ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Jul 30, 2020 , 23:12:20

నల్లవాగుకు జలకళ

నల్లవాగుకు జలకళ

సిర్గాపూర్‌ : నల్లవాగు ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. గురువారం ప్రాజెక్టులోకి 1259 క్యూసెక్కుల వరద వచ్చిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటి మట్టంతో ప్రాజెక్టు నిండుకుండలా జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా దిగువన కల్హేర్‌ మండలంలోని ఆరు చెరువులు, సిర్గాపూర్‌ మండల పరిధి పోచాపూర్‌ పెద్ద చెరువు, కామారెడ్డి జిల్లా మార్ధండ, తిమ్మనగర్‌ చెరువులు నింపేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1493 అడుగులు ఉండగా, ప్రస్తుతం 1259 క్యూసెక్కుల వరద నీరు  చేరుతున్నది. కుడి పంట కాల్వ ద్వారా 90 క్యూసెక్కులు, ఎడమ పంట కాల్వ ద్వారా 30 క్యూసెక్కులు, అలుగు ద్వారా 1139 క్యూసెక్కుల వరద దిగవకు పారుతూ మంజీర నదిలో కలుస్తున్నది. కుడి, ఎడమ కాల్వల ద్వారా 9 చెరువుల్లోకి నీరు పారేందుకు  గత వేసవిలో అధికారులు  ప్రత్యేక తూములను నిర్మించారు. ప్రధాన కాల్వ కుండానీరు సాఫీగా పారేందుకు కాల్వలో చెత్తాచెదారం, ముండ్ల కంచెలను తొలిగించారు. 

సింగూర్‌కు జలకళ..

పుల్కల్‌ : ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వరద వస్తుండడంతో సంగారెడ్డి జిల్లాలోని సింగూర్‌ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటున్నది. ప్రాజెక్టులోకి బుధవారం 6,300 క్యూసెక్కులు, గురువారం 7,330 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. ఈ ఏడాది ప్రాజెక్టులోకి ఇప్పటి వరకు 17 వేల క్యూసెక్కుల వరద వచ్చిందదని నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈఈ రామస్వామి తెలిపారు.  సింగూర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 523.600 మీటర్లు (29.917 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం డ్యాంలో 511.800 మీటర్లు (1.346 టీఎంసీలు) నీరుంది. మూడేండ్ల నుంచి ప్రాజెక్టులోకి భారీ వరద ప్రవాహాలు లేకపోవడంతో  నీటిమట్టం కనిష్ట స్థాయికి పడిపోయింది. సింగూర్‌ ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీరుంటే మిషన్‌ భగీరథ 9టీఎంసీలు, స్థానిక పంట కాల్వలకు రెండు టీఎంసీలు, నిజాంసాగర్‌కు 8 టీఎంసీలు, ఘనపూర్‌ ఆయకట్టుకు 4 టీఎంసీలు, హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ జంట నగరాల తాగునీటికి నాలుగు ఫేజ్‌ల ద్వారా 4 టీఎంసీల నీటిని కేటాయించి విడుదల చేస్తారు. ప్రస్తుతం రెండేండ్లుగా ప్రాజెక్టులోకి వరద నీరు చేరకపోవడంతో సాగునీటి పథకాలకు మినహాయించి కేవలం మిషన్‌ భగీరథకు మాత్రమే నీటిని సరఫరా చేశారు. logo