బుధవారం 28 అక్టోబర్ 2020
Medak - Jul 21, 2020 , 00:34:26

మళ్లీ చిరుత కలకలం

మళ్లీ చిరుత కలకలం

  • మెదక్‌ జిల్లాలో మళ్లీ చిరుత కలకలం
  • పశువులపై పంజా విసురుతున్న పులి
  • రామాయంపేట మండలంతొనిగండ్లలో సంచారం
  • ఆవుపై దాడిచేసి చంపేసిన చిరుత
  • గ్రామ శివారులో చిరుత అడుగులు
  • భయాందోళనలో ప్రజలు

మెదక్‌/రామాయంపేట : మెదక్‌ జిల్లాలో మళ్లీ చిరుత కలకలం మొదలైంది. అడవిలో కనిపించే పశువులు, గొర్రెలు, దూడలపై పంజా విసురుతుంది. సోమవారం తెల్లవారుజామున రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామానికి చెందిన  రైతు రంగేరి రత్నం పశువుల కొట్టంలోని ఆవును చంపి తినేసింది. వివరాలు ఇలా ఉన్నాయి... రైతు ఆదివారం రాత్రి ఎప్పటిలాగే కొట్టంలో పశువులను కట్టేసి ఇంటికి వెళ్లాడు. ఉదయం వెళ్లి చూడగా బయట ఆవు మృతి చెంది ఉన్నది. సుమారు రూ. 50 వేల నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ రాణమ్మ, భూలింగం, ఎంపీటీసీ నాగులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అక్కన్నపేట బీట్‌ అధికారి రాములు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, బాధితులకు ప్రభుత్వం ద్వారా సాయమందిస్తామన్నారు. రైతులకు గ్రామ శివారులో చిరుత అడుగులు కనిపించాయి. పొలాల వద్దకు రాత్రి పూట వెళ్లాలంటే భయంగా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకోవాలని వేడుకుంటున్నారు. చిరుత గతంలోనే ఆ ప్రాంతంలోని లక్ష్మాపూర్‌, కాట్రియాల, పర్వతాపూర్‌, అక్కన్నపేట, ఝాన్సిలింగాపూర్‌ గ్రామాలతోపాటు జూన్‌ 27న తొనిగండ్ల, జూన్‌ 30న మెదక్‌ మండలం రాయిన్‌పల్లి గ్రామాల్లో చిరుత దాడులు చేసి సుమారు 40 పశువులను చంపేసిందని ప్రజలు తెలుపుతున్నారు. నెల రోజుల తర్వాత మళ్లీ చిరుత కలకలం రేపడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

10 నుంచి 12 వరకు చిరుతలు 

జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో సుమారు 10 నుంచి 12 చిరుతలు ఉన్నాయి. పోచారం, కామారెడ్డి అభయారణ్యంలో 13వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం ఉంది. నెల రోజుల తర్వాత మళ్లీ చిరుత సంచరించింది. పశువులు, గొర్రెలు మృతిచెందితే పరిహారంగా రూ.4 నుంచి 5వేలు అందజేశాం. వెటర్నరీ డాక్టర్‌ ధ్రువీకరించాల్సి ఉంటుంది.  - పద్మజారాణి, డీఎఫ్‌వో మెదక్‌ 


logo