శనివారం 31 అక్టోబర్ 2020
Medak - Jul 25, 2020 , 23:55:20

సాకారం దిశగా ఏండ్ల కల

సాకారం దిశగా ఏండ్ల కల

  • సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో  గ్రామానికి యంత్రాంగం
  • n కొత్తపేటకు తరలివచ్చిన  కలెక్టర్‌, అధికారగణం
  • n రెవెన్యూ మేళాలో దరఖాస్తుల స్వీకరణ
  • n గ్రామ సమస్యల పరిష్కారానికి ఆరు బృందాల ఏర్పాటు
  • n మూడు రోజుల్లో సర్వే పూర్తి  చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు
  • n అతి త్వరలో ఆ మూడు గ్రామాల అన్నదాతలకు రైతుబంధు
  • n భూ సమస్యలపై సీఎం కేసీఆర్‌ ఆరా
  • n త్వరలోనే రైతులకు పట్టాలు పంపిణీ చేయాలని సూచన

జగదేవ్‌పూర్‌/గజ్వేల్‌ అర్బన్‌: ఆ మూడు గ్రామాల రైతుల కండ్లలో ఆనందం నిండుకున్నది. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో ఫోన్‌ ద్వారా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డికి ఆదేశాలిచ్చిన మరుసటి ఉదయమే జిల్లా అధికార యంత్రాంగం హుటాహుటిన కొత్తపేటకు తరలివచ్చింది. శుక్రవారం సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేసి కొత్తపేట గ్రామ సర్పంచ్‌తో సమస్యల గురించి తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి భూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. శనివారం ఉదయమే కొత్తపేట గ్రామపంచాయతీ వద్ద మూడు గ్రామాల రైతులతో భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులతో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి మాట్లాడారు. అంతకు ముందు జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు చంద్రశేఖర్‌, వెంకట్రామ్‌రెడ్డి, కనకలక్ష్మితో గ్రామంలోని పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ మేళాలో ఒక్కొక్క రైతు నుంచి దరఖాస్తులను తీసుకుంటూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడారు. కొత్తపేట, ఇటిక్యాల, లింగారెడ్డిపల్లి మూడు గ్రామాలకు చెందిన రైతులు 896ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నా, వారు ఇప్పటివరకు ఎలాంటి ప్రభుత్వ లబ్ధి పొందలేదన్నారు. 60ఏండ్లుగా భూములు సాగు చేస్తున్నా, అవి వారి పేరిట లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మూడు గ్రామాల భూ సమస్యలను ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ తమను ఆదేశించారని, అందుకే తెల్లవారగానే కొత్తపేటలో రెవెన్యూ మేళా నిర్వహించినట్లు కలెక్టర్‌ తెలిపారు. పన్నాలాల్‌ పట్టి పేరుతో 546ఎకరాలు, ఇతర భూ సమస్యలతో 350ఎకరాల రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామన్నారు. 2006లో అప్పటి ప్రభుత్వం వీటిని సీలింగ్‌ భూములుగా పేర్కొనడంతో అప్పటి నుంచి నేటి వరకు 14ఏండ్లుగా క్రయవిక్రయాలకు కూడా జరుగలేదన్నారు. రైతుల మనోవేదన, భూ సమస్యలను అర్థం చేసుకున్నామన్నారు. అత్యంత పారదర్శకంగా రైతుల భూసమస్యలను పరిష్కరిస్తామని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు.

