శుక్రవారం 23 అక్టోబర్ 2020
Medak - Jul 28, 2020 , 22:58:11

సిద్దిపేట జిల్లాలో నీలి విప్లవం

సిద్దిపేట జిల్లాలో నీలి విప్లవం

  • n 1591 చెరువుల్లో  చేపలు వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం
  • n 4.37 కోట్ల  చేపపిల్లలు వదలడమే లక్ష్యం
  • n ఆగస్టు 5 నుంచి  చేపపిల్లల వదిలే ప్రక్రియ ప్రారంభం
  • n కొండపోచమ్మ  రిజర్వాయర్‌లోకి 14.37 లక్షలు..
  • n రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌లోకి 13.20 లక్షల చేప పిల్లలు

గ్రామాల జీవనం నీటి వనరులపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ సర్కారు పుణ్యమాని పల్లెల్లోని చెరువులు నీటితో నిండుతుండగా, కురుస్తున్న వర్షాలతో నిండుకుండలా మారి కళకళలాడుతున్నాయి. దీంతో కులవృత్తులనే నమ్ముకుని జీవించే వారికి చేతినిండా పని లభిస్తున్నది. ముఖ్యంగా మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయి. మత్స్యసంపదను పెంచుకుని ఆర్థికంగా ఎదిగేందుకు సర్కారు కూడా సబ్సిడీలను అందజేస్తున్నది. చేప పిల్లలను ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేస్తుండడంతో చెరువులు జల పుష్పాలతో నిండుతున్నాయి. దీంతో మత్స్యకారుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది.

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: ఈ ఏడాది చెరువులు, చెక్‌డ్యాంల్లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు వస్తున్నాయి. వందశాతం సబ్సిడీపై ప్రభుత్వం చేపపిల్లలను పంపిణీ చేస్తుండగా, మత్స్యకారులకు చేతినిండా పని దొరుకుతుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ జిల్లాలోని 1591 చెరువులు, రంగనాయక సాగర్‌, కొండపోచమ్మ రిజర్వాయర్లలో మొత్తం 4 కోట్ల 37 లక్షల  చేప పిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియను పూర్తవగా, ఆగస్టు 5 నుంచి చేపపిల్లలు చెరువుల్లో విడువనున్నారు.  

సిద్దిపేట జిల్లాలో అధిక సంఖ్యలో చేపలు పెంచడం ద్వారా నీలి విప్లవాన్ని సృష్టించనున్నారు. కాళేశ్వరం నీళ్లతో గొలుసుకట్టు చెరువులు నిండుతుండగా, ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా పడడంతో చెరువులు, చెక్‌డ్యాంల్లో నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని చెరువుల్లో చేపపిల్లలు వదలాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకయ్య నేతృత్వంలో 2020-21వ ఆర్థిక సంవత్సరానికి జిల్లాలోని 1591 చెరువులతో పాటు రంగనాయక రిజర్వాయర్‌, కొండపోచమ్మ, తపాస్‌పల్లి, తోటపల్లి ఆన్‌లైన్‌ రిజర్వాయర్లల్లో కలిపి మొత్తం 4 కోట్ల 37  లక్షల చేపపిల్లలను వదిలేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో రొయ్య, బొచ్చరవ్వ, బంగారుతీగ, మ్రిగాల్‌ జాతికి చెందిన చేపపిల్లలతో పాటు ఇతర జాతికి చెందిన చేపపిల్లలున్నాయి.  

కొండపోచమ్మ, రంగనాయక సాగర్‌లోకి చేపపిల్లలు

జిల్లాలోని కొండపోచమ్మ రిజర్వాయర్‌ సామర్థ్యం 15 టీఎంసీలు. మే నెలలో సీఎం కేసీఆర్‌ ఈ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు. దీంతో సమీపంలోని చెరువులు నింపారు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌లో అధికారులు 14 లక్షల 35 వేల చేపపిల్లలను వదలనున్నారు. అలాగే, రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ 3 టీఎంసీల సామర్థ్యం. ఈ రిజర్వాయర్‌ నుంచి గోదావరి జలాలను కుడి, ఎడమ కాల్వల ద్వారా చెరువులు నింపారు. ఈ రిజర్వాయర్‌లో 13 లక్షల 20 వేల చేపపిల్లలను విడుదల చేసేందుకు మత్య్సశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. తపాస్‌పల్లి రిజర్వాయర్‌తో పాటు, తోటపల్లి ఆన్‌లైన్‌ రిజర్వాయర్‌, లద్దునూర్‌ రిజర్వాయర్‌, శనిగరం మధ్యతరహా ప్రాజెక్టులతో పాటు జిల్లాలోని కొన్ని పెద్ద చెరువుల్లో రొయ్య జాతి చేపపిల్లలను వదలేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది పెద్దఎత్తున చేప పిల్లలను వదలడంతో చేపల ఉత్పత్తి ఘణనీయంగా పెరుగనున్నది.

