గురువారం 29 అక్టోబర్ 2020
Medak - Jul 28, 2020 , 02:29:06

త్వరలో రెండు ఆక్సిజన్‌ పార్కులు

త్వరలో  రెండు ఆక్సిజన్‌ పార్కులు

  • n మనోహరాబాద్‌ మండలంలో మూడు నిర్మాణం 
  • n అటవీప్రాంతం, పారిశ్రామికవాడలో ఏర్పాటు 
  • n 349 హెక్టార్లలో పలు రకాల మొక్కల పెంపకం 
  • n దండుపల్లి అటవీ ప్రాంతంలో 129 హెక్టార్లు, పర్కిబండ అటవీ ప్రాంతంలో 220  హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు
  • n ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడలో 30 వేల మొక్కల పెంపకం 
  • n పశువులు రాకుండా రెండు సెక్టార్లలో పూర్తయిన ఫెన్సింగ్‌  
  • n ఆకర్షణీయంగా మెయిన్‌ గేట్ల నిర్మాణం 

నానాటికి అంతరించి పోతున్న అటవీ ప్రాంతాన్ని పెంచేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు, ఆహ్లాదక పరిస్థితులను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. యాంత్రిక జీవనానికి దూరంగా, స్వచ్ఛమైన గాలిని అందించే ఆక్సిజన్‌ పార్కులుగా నేడు తెలంగాణలోని అటవీ ప్రాంతాలు, పారిశ్రామిక వాడలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇందులో భాగంగా అటవీశాఖ భూముల్లో, పారిశ్రామికవాడల్లోని, ఖాళీ స్థలాల్లో అనేక రకాల మొక్కలను పెంచేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. మనోహరాబాద్‌ మండలంలో మూడు ఆక్సిజన్‌ పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. వీటి పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

మనోహరాబాద్‌ : అటవీ ప్రాంతాలను, పారిశ్రామికవాడలను సుందరవనాలుగా రూపుదిద్ది, పర్యాటక ప్రాంతాలుగా మార్చేందుకు ఆక్సిజన్‌ పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని మనోహరాబాద్‌ మండలంలోని రేంజ్‌ అటవీ ప్రాంతాలు, పారిశ్రామికవాడలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. 44వ జాతీయ రహదారిపై వెళ్లే ప్రయాణికులకు సేదతీర్చడంతో పాటు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు మూడు ఆక్సిజన్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో అనేక రకాల మొక్కలు నాటించి హంగులు కల్పిస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు హెచ్‌ఎండీఏ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తున్నది. రోడ్లు, విశ్రాంతి షెడ్లు, యోగా షెడ్లు, కమాన్‌లు, బెంచీలను ఏర్పాటు చేస్తున్నది. మనోహరాబాద్‌ అటవీ రేంజ్‌ పరిధిలో 349 హెక్టార్ల రిజర్వు ఫారెస్ట్‌లో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్‌ పార్కు సందర్శకులను ఆకట్టుకోనుంది. పారిశ్రామిక వాడలోనూ నాలుగు ఎకరాల్లో 30 వేల మొక్కలతో మరో ఆక్సిజన్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నారు.

ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడలో...

మెదక్‌ జిల్లాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడ ముప్పిరెడ్డిపల్లిలో ఉంది. సుమారు రెండు వందలకు పైగా పరిశ్రమలున్నాయి ఇక్కడ. ఈ పారిశ్రామిక వాడలో ఆక్సిజన్‌ పార్కును ఏర్పాటు చేసేందుకు ఇండస్ట్రియల్‌ ఏరియా లోకల్‌ అథారిటీ (ఐలా) అధికారులు కసరత్తు చేస్తున్నారు. పారిశ్రామిక వాడలోని ఖాళీ స్థలంలో 30వేల మొక్కలతో మరో ఆక్సిజన్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే స్థలాన్ని చదును చేసి మొక్కలు నాటారు. మరికొన్ని రోజుల్లోనే ఈ ఆక్సిజన్‌ పార్కు అందుబాటులోకి రానుంది. 

349 హెక్టార్లలో... లక్షలాది మొక్కలతో..

మనోహరాబాద్‌ అటవీ రేంజ్‌ పరిధిలోని దండుపల్లి చెక్‌పోస్టు వద్ద 129 హెక్టార్లు, పర్కిబండ అటవీ ప్రాంతంలో 220 హెక్టార్లలో నిర్మాణంలో ఉన్న రెండు ఆక్సిజన్‌ పార్కులు త్వరలో అందుబాటులో రానున్నాయి. సందర్శనీయ కేంద్రాలుగా ఈ రెండు ఆక్సిజన్‌ పార్కులను తీర్చిదిద్దుతున్నారు. దండుపల్లి చెక్‌పోస్టు వద్ద 129 హెక్టార్ల అటవీ ప్రాంతంలో, పర్కిబండలో 220 హెక్టార్ల అటవీ ప్రాంతంలో రెండేళ్ల క్రితం 58,000, గతేడాది 77,000 మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. వీటికి సకల హంగులను రూపుదిద్దే పనిని హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ( హెచ్‌ఎండీఏ) స్వీకరించింది. 349 హెక్టార్ల అటవీ ప్రాంతానికి ఫెన్సింగ్‌ ఏర్పాటు పనులు పూర్తి చేసింది. ఆక్సిజన్‌ పార్కులోకి వెళ్లే ముఖద్వారం వద్ద పలు రకాల డిజైన్లతో కమాన్లను ఏర్పాటు చేసింది. ఆక్సిజన్‌ పార్కులో యోగా షెడ్లు, సిట్టింగ్‌ టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. కోల్‌కతాకు చెందిన పలువురు శిల్పకళా నైపుణ్యం పొందిన మేస్త్రీలతో కమాన్‌లు, యోగా షెడ్లు అందంగా నిర్మించారు. 


logo