గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Jul 30, 2020 , 00:03:31

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎక్కడికక్కడ కరోనా పరీక్షలు.. నిమిషాల్లో ఫలితాల వెల్లడి

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎక్కడికక్కడ కరోనా పరీక్షలు.. నిమిషాల్లో ఫలితాల వెల్లడి

  • l  ప్రధాన దవాఖానలతో పాటు పీహెచ్‌సీలు   సహా 102 సెంటర్లలో కొవిడ్‌-19 టెస్టులు
  • l  లక్షణాలు ఉన్నవారికి టెస్టులు చేస్తున్న వైద్య సిబ్బంది
  •  l ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రోజువారీగా 1100 పైగా   ర్యాపిడ్‌ టెస్టులు
  •  l  సంగారెడ్డి, సిద్దిపేటల్లో వంద పడకలతో కొవిడ్‌-19 వార్డులు..
  •  l  లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని   వైద్యుల సూచన

 జ్వరం, జలుబు, దగ్గు తగ్గకుంటే వెంటనే దవాఖానకు వెళ్లాలి. కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ఏమాత్రం ఆందోళన అక్కర లేదు. నేరుగా వైద్యుల వద్దకు వెళ్లడం ఉత్తమ మార్గం. లేదంటే కరోనాతో ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు వైద్యులు. ఎక్కడో ఉన్న గాంధీ, ఉస్మానియా దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలా..? పరీక్షలకు ప్రైవేట్‌ దవాఖానల్లో వేల రూపాయలు ఖర్చు చేసుకోవాలా..? అనుకుంటున్నారు కదా. అలాంటిదేమి లేదు. మీ గ్రామంలో లేదా సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తే సరిపోతుంది. అక్కడ ఉచితంగా కరోనా పరీక్షలు చేస్తున్నారు. పరీక్షల్లో పాజిటివ్‌ రిపోర్టు వస్తే మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా జిల్లా , ఏరియా దవాఖానలతో సహా ఇప్పుడు పీహెచ్‌సీల్లో సైతం కొవిడ్‌-19 టెస్టులు చేస్తున్నారు. మొత్తం 102 సెంటర్లలో కొవిడ్‌-19 టెస్టులు నిర్వహిస్తున్నారు. రోజు వారీగా సంగారెడ్డి జిల్లాలో 450, సిద్దిపేటలో 350, మెదక్‌ జిల్లాలో 300 వరకు కొవిడ్‌-19 ర్యాపిడ్‌ టెస్టులు చేస్తున్నారు. కేవలం అరగంటలోనే వీటి ఫలితాలు వెళ్లడవుతున్నాయి. వచ్చిన ఫలితాల ఆధారంగా వైద్య సిబ్బంది సీరియస్‌ ఉన్నవారికి మెరుగైన, లక్షణాలు లేని వారిని హోం ఐసొలేషన్‌ ఉంచి చికిత్సలు అందిస్తున్నారు.  -సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ   

102 వైద్య కేంద్రాల్లో కొవిడ్‌-19 టెస్టులు..

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌లో ఎక్కడికక్కడ కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. మొదట్లో పరీక్షల కోసం ఎవరైనా హైదరాబాద్‌లోని గాంధీ లేదా ఉస్మానియా, కోఠి దవాఖానలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ దవాఖానలపై తీవ్రమైన భారం పెరిగిందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా దవాఖానల్లో కొవిడ్‌-19 టెస్టులు చేయించింది. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా, వ్యాధి తీవ్రతను నిరోధించడం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెస్టులు చేసేలా చర్యలు చేపట్టింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 102 సెంటర్లలో ప్రస్తుతం టెస్టులు చేస్తున్నారు. 

సంగారెడ్డి జిల్లాలో...

సంగారెడ్డి జిల్లా దవాఖానతో పాటు సదాశివపేట, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోలు, పటాన్‌చెరు దవాఖానల్లో పరీక్షలు చేస్తున్నారు. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా మరో 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెస్టులు చేస్తున్నారు.

సిద్దిపేట జిల్లాలో...