1591 చెరువుల్లోకి చేపపిల్లలు..

సిద్దిపేట జిల్లాలో ఈ ఏడాది 1591 చెరువుల్లో 4 కోట్ల 37 లక్షల చేపపిల్లలను వదలనున్నారు. ఈ మేరకు మత్స్యశాఖ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. జిల్లాలో మూడేండ్ల నుంచి చేపపిల్లల వదిలిన వివరాలు. 2017-18 సంవత్సరంలో 1448 చెరువు, కుంటల్లో 3 కోట్ల 8 లక్షల చేపపిల్లలు, 2018-19 సంవత్సరంలో 1446 చెరువులు, కుంటల్లో 3 కోట్ల 30 లక్షలు, 2019-20 సంవత్సరంలో 780  చెరువుల్లో 2 కోట్ల 48 లక్షల చేపపిల్లలను వదిలారు. ఫైలట్‌ ప్రాజెక్టు కింద సిద్దిపేట జిల్లాలో కోహెడ మండలంలోని శనిగరం చెరువు, తోటపల్లి ఆన్‌లైన్‌ రిజర్వాయర్‌, దుబ్బాక మండలం చిట్టాపూర్‌ పెద్ద చెరువులను తీసుకొని 4 లక్షల 72 వేల రోయ్యపిల్లలు వేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 4 వేల టన్నుల చేపల ఉత్పత్తి వచ్చిందని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 28 వేలకుపైగా మత్స్యకారులు ఉండగా, జిల్లాలో 238 పురుషుల మత్స్య పారిశ్రామిక సంఘాలు, 33 మహిళా మత్స్య సహకార సంఘాలున్నాయి. వీటిలో మొత్తం 17,043 మంది సభ్యులున్నారు. ఈ సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం 100శాతం సబ్సిడీపై చేప పిల్లలు అందజేస్తున్నది. విక్రయానికి చేపల మార్కెట్లను ఏర్పాటు చేసింది. సిద్దిపేట, గజ్వేల్‌, తొగుట, హుస్నాబాద్‌, దుబ్బాక, దౌల్తాబాద్‌, చేర్యాలలో చేపల మార్కెట్లను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా హైదరాబాద్‌కు ఎగుమతి చేసుకునేందుకు సౌకర్యం కల్పిస్తున్నది.  

4.37 కోట్ల చేప పిల్లలు వదులుతాం..

సిద్దిపేట జిల్లాలో ఆగస్టు 5 నుంచి అన్ని చెరువుల్లో చేపపిల్లలను వదులుతాం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ 1591 చెరువుల్లో 4కోట్ల 37 లక్షల చేప పిల్లలను పెంచడమే లక్ష్యంగా టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేశాం. కొండపోచమ్మ, రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌లో ఈసారి కొత్తగా వేస్తున్నాం. వీటితో పాటు శనిగరం చెరువు, తోటపల్లి ఆన్‌లైన్‌ రిజర్వాయర్‌, తపాస్‌పల్లి రిజర్వాయర్లున్నాయి. జిల్లాలో కొన్ని పెద్ద చెరువులున్నాయి. మొన్న 4 వేల టన్నుల చేపల ఉత్పత్తి వచ్చింది. ఈసారి ఎక్కువ చేపల ఉత్పతి చేయాలన్న ప్రభుత్వ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. - వెంకటయ్య, సిద్దిపేట జిల్లా మత్స్య శాఖ అధికారి

కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా రుణాలు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో మత్స్యకారులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా సొసైటీల్లో సభ్యులైన మత్స్యకారులకు రుణాలను ఇవ్వనున్నది. ముఖ్యంగా చేపల చెరువు తవ్వుకునే వారికి ఒక హెక్టారుకు రూ.లక్షా 31వేలు, చేపల మార్కెట్‌ చేసే వారికి రూ.25వేలు, చేపలు పట్టే వారికి రూ.30 వేల వరకు రుణాలు ఇవ్వనున్నారు.  logo