సమస్యల పరిష్కారానికి  ఆరు బృందాలు

కొత్తపేట, ఇటిక్యాల, లింగారెడ్డిపల్లి గ్రామాల్లోని భూ సమస్యల పరిష్కారానికి వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. 896ఎకరాల భూముల సర్వే నెంబర్లు తదితర అంశాలను పరిశీలించి, రెండు రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, తహసీల్దార్లను కలెక్టర్‌ ఆదేశించారు. అధికారుల సర్వే నివేదికను ప్రభుత్వానికి పంపి, రెండు రోజుల్లో శాశ్వత పరిష్కారానికి ప్రక్రియ ప్రారంభిస్తామని వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయి సర్వేలో పత్రాల్లో విస్తీర్ణం తక్కువ ఉండి, క్షేత్రస్థాయిలో ఎక్కువ ఉంటే సెటిల్మెంట్‌ సర్వే ద్వారా రిజిస్టర్‌లో సవరిస్తామన్నారు. భవిష్యత్‌లో ఉత్పన్నమయ్యే సమస్యలను ఊహించి, ఆ సమస్యలు రాకుండా శాశ్వత పరిష్కారం చూ పేందుకు ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. మూ డు గ్రామాల్లో రైతుల భూ సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రస్తుతం అర్హులైన వారందరికీ పట్టాపాసుపుస్తకాలతో పాటు రైతుబంధు, రైతుబీమా అందేలా చూస్తామని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో డీఏవో శ్రావణ్‌కుమార్‌, గడా ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ బాలేశం, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్‌ రంగారెడ్డి, సర్పంచ్‌లు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

మురిసిన మూడు గ్రామాలు

తమ గ్రామాలకే కలెక్టర్‌, ఇతర అధికారులంతా వచ్చి, 60ఏండ్ల భూ సమస్యను పరిష్కారానికి చర్యలు తీసుకుంటుండడంతో ఆ గ్రామాల రైతులు మురిసిపోయారు. ముందు రోజే సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేయడం.. తెల్లవారగానే అధికారులంతా గ్రామంలో ప్రత్యక్షం కావడం.. ఆ మూడు గ్రామాల రైతులందరినీ ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేసింది. 35 ఏండ్లు మొదలుకొని 60ఏండ్లకు పైబడిన రైతులంతా అధికారులకు సంతోషంగా తమ భూముల వివరాలను అందజేశారు. మూడు గ్రామాల నుంచి రైతులంతా సమావేశమైనది తాము దశాబ్దాలుగా ఎదుర్కుంటున్న సమస్య పరిష్కారానికే అన్న విషయాన్ని తలుచుకుంటూ ఆనందించారు. సీఎం ఫోన్‌తో కూర్చున్న దగ్గరే పరిష్కారం చేయడానికి అధికారులు రావడం రైతులకు ఓ అద్భుతంగా అనిపించిందని రైతాంగం పేర్కొన్నది. ఏ ప్రభుత్వమూ తమ భూ సమస్యలను పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్‌ తమ కష్టాలను గుర్తించి, అధికారులను పంపి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపడంతో సంబరపడుతున్నారు.

సమస్యలపై  సీఎం కేసీఆర్‌ ఆరా

కొత్తపేట భూ సమస్యలపై సీఎం కేసీఆర్‌ కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డికి ఫోన్‌ చేసి ఆరా తీశారు. రెవెన్యూ మేళా నిర్వహిస్తున్న క్రమంలోనే సీఎం కేసీఆర్‌ కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డికి ఫోన్‌ చేసి వివరాలను తెలుసుకున్నారు. అలాగే జగదేవ్‌పూర్‌లో పల్లె ప్రగతి సమీక్ష నిర్వహిస్తుండగా, మరోసారి సీఎం కేసీఆర్‌ కలెక్టర్‌కు ఫోన్‌ చేసి వివరాలను తెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి గ్రామంలో నిర్వహించిన మేళా గురించి రైతుల సమస్యల పరిష్కారానికి చేపడుతున్న చర్యల గురించి సీఎంకు వివరించారు. సాధ్యమైనంత తొందరగా భూసమస్యలు పరిష్కరించి అందరికీ పట్టా పాసు పుస్తకాలు ఇవ్వడంతో పాటు రైతుబంధు, రైతుబీమాను అందించాలని సూచించినట్లు తెలిసింది.

తిరిగి తిరిగి కాళ్లు పోయినయి..

