ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Jul 18, 2020 , 22:58:06

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరుగాలి

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరుగాలి

మెదక్‌ : జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు అభివృద్ధి విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం మెదక్‌ కలెక్టరేట్‌లో మెదక్‌, రామాయంపేట, తూప్రాన్‌, నర్సాపూర్‌ మున్సిపాలిటీల చైర్మన్లు, కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లడారు. జిల్లాలోని మున్సిపాలిటీలు అభివృద్ధి సాధించాలని సూచించారు. మున్సిపాలిటీల్లో ఆదాయ వనరులను పెంచుకోవడంతో పాటు అభివృద్ధి సాధిం చే విషయంలో చైర్మన్లు, కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో రాబోయే రోజుల్లో  మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత చైర్మన్లు, కమిషనర్లు, అధికారులు, సిబ్బందిపై ఉందన్నారు. మున్సిపాలిటీల్లోని డంపింగ్‌ యార్డుల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేయడంతో పాటు రోజు వార్డుల్లో ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించాలన్నారు. ఈ విషయంలో సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు. మున్సిపాలిటీల్లో అవసరం మేరకు షీ-టాయిలెట్లు నిర్మిస్తామని, పది వేల మందికి ఒక సులభ్‌కాంప్లెక్స్‌ నిర్మించనున్నామని, దీని కోసం స్థలాలను సేకరించాలన్నారు. మెదక్‌ పట్టణంలో తాగునీటి కోసం ఈ నెల 22 వరకు ట్రయల్న్‌ నిర్వహించాలన్నారు. పంద్రాగస్టులోగా మంజీర నీటిని ఇంటింటికీ అందించాలని, పట్టణంలో నీటి సరఫరాను సీఎం కేసీఆర్‌ ప్రారంభించే అవకాశముందని, ఈ విషయంలో చైర్మన్‌ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఆదాయ వనరులు పెంచుకునే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న దుకాణాలకు సంబంధించిన కిరాయిలు వస్తున్నాయా? అనే విషయాలను చూడాలని మంత్రి సూచించారు. మున్సిపాలిటీలు సకాలంలో కరెంటు బిల్లులు చెల్లించేలా చూడాలన్నారు. మున్సిపాలిటీల్లో నీటి సరఫరాకు ఎన్ని ట్యాంకర్లను వినియోగిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. కొద్ది రోజుల్లో తెల్లరేషన్‌ కార్డులు ఉన్న వారికి రూపాయికే నల్లా కనెక్షన్‌ ఇస్తామని, అక్రమ నల్లా కనెక్షన్లుంటే, జరిమానాలు విధించాలన్నారు. చైర్మన్‌, కమిషనర్‌ ఉదయం 5.30 గంటలకే ఫీల్డ్‌లో ఉండాలన్నారు. వాటర్‌ ఆడిట్‌లో భాగంగా మున్సిపాలిటీల్లో ఎంత నీరు ప్రజలకు సరఫరా చేస్తున్నారు? ఆ నీటికి సరిపడా బిల్లులు చెల్లిస్తున్నారా? అని అంచనాలు తయారు చేయాలన్నారు. ప్రజలకు తాగునీటి సౌకర్యం పక్కాగా, ప్రణాళికాబద్ధంగా ఇస్తే బిల్లులు చెల్లించడానికి వెనుకాడరని మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రిసోర్స్‌, పవర్‌, శానిటైజ్‌, వాటర్‌ ఆడిట్‌ నిర్వహించి గుణాత్మక మార్పునకు నాంది పలుకుతామని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌, చైర్మన్లు, కమిషనర్లు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.logo