సోమవారం 21 సెప్టెంబర్ 2020
Medak - Jul 21, 2020 , 23:51:37

నిర్లక్ష్యం, ఏమరపాటుతోనే విద్యుత్‌ ప్రమాదాలు

నిర్లక్ష్యం, ఏమరపాటుతోనే విద్యుత్‌ ప్రమాదాలు

రాష్ట్రంలో కరెంటు లేని పల్లె లేదు.. ప్రభుత్వం   నిరంతరంగా కరెంటు సరఫరా చేస్తుండడంతో వినియోగమూ పెరిగింది. వంద శాతం విద్యుద్ధీకరణ లక్ష్యం నెరవేరింది. కానీ వానకాలంలో సంభవించే ప్రకృతి వైపరీత్యాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. స్తంభాలు విరిగిపడడం, తీగలు తెగిపడడం, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, బోరు, బావి మోటర్లు, స్టార్టర్ల వైర్లు తేలడం వంటి వాటిని గమనిస్తే జరిగే ఘోరాలను నివారించవచ్చు. నిర్లక్ష్యం, ఏమరపాటు చేయకుండా జాగ్రత్తగా ఉంటే ప్రాణాలను కాపాడుకోవచ్చని విద్యుత్‌ అధికారులు పేర్కొంటున్నారు.

మెదక్‌ : ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పల్లెకూ కరెంటు సదుపాయాన్ని కల్పించింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కరెంటు లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. దీంతో  విద్యుత్‌ వాడకం పెరుగుతోంది. మనదేశంలో తలసరి సగటు విద్యుత్‌ వినియోగం 1.181 యూనిట్లు కాగా, రాష్ట్రంలో తలసరి విద్యుత్‌ వినియోగం 1,896 యూనిట్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలో జాతీయ సగటు కంటే ఎక్కువగా  వినియోగిస్తుండడం విశేషం.  

వానకాలంలో పెరుగుతున్న ప్రమాదాలు... 

మెదక్‌ జిల్లావ్యాప్తంగా విద్యుత్‌ వినియోగం పెరుగడంతో పాటు ప్రమాదాలు కూడా జరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం.  వానకాలంలో ఈదురుగాలులతో చాలాచోట్ల విద్యుత్‌ తీగలు తెగిపడుతున్నాయి. ఏండ్ల తరబడి ఉన్న స్తంభాలు విరగడం, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, ఎర్తింగ్‌ విఫలం కావడం, వ్యవసాయ బోరు, బావుల మోటర్ల దగ్గర వైర్లు తేలడం వంటి కారణాలతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.   అవగాహన లేకున్నప్పటికీ ఇండ్లల్లో మరమ్మతులు చేసుకునేందుకు ప్రయత్నించడంతో కరెంటు షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. పశువులు మేత కోసం పొలాల వద్దకు వెళ్లినప్పుడు తెగిపడిన వైర్లను తాకుతుంటాయి. కాబట్టి వానకాలంలో జాగ్రత్తగా ఉంటే ప్రమాదాలను నివారించవచ్చు. 

గతంలో జరిగిన ప్రమాదాలు...

జిల్లావ్యాప్తంగా రెండేండ్లలో అనేక విద్యుత్‌ ప్రమాదాలు జరిగాయి. విద్యుత్‌ శాఖ అధికారుల లెక్కల ప్రకారం... 2018-19లో 48 పశువులు, 21 మంది మృత్యువాతపడ్డారు. 2019-20 మార్చి వరకు 22 పశువులు, ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. 2018-19లో 13 మందికి విద్యుత్‌ శాఖ నుంచి ఆర్థిక సాయాన్ని అందించారు. 48 పశువులకు ఒక్కో పశువుకు రూ.40వేల చొప్పున అందజేశారు.  ప్రతి సంవత్సరం విద్యుత్‌ భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించినప్పటికీ, పాటించడం లేదని అధికారులు చెబుతున్నారు.

పాటించాల్సిన జాగ్రత్తలు...

  • వ్యవసాయ పంపుసెట్లను తాకకూడదు. కరెంటు సరఫరా జరుగవచ్చు.
  •  గాలిదూమారంతో కూడిన వర్షం పడినప్పుడు విద్యుత్‌ స్తంభాలను, తెగిపడిన తీగలను, స్టార్టర్లను, మోటర్లను తాకకూడదు. విద్యుత్‌ అధికారులకు సమాచారం అందించాలి. 
  •  ప్రమాదకర విద్యుత్‌ లైన్లు, లూజు వైర్లు ఎక్కడైనా కనిపిస్తే దగ్గరలోని కరెంటు కార్యాలయానికి తెలియజేయాలి.
  • ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద విద్యుత్‌ అధికారులకు తెలియకుండా ఫ్యూజులు మార్చడం, కాలిన తీగలు సరిచేయడం వంటివి చేయవద్దు. ఇవి చాలా ప్రమాదకరం.
  • సర్వీస్‌ వైర్లను, వీధి దీపాలను సరి చేసేందుకు సంబంధిత ఉద్యోగులు మినహా ఇతరులు స్తంభాలను ఎక్కొద్దు.  
  •  ఇంటి వరండాలో, ఎలక్ట్రికల్‌ హౌస్‌ వైరింగ్‌కు దగ్గరలో జీఈవైరును దండెంగా కట్టి తడి దుస్తులను ఆరేయొద్దు.
  • ఎవరికైనా కరెంటు షాక్‌ కొడుతున్నప్పుడు అవతలి వాళ్లు అతడిని ముట్టుకోకూడదు. 
  • విద్యుత్‌ ప్రవహించని వస్తువులను వినియోగించాలి.


logo