సిద్దిపేట జిల్లా దవాఖానతో పాటు గజ్వేల్‌, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్‌లో పాటు మరో 32 పీహెచ్‌సీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మెదక్‌ జిల్లాలో...

మెదక్‌ జిల్లా దవాఖానతో పాటు నర్సాపూర్‌, రామాయంపేట, మరో 20 పీహెచ్‌సీల్లో కొవిడ్‌-19 టెస్టులు చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 1100 వరకు టెస్టులు...

సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో మొత్తం 102 సెంటర్లలో రోజువారీగా దాదాపు 1100 పైగా కొవిడ్‌-19 టెస్టులు నిర్వహిస్తున్నారు. టెస్టుల కోసం ప్రతి సెంటర్‌కు ప్రభుత్వం కొవిడ్‌-19 కిట్లను ఇటీవలే అందించింది. నమూనాలు సేకరించిన తర్వాత కేవలం అరగంటలోనే ర్యాపిడ్‌ టెస్టు ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. ఈ విషయాన్ని వైద్యులు నేరుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన 80శాతం మందిలో ఎలాంటి లక్షణాలు ఉండడం లేదు. 15 శాతం మందిలో కొంత లక్షణాలు ఉంటున్నాయి. కేవలం 5 శాతం మందిలో మాత్రమే తీవ్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాంటి వారిని వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలిస్తున్నారు. స్వల్ప లక్షణాలు ఉన్నవారికి స్థానిక దవాఖానల్లో చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి లక్షణాలు లేని వారిని హోం ఐసొలేషన్‌లోనే ఉంచి వైద్యుల పర్యవేక్షణలో సేవలు అందిస్తున్నారు. వారం,పది రోజుల్లో అందరూ కోలుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 

200 బెడ్లతో ప్రత్యేక వార్డులు...

కొవిడ్‌-19 బాధితుల కోసం సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో 200 పడకల ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. సంగారెడ్డిలోని ఎమ్మెన్నార్‌ దవాఖానలో 100 పడకలు, సిద్దిపేటలోని వైద్య కళాశాలలో 100 పడకలు కొవిడ్‌-19 బాధితుల చికిత్సకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వీటితో పాటు సంగారెడ్డి జిల్లా దవాఖానలో కూడా 20 వరకు బెడ్లు  బాధితుల చికిత్సకు వాడుతున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎక్కడా బెడ్ల కొరుత లేకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓవైపు ఎక్కడికక్కడ టెస్టులు నిర్వహించడంతో పాటు మరోవైపు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. రోజువారీగా మంత్రి హరీశ్‌రావు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జిల్లాల వారీగా కలెక్టర్లు, వైద్య సిబ్బందితో ఎప్పటికప్పుడు పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. కలెక్టర్లు వెంకట్రామ్‌రెడ్డి, హనుమంతరావు, ధర్మారెడ్డి దవాఖానల్లో చికిత్స, టెస్టులను పర్యవేక్షిస్తున్నారు. వైద్య సిబ్బంది విరామం లేకుండా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. 

లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలి...

దగ్గు, జలుబు, జ్వరం తగ్గకుండా ఉంటే వైద్యులను సంప్రదించి కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లక్షణాలు కనిపించగానే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరీక్షలు చేయించుకుని పాజిటివ్‌ రిపోర్టు వస్తే మెరుగైన చికిత్స తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. స్థానికంగా గ్రామ పీహెచ్‌సీలోనే టెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో లక్షణాలు ఉన్న వారు పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.  సాధారణ జలుబు కూడా ఉండే పరిస్థితి ఉన్నదని, వైద్యులను సంప్రదిస్తే ముందు పరీక్షించిన తర్వాత కొవిడ్‌ టెస్టులు చేయించుకోవాలా..? లేదా..? చెబుతారని సూచిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో కేవలం 5శాతం కంటే తక్కువ మంది మాత్రమే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, మిగతా వారు సాధారణ చికిత్సతో కోలుకుంటున్నారని సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి మోజీరాం రాథోడ్‌ చెప్పారు. చాలా వరకు హోం ఐసొలేషన్‌ నుంచే కోలుకుంటున్నారన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.  


logo