మా సమస్య తీర్చాలని ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్లు అరిగినయి తప్ప పని కాలేదు. ఏండ్ల నుంచి గోస ఎవరికి చెప్పుకున్నా తీరలేదు. చివరికి ఎన్నికలు కూడా బహిష్కరించేందుకు నిర్ణయించుకున్నప్పటికీ అధికారుల హామీతో విరమించుకున్నాం. నేడు అధికారుల పర్యటనతో మా రెవెన్యూ గ్రామాల భూసమస్యలు తీరుతాయన్న నమ్మకం వచ్చింది.   - రాంరెడ్డి, రైతు, ఇటిక్యాల

అప్పులైనా.. అమ్ముకోరాలె.. 

అప్పులైనా మా జాగలు మేము అమ్ముకోనీకి ఇబ్బంది పడ్డం. కాయకష్టం చేసుకుని భూములు సాగు చేసుకున్నం గానీ, కష్టాలు వస్తే భూమి మాది అని చెప్పుకోనీకి తప్ప పాసుపుస్తకాలయితే రాలే. మస్తు ఇబ్బందులు పడ్డం.    

- భిక్షపతిరెడ్డి, రైతు, లింగారెడ్డిపల్లి

కేసీఆర్‌ మా దేవుడు 

గత సర్కారులో మా భూములకు మాకు పట్టాలియ్యాలని కాళ్లు చేతులు పట్టుకున్నా ఎవరూ పట్టించుకోలె. కేసీఆర్‌ దేవుని లెక్క మా ఊరికే సర్కారు అధికారులను పంపిండు. మా పత్రాలు ఇచ్చినం. పట్టాలిస్తమని కలెక్టరే చెప్పడంతో ఇగ నమ్మకమొచ్చింది..    

- ప్రమీల, మహిళా రైతు, ఇటిక్యాల

ప్రతి రోజూ బాధపడేవారు 

మా గ్రామాల రైతులకు భూములున్నా, పట్టాపాస్‌ బుక్కులు లేనందున అమ్ముకోలేక, కొనలేక ఇబ్బందులు పడ్డారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా భూమిని అమ్మలేక మస్తు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యలు పరిష్కారం అయితున్నయని సంతోషమైతుంది.

- కనకలక్ష్మి, లింగారెడ్డిపల్లి సర్పంచ్‌

పథకాలు అందలేదు 

ప్రభుత్వం రైతులకు ఇస్తున్న రైతుబంధు పెట్టుబడి పైసలు మాకెవరికీ రాలేదు. మాకు పట్టాబుక్కులిచ్చి ప్రభుత్వ పథకాలన్నీ ఇస్తామని సీఎం చెప్పడంతో నమ్మకమొచ్చింది.

- కస్తూరి బాల్‌రెడ్డి, కొత్తపేట, రైతు

దశాబ్దాల సమస్య తీరునున్నది..

సీఎం కేసీఆర్‌ చొరవతో మా మూడు గ్రామాల భూ సమస్యలు పరిష్కారమవుతున్నాయి. దశాబ్దా లుగా రైతులు ఇబ్బందులు పడు తున్నారు. సీఎం ప్రత్యేక చొరవతో ఇప్పుడు మా అదృష్టం పండింది. మా రైతులందరికీ కూడా పట్టాపా సు పుస్తకాలు రానున్నాయి.

- చంద్రశేఖర్‌, ఇటిక్యాల సర్పంచ్‌ 

సీఎం కేసీఆర్‌తో కల సాకారం 

మా ఊరి సమస్య గురించి తిరగని ఆఫీసు లేదు. విషయం సీఎం దృష్టికి పోవడంతో అధికారులంతా మా ఊరికి వచ్చారు. వారే దరఖాస్తులు అడిగి తీసుకున్నారు. సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన తెల్లవారే అధికారులంతా మా ఊరికి వచ్చి ఆత్మైస్థెర్యాన్ని నింపారు.         - వెంకట్రామ్‌రెడ్డి, కొత్తపేట సర్పంచ్‌