బుధవారం 21 అక్టోబర్ 2020
Medak - Jul 30, 2020 , 23:12:21

సేంద్రియ సాగుకు.. జీవం

సేంద్రియ సాగుకు.. జీవం

  • 51 రకాల దేశీ  వరి విత్తనాల సాగు
  • ఆదర్శంగా నిలుస్తున్న రైతు జంట.. జక్కుల రేణుక, తిరుపతి

 ఎక్కడ చూసినా హైబ్రిడ్‌ రకం విత్తనాలు, రసాయన ఎరువులతో సాగు.. ఆరోగ్యం సంగతి అటుంచి.. దిగుబడుల మీదనే ధ్యాస. నేడు వ్యవసాయం ఇలానే కొనసాగుతోంది. హైబ్రిడ్‌ విత్తనాల పోకడలతో దేశీ  విత్తనాలు నామరూపాల్లేకుండా పోతున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నో పోషక విలువలున్న దేశీ  విత్తనాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ సేంద్రియ వ్యవసాయానికి జీవం పోస్తున్నారు ఆదర్శ జంట.             

 అర ఎకరంలో 51 రకాల  వరి విత్తనాల సాగు..

చేర్యాల మండలం నాగాపూర్‌కు చెందిన జక్కుల తిరుపతికి సేంద్రియ వ్యవసాయం అంటే ప్రాణం. తన భార్య రేణుకతో కలిసి నాగాపూర్‌తోపాటు తొగుట మండలం లింగాపూర్‌లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు. అంతరించి పోతున్న దేశీ  విత్తనాలకు జీవం పోయడంతో పాటు సేంద్రియంగా పంటలు పండించి రైతులను ప్రోత్సహిస్తున్నారు. గతంలో క్యాన్సర్‌ వ్యాధికి దివ్య ఔషధంగా పనిచేసే కాలాబట్టి, చింతలూరి సన్నం, దాస్వాతి లాంటి వరి పంటలను పండించారు. దేశీయంగా ఉన్న వరి విత్తనాల్లో సుమారుగా 51 రకాల విత్తనాలను సేకరించి అర ఎకరంలో వాటిని ప్రతేకంగా సాగు చేయించాడు. మన వాతావరణ పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడులు వస్తుందో అలాంటి  దేశీ వరి విత్తనాలను రైతులకు అందిస్తామని తెలిపారు. 2 ఎకరాల్లో శ్రీవరి సాగు చేశారు. వాటిలో చింతలూరి సన్నం, కుజి పటాలి రకం వరి రకాలను సాగు చేశారు. వరి పొలంలో ప్రధాన మంత్రి మోదీ, సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేర్లు వచ్చేలా సాగు చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు.. మామిడి తోట మధ్యలో పొప్పడి, మునగ, కంది, పచ్చజొన్నను అంతర పంటలుగా సాగు చేశారు. వర్షాకాలంలో 50 మంది రైతులకు నల్ల వడ్ల వరి విత్తనాలను ఉచితంగా అందజేశారు. విత్తనాలు తీసుకున్న రైతులు పంట చేతికి వచ్చాక తలా 2 కిలోల విత్తనాలు తిరిగి తమకు ఇవ్వాలని వారితో ఒప్పందం చేసుకున్నారు. ఇలా సేకరించిన విత్తనాలను  ఎక్కువ మంది రైతులకు అందించడమే తమ లక్ష్యమని రైతు తిరుపతి పేర్కొంటున్నారు. దేశీయ విత్తనాల మనుగడ కోసం పాటు పడుతున్న జక్కుల అరుణ, తిరుపతు దంపతులు నేటి సమాజానికి 

ఆదర్శనీయులు.  


logo