బుధవారం 28 అక్టోబర్ 2020
Medak - Jul 19, 2020 , 23:20:32

ఫోన్‌ కొట్టు.. డీజిల్‌ పట్టు..!

ఫోన్‌ కొట్టు.. డీజిల్‌ పట్టు..!

పొలం దున్నుతున్న ట్రాక్టర్‌లో సడన్‌గా డీజిల్‌ అయిపోయిందా.. ప్రయాణికులతో ప్రయాణం చేస్తున్న సమయంలో మీ వాహనంలో డీజిల్‌ అయిపోయిందా.. క్వారీలో పనిచేస్తున్న ఇటాచ్‌ డీజిల్‌ లేక ఆగిందా.. మరి ఇప్పుడేం చేద్దాం.. చేసేదేముంది పెట్రోల్‌బంక్‌ వద్దకు వెళ్లాల్సిందే.. అని మీకు మీరే విసుక్కుంటున్నారా.. ఆ అవసరం ఇప్పుడు మీకు లేదండి. డీజిల్‌ అయిపోయిన వెంటనే ఒకే ఒక్కఫోన్‌ కాల్‌తో మీరున్న చోటకే డీజిల్‌ కొద్దిపాటి సమయంలోనే చేరుకుంటుంది. అదేలా అని ఆశ్చర్య పోతున్నారా..! ఔనండి.. ఇది అక్షరాల నిజం. ప్రస్తుతం ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే మొట్ట మొదటిసారిగా మద్దూరు మండలంలోని వల్లంపట్ల గ్రామంలో ప్రైవేట్‌ పెట్రోల్‌ పంప్‌ ఆధ్వర్యంలో గ్రామాల్లో 24గంటల మొబైల్‌ డీజిల్‌ వెహికల్‌ (సంచార డీజిల్‌ సరఫరా వాహనం) సేవలు ప్రారంభమయ్యాయి. 

మద్దూరు: ఇప్పటికే హైదరాబాద్‌లాంటి నగరాలకే పరిమితమైన మొబైల్‌ డీజిల్‌ వెహికల్‌ (సంచార డీజిల్‌ సరఫరా వాహనం) సేవలు మారుమూల పల్లెల్లోకి ‘మై పెట్రోల్‌ పంప్‌' అనే బెంగళూరుకు చెందిన ఏజెన్సీ ద్వారా అందుబాటులోకి వచ్చింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. శనివారం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని ధూళిమిట్ట్ట, బెక్కల్‌, బైరాన్‌పల్లి తదితర గ్రామాల్లో మొబైల్‌ వెహికల్‌ ద్వారా పలువురు తమ వాహనాల్లో డీజిల్‌ పోయించుకున్నారు. 

లీటర్‌కు అదనంగా సర్వీస్‌ ట్యాక్స్‌..

పెట్రోల్‌ బంకు నుంచి సుమారు 30 కిలోమీటర్ల వ్యవధిలోని గ్రామాల్లో మొబైల్‌ వెహికిల్‌ అందుబాటులో ఉంటుంది. డీజిల్‌ పోసుకున్న వారికి లీటర్‌కు 0.80 పైసలు, 30 కిలోమీటర్లపై దూరంలో ఉన్న వారికి లీటర్‌కు రూ.1 చొప్పున శ్లాబ్‌ పద్ధతిలో సర్వీస్‌ ట్యాక్స్‌ను అదనంగా తీసుకుంటాం. ఉమ్మడి వరంగల్‌తో పాటు సిద్దిపేట జిల్లాల్లో ఈ సేవలను ప్రప్రథమంగా ప్రారంభించాం. - పెట్రోల్‌ బంక్‌ యజమాని శ్రీరాములు


logo