మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Jul 31, 2020 , 23:17:41

తనదైన శైలిలో జిల్లా అభివృద్ధికి కృషి

 తనదైన శైలిలో  జిల్లా అభివృద్ధికి కృషి

మెదక్‌ : మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా దాదాపు రెండున్నర ఏండ్ల పాటు పనిచేసిన ధర్మారెడ్డి శుక్రవారం ఉద్యోగ విరమణ పొందారు. 2018 మార్చి 14న మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా ధర్మారెడ్డిని ప్రభుత్వం నియమించింది. అదే రోజు ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయన పనిచేసిన కాలంలో జిల్లాను అన్నిరంగాల్లో ముందు నిలిపేందుకు, అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషిచేశారు. తనదైన శైలిలో ఆయన జిల్లా బాస్‌గా సేవలందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను పక్కాగా అమలు చేశారనే పేరుంది ఆయనకు. అభివృద్ధి, సంక్షేమం, విద్య, పారిశుధ్యం అమలులో రాష్ట్ర స్థాయిలోనే జిల్లాకు గుర్తింపు తీసుకువచ్చారు. ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. 

సేవా పురస్కారం.. : వయోవృద్ధుల చట్టం-2017ను పక్కాగా అమలు చేసినందుకు రాష్ట్రస్థాయిలో మెదక్‌ జిల్లా ఉత్తమ పురస్కారానికి ఎంపికైంది. దీనికి గాను కలెక్టర్‌ ధర్మారెడ్డి అవార్డు అందుకున్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా కేటగిరీ-2లో అనుమతులు ఇచ్చి పరిశ్రమల స్థాపనకు కృషిచేసి జిల్లాను రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిపారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, హరితహారం, క్రీడా శిబిరాలు ఏర్పాటు చేసినందుకు కలెక్టర్‌ ధర్మారెడ్డికి సేవా పురస్కారం దక్కింది.

మంత్రిచే శభాష్‌ అనిపించుకున్న ధర్మారెడ్డి :  మెదక్‌ జిల్లాను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు బాగా కష్టపడుతున్నారని మంత్రి హరీశ్‌రావును చాలా సందర్భాల్లో ధర్మారెడ్డిని అభినందించారు. జిల్లాలో  వైకుంఠధామాలు, రైతు వేదికలు, డంపింగ్‌యార్డులు, రైతు కల్లాల నిర్మాణంలో కలెక్టర్‌ ధర్మారెడ్డి ప్రత్యేక దృష్టిపెట్టారు. సమీక్షలు నిర్వహిస్తూనే సమాంతరంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధి పనులు పక్కగా అమలు చేశారు. 

సన్మానం : మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి శుక్రవారం ఉద్యోగ విమరణ పొందడంతో కలెక్టరేట్‌లో  ఆయా శాఖల అధికారులు సన్మానించారు. అదనపు కలెక్టర్లు నగేశ్‌, వెంకటేశ్వర్లు, డీపీవో హనోక్‌, డీఆర్‌డీవో శ్రీనివాస్‌, డీఈవో రమేశ్‌కుమార్‌, ఇరిగేషన్‌ శాఖ ఈఈ ఏసయ్య, పంచాయతీరాజ్‌ ఈఈ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు, నోడల్‌ అధికారి మధుమోహన్‌, సైన్స్‌ అధికారి రాజిరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.


logo