం అందజేసి, ఆదుకున్నారు తోటి మిత్రులు. ఆలాగే, మరో స్నేహితుడు రఘుపతి కుటుంబం కష్టాల్లో ఉండగా రూ.40 వేలు, కిరణ్‌ కుటుంబానికి రూ.10 వేలు, మరో మిత్రుడి కుటుంబానికి రూ. 50 వేలు అందజేసి చిన్ననాటి మిత్రులు ఆర్థ్ధికంగా ఆదుకుంటున్నారు. ఇదే బ్యాచ్‌కు చెందిన విద్యార్థి, నేడు కరీంనగర్‌ జిల్లాకు అదనపు కలెక్టర్‌గా పని చేస్తున్న గాజుల శ్యాంప్రసాద్‌ కూడా కరోనా సమయంలో స్నేహితులకు బియ్యం, నిత్యావసర సరుకులను అందజేసి, ఆదుకున్నారు.

 మిత్ర మండలి.. 

చిన్ననాడు ఏర్పడిన స్నేహం చిరకాలంగా ఉండేందుకుగాను హుస్నాబాద్‌కు చెందిన 1987లోని 10వ తరగతికి చెందిన 40 మంది విద్యార్థులు మిత్రమండలిగా ఏర్పడ్డారు. చిన్ననాటి స్నేహితులు పెట్టుగడి శ్రీనివాస్‌, కరుణాకర్‌ మృతిచెందగా, వారి కుటుంబాలకు రూ.10వేల చొప్పున ఆర్థ్ధిక సహాయాన్ని మిత్రమండలి సభ్యులు అందజేశారు. పారిశుధ్య కార్మికుడైన మల్లేశానికి సైకిల్‌కొనిచ్చి చేయూతగా నిలిచారు. స్థానిక క్రీడాకారులకు క్రీడా సామగ్రితోపాటు క్రీడాదుస్తులను అంద జేశారు. దీంతోపాటు రెండేండ్లుగా హుస్నా బాద్‌ సర్కారు బడిలో చదువుతున్న విద్యార్థులకు నోట్‌ బుక్స్‌ అందజేసి, ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తు న్నారు. ఇలా అనేకమంది తమ చిన్ననాటి స్నేహా లను గుర్తుచేసుకుంటూ ప్రతిరోజూ స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు.


logo