శనివారం 24 అక్టోబర్ 2020
Medak - Jul 21, 2020 , 23:38:46

విటమిన్స్‌తో రోగనిరోధక శక్తి

విటమిన్స్‌తో రోగనిరోధక శక్తి

మెదక్‌:

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ భయాందోళనలకు గురవుతున్నారు. ఈ వైరస్‌ దరిచేరకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. కాగా, జాగ్రత్తలతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే నివారణ మంత్రమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం ఆహార నియమాలు పాటించాలని సూచనలు చేస్తున్నారు. 

విటమిన్‌ డీ:

మన శరీరంలోని ఇమ్యూనిటీ పవర్‌ని తగ్గించే కారకాలను నాశనం చేయడానికి విటమిన్‌ డీ అవసరం అవుతుంది. ఇది ఎక్కువగా సూర్యరశ్మి నుంచి శరీరానికి లభిస్తుంది. అంతేకాకుండా గుడ్లు, పాలు, చేపలు వంటి వాటిలో కూడా విటమిన్‌ డీ లభిస్తుంది.  

విటమిన్‌ ఏ :
విటమిన్‌ ఏ చర్మకణాల పనితీరులో ఉపయోగపడుతుంది. మన శరీరంలో వ్యాధి ప్రబలడానికి కారణమయ్యే కారకాలను ఎదుర్కొవడానికి విటమిన్‌ ఏ అవసరం. కణాల పెరుగుదలకు, కంటి చూపు మెరుగుపర్చడంలో విటమిన్‌ ఏ ఉపయోగపడుతుంది. చేపలు, గుడ్డు సొన, జున్ను, విత్తనాలు, తృణ ధాన్యాలు, చిక్కుళ్లు, క్యారెట్‌, ఆకుకూరల్లో ఎక్కువగా విటమిన్‌ ఏ లభిస్తుంది.  
విటమిన్‌ బీ:
విటమిన్‌ బిలో ముఖ్యంగా విటమిన్‌ బీ6, బీ12 మన శరీరంలో నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి, జీవక్రియలు సరిగా జరుగడానికి ఎంతో అవసరం. ఇవి కళ్లు, జుట్టు, కాలేయం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ రెండు విటమిన్లు మాంసంలో అధికంగా లభిస్తాయి. తృణధాన్యాలు, చిక్కుళ్లు, పచ్చి ఆకుకూరగలు, పండ్లు, చేపలు, మాంసం వంటి పదార్ధాలోల విటమిన్‌ బీ6 లభిస్తుంది. విటమిన్‌ బీ9 మాత్రం ఆకు కూరలు, చిక్కుళ్లు వంటి వాటిలో  పుష్కలంగా లభిస్తుంది. విటమిన్‌ బీ 12 ఇది ఎక్కువగా గుడ్లు, మాంసం, సోయా పాలలో కనిపిస్తుంది.
జింక్‌, ఐరన్‌, సెలీనియం:
శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుకోవడానికి జింక్‌, ఐరన్‌ కూడా చాలా అవసరం. ఐరన్‌ రోగ నిరోధక క్రిములను నాశనం చేయడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక క్రిములను గుర్తించడంతో పాటు అవసరమైన ఎంజైమ్స్‌ను అందించడంలో సహాయపడుతుంది. మన శరీరంలో జింక్‌, సెలీనియం యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే నష్టాన్ని కొంత వరకు తగ్గిస్తుంది. మాంసం, కోడి, చేపలు, తృణధాన్యాలు, చిక్కుళ్లు, ఆకుకూరల్లో ఐరన్‌ ఎక్కువగా లభిస్తుంది. జింక్‌ మాత్రం ఎండిన బీన్స్‌, కాయకూరల్లో లభిస్తుంది. 
విటమిన్‌ సీ, విటమిన్‌ ఈ:
విటమిన్‌ సీ నీటిలో కరిగే విటమిన్‌. ఇది శరీరం కనెక్టివ్‌ కణజాలాల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. విటమిన్‌ సీ, విటమిన్‌ ఈ కణాలను మన శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడానికి సహాయపడుతాయి. విటమిన్‌ సీ ఎక్కువగా నారింజ, నిమ్మకాలు, బెర్రీలు, కివీ పండ్లు, బ్రొకోలి, టమాట, క్యాప్సికమ్‌లలో ఎక్కువగా లభిస్తాయి. విటమిన్‌ ఈ పచ్చి ఆకు కూరలు, గింజలు, కూరగాలయ నూనెలలో లభిస్తాయి.


logo