బుధవారం 05 ఆగస్టు 2020
Medak - Jul 31, 2020 , 23:42:58

బంపర్‌ ఆఫర్‌.. ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ 90శాతం మాఫీ

 బంపర్‌ ఆఫర్‌.. ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ 90శాతం మాఫీ

మెదక్‌ : మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీని 90శాతం మాఫీచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఒకేసారి మొత్తం బకాయి చెల్లిస్తే, దానిపై వడ్డీ చెల్లింపులో 90శాతం తగ్గించనున్నట్టు ప్రకటించింది. దీంతో మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు బకాయీదారులకు ఊరట లభించనుంది. వన్‌ టైం సెటిల్‌మెంట్‌ స్కీం(ఓటీఎస్‌) కింద ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు పట్టణాల్లో ఆటోల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని మున్సిపాలిటీల్లో కొన్నేండ్లుగా పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలు చెల్లించే విధంగా మున్సిపల్‌ రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మెదక్‌ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు..

మెదక్‌ జిల్లాలో మెదక్‌ మున్సిపాలిటీ పాతది కాగా, తూప్రా న్‌, నర్సాపూర్‌, రామాయంపేట మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. మున్సిపాలిటీలకు ప్రధాన ఆదాయ వనరు  ఆస్తి పన్నుతో పాటు ఇతర పన్నుల రాబడితో మున్సిపాలిటీలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది జీతభత్యాలు, పారిశుధ్య కార్మికులతో పాటు ఇతర అభివృద్ధి పనులకు పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని వ్యయం చేస్తుంటారు. మెదక్‌ మున్సిపాలిటీతో పాటు నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేట మున్సిపాలిటీల్లో ప్రతి ఏడాది ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. ముందుగానే మున్సిపాలిటీల్లో ఎంత టార్గెట్‌ పూర్తి చేయాలో మున్సిపల్‌ కమిషనర్లతో పాటు రెవెన్యూ సిబ్బంది లక్షాన్ని నిర్దేశించుకుంటారు. ముందుగా బకాయీదారులకు నోటీసులను అందజేస్తారు. బకాయిదారులు సరైన సమయంలో ఆస్తి పన్ను చెల్లించకుంటే ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరిస్తారు. దీంతో మొండి బకాయిలపై ప్రభుత్వం వడ్డీ మాఫీని ఆఫర్‌గా ప్రకటించింది. 

 ఆస్తి పన్ను వడ్డీ మాఫీ ప్రారంభం..

2019-20 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న బకాయి పూర్తిగా వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీం(ఓటీఎస్‌) కింద చెల్లించాలి. చెల్లించిన వారికి బకాయిపై 90శాతం వడ్డీ మాఫీ ఇచ్చి, 10 శాతం వడ్డీ వసూలు చేయనున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్‌ 15 వరకు గడువు ఉంటుంది. జిల్లాలోని మెదక్‌ మున్సిపాలిటీలో అత్యధికంగా రూ.2.22 కోట్ల ఆస్తి పన్ను బకాయి ఉంది. నర్సాపూర్‌ మున్సిపాలిటీలో రూ.21.38 లక్షలు, తూప్రాన్‌ మున్సిపాలిటీలో రూ.4 లక్షలు, రామాయంపేట మున్సిపాలిటీలో రూ.23.77 లక్షల బకాయిలు ఉన్నాయి. 

పట్టణాల్లో ఆటోలతో ప్రచారం..

జిల్లాకేంద్రమైన మెదక్‌ పట్టణంలో ఆస్తి పన్ను వడ్డీ మాఫీపై ఆటోలతో ప్రచారం చేస్తున్నారు. ఇందుకు మున్సిపల్‌ కమిషనర్‌ బకాయిదారులకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని తూప్రాన్‌, నర్సాపూర్‌, రామాయంపేట మున్సిపాలిటీల్లో సైతం కరపత్రాలు, ఫ్లెక్సీలతో ప్రచారం చేయడంతో పాటు మున్సిపల్‌ సిబ్బంది బకాయీదారుల ఇంటికి వెళ్లి వడ్డీ మాఫీపై యజమానులకు చెప్పనున్నారు. 


logo