గురువారం 29 అక్టోబర్ 2020
Medak - Jul 23, 2020 , 00:06:01

సిద్ధమైన కార్యాలయాలు

సిద్ధమైన కార్యాలయాలు

వట్‌పల్లి: అందోల్‌-జోగిపేట నూతన రెవెన్యూ డివిజన్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అందోల్‌-జోగిపేట ప్రజల చిరకాలస్వప్నం నెరవేరి కొత్త కార్యాలయాలు కొలువు దీరనున్నాయి. గత శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జోగిపేటలో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో జోగిపేటను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తానని సీఎం కేసీఆర్‌ హామీనిచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటు కానున్న ఆర్డీవో కార్యాలయాన్ని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌తో కలిసి నేడు ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు అందోల్‌లోని ఐబీ బంగ్లాను అందంగా ముస్తాబు చేశారు. బుధవారం సాయం త్రం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌  ఆర్డీవో కార్యాలయాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ ఎప్పటికప్పుడు సంబంధితశాఖ అధికారులు, మంత్రులను కలుస్తూ రెవెన్యూ డివిజన్‌ ప్రక్రియ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో  చౌటాకూర్‌ను కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ అందోల్‌, పుల్క ల్‌, వట్‌పల్లి మండలాలతో అందోల్‌- జోగిపేటను రెవెన్యూ డివిజన్‌ కేంద్రం ఏర్పాటు చేస్తూ గత సోమవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో చిరకాల స్వప్నం నెరవేరి స్థానికులు, పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు సంబురాలు జరుపుకున్నారు.కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుతో ఎంతో చరిత్ర కలిగిన అందోల్‌-జోగిపేటకు మరింత ఖ్యాతి దక్కిందని స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 

రూ.2కోట్లతో  రోడ్డు డివైడర్ల నిర్మాణం.. 

రూ.2కోట్ల వ్యయంతో అందోల్‌-జోగిపేటలో నూతనంగా నిర్మించిన రోడ్డు డివైడర్లను ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. కొన్నేండ్లుగా అందోల్‌-జోగిపేటలో సరైన రోడ్డు డివైడర్లు లేక ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే రూ.2కోట్ల వ్యయంతో రోడ్డు డివైడర్లను ఏర్పాటు చేయించారు. అందోల్‌ నుంచి జోగిపేట వరకు జోగిపేట-సంగారెడ్డి ప్రధాన రహదారిపై డివైడర్లను నిర్మించి ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశారు. దీంతో అందోల్‌-జోగిపేట పట్టణానికి కొత్త అందం వచ్చింది. 

చౌటకూర్‌ మండల కేంద్రం ప్రారంభం  

పుల్కల్‌: చౌటకూర్‌ మండల కేంద్రాన్ని ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. నేడు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ ప్రారంభిస్తారు. పుల్కల్‌ మండలం నుంచి 14 రెవెన్యూ గ్రామాలను వేరు చేసి జాతీయ రహదారిపై ఉన్న చౌటకూర్‌ కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పడిన మండలంలో పంచాయతీ కార్యాలయంలో తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. కొత్తగా ఫర్నిచర్‌ను ఏర్పాటుచేసి రెవెన్యూ కార్యాలయాన్ని రంగు రంగుల పూలతో అలంకరించారు. కొత్తగా ఏర్పడిన చౌటకూర్‌ మండలం తహసీల్దార్‌గా చంద్రశేఖర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌గా ప్రణీత, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా శ్రీనివాస్‌ను నియమించారు.


logo