ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Jul 28, 2020 , 02:29:04

శుభకార్యాలకు.. కండీషన్స్‌ అప్లై..!

శుభకార్యాలకు.. కండీషన్స్‌ అప్లై..!

  •  నిరాడంబరంగా కల్యాణోత్సవాలు
  •  భౌతిక దూరం పాటిస్తూ ఆశీర్వాదాలు
  •  కరోనా వైరస్‌ కారణంగా మారుతున్న పెండ్లిళ్ల తీరు
  •  నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

కార్యాలు కళ తప్పాయి.. ఆకాశమంత పందిరి వేసి, భాజాభజంత్రీల మధ్య ఎంతో మంది ఆత్మీయులతో సందడిగా జరిగే పెండ్లిళ్లు ఇప్పుడు మారిపోయాయి. పక్కవారింట్లో ఓ శుభకార్యం జరిగిందా... అని ఆశ్చర్యపోవాల్సిన రోజులు దాపురించాయి. మాయదారి కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో ఏప్రిల్‌, మే నెలల్లో జరుగాల్సిన శుభకార్యాలన్నీ వాయిదా వేసుకున్నారు నిర్వాహకులు. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో వాయిదా పడ్డ కార్యాలు చిన్నగా చేసుకునేందుకు ముందుకవుతున్నారు. అది కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే...

మెదక్‌: శ్రావణమాసం ప్రారంభమైంది. ఇక పెళ్లిళ్ల సందడి నెలకొంది. ఏప్రిల్‌, మే నెలల్లో వాయిదా పడ్డ శుభకార్యాలు శ్రావణమాసంలో జరుగుతున్నాయి. ఆగస్టు 14వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. కానీ, కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా వివాహ వేడుకలను ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరుపుకొంటున్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా పరిమిత సంఖ్యలో బంధువులు, స్నేహితులను పిలిచి పెండ్లి జరిపించుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు.  

తహసీల్దార్‌ అనుమతి తప్పనిసరి...

ఎవరైనా పెండ్లి చేయాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థానిక తహసీల్దార్‌ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. పెండ్లి పత్రికతో పాటు అనుమతి కోరుతూ ఇతర పత్రాలను తహసీల్దార్‌కు సమర్పించాలి. పెండ్లికి వధువు, వరుడి తరఫున 20 మంది మాత్రమే హాజరుకావాలి. బ్యాండు, మేళాలకు అనుమతి లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం-2005లోని సెక్షన్‌ 188 కింద నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటారు. 

పాటించాల్సిన మార్గదర్శకాలు..

  • l పెండ్లిలో పరిమిత సంఖ్యలోనే పాల్గొనాలి. వచ్చిన బంధులు నాలుగు నుంచి ఆరు అడుగుల దూరంలోనే కూర్చోవాలి. 
  • l పెండ్లికి వచ్చిన వారు తప్పకుండా మాస్కులు ధరించాలి. ఎవరైనా మాస్కులు ధరించకుంటే నిర్వాహకులు మాస్కులు ఏర్పాటు చేయాలి.
  • l తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.
  • l వధూవరులను ఆశీర్వదించడానికి స్టేజీ పైకి వచ్చే వారు పరిమిత సంఖ్యలోనే రావాలి. 
  • l భోజనాల వద్ద భౌతిక దూరాన్ని పాటించాలి.

ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి..

కరోనా వైరస్‌ మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా పెండ్లిళ్లు చేసుకోవాలి. పెండ్లికి 20 మందిని మాత్రమే ఆహ్వానించాలి. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలి. అంతేకాకుండా భోజనాలు చేసేటప్పుడు కూడా భౌతిక దూరం పాటిస్తూ శుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. పెండ్లిళ్లను రెవెన్యూ పోలీసు అధికారులు తనిఖీ చేస్తారు. 

- రవికుమార్‌, తహసీల్దార్‌ మెదక్‌


logo