బుధవారం 28 అక్టోబర్ 2020
Medak - Jul 18, 2020 , 22:53:19

అన్నదాత పట్టుపంచ కట్టే రోజులొస్తున్నయి..

అన్నదాత పట్టుపంచ కట్టే రోజులొస్తున్నయి..

  • గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది..
  • పట్టణం పల్లెబాట పడుతున్నది..
  • ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
  • మెదక్‌ జిల్లాలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం
  • మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లతో సమీక్ష
  • టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయం పరిశీలన
  • ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హాజరు

పాపన్నపేట/మెదక్‌ అర్బన్‌ : ఇక తెలంగాణలోని రైతన్న చినిగిన ధోవతులు.. పంచలు కట్టుకునే రోజులు పోయి.. పట్టు పంచలు కట్టుకునే రోజులు రానున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం మల్లంపేట, యూసుఫ్‌పేట గ్రామాల్లో మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డితో కలిసి డంపింగ్‌ యార్డును ప్రారంభించారు. యూసుఫ్‌పేటలో డబుల్‌బెడ్‌రూం ఇండ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కరోనా మూలంగా అన్ని రాష్ర్టాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నా, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్‌ చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల మూలంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని అన్నారు. ఇటీవల కరోనా మూలంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. రూ.7,200కోట్ల రైతుబంధు డబ్బులు మూడు రోజుల్లో రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు, నీటి కొరత లేకుండా చూశారని, ప్రాజెక్టుల నిర్మాణం, కరెంటు సమస్య లేకుండా చూడడంతో ప్రస్తుతం ప్రతి పల్లెలో పని దొరుకుతున్నదన్నాaరు. అప్పట్లో పని కోసం పల్లెలు వదిలి పట్నం వెళ్లిన వారు, ప్రస్తుతం గ్రామాలకే వచ్చేస్తున్నారన్నారు. కూలీకి వెళ్లే వారు సైతం ప్రతి రోజు రూ.700 సంపాదిస్తున్నారన్నారు. త్వరలో పాపన్నపేట మండలానికి గోదావరి జిల్లాలు వస్తాయని, కాలం అయినా కాకున్న రెండు పంటలు పండుతాయన్నారు. సింగూరు ప్రాజెక్టు కూడా గోదావరి నీళ్లు వస్తాయని, ఆ నీళ్లతో మండలం సస్యశ్యామలం కానుందన్నారు.

 పల్లె సీమలే పట్టుగొమ్మలు..

పల్లె సీమల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ గ్రామాల అభివృద్ధి విశేషంగా కృషి చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. గ్రామాల్లో పారిశుధ్యం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారన్నారు. ప్రతి గ్రామానికి డంపింగ్‌ యార్డు, వైకుంఠధామం, ఒక ట్రాక్టర్‌, ట్యాంకర్‌, ట్రాలీ, ఇంటింటికి నల్లా, 24గంటల కరెంటు అందిస్తున్నట్లు చెప్పారు. గతంలో జిల్లా కేంద్రంలో కూడా పార్కు ఉండేది కాదని, ప్రస్తుతం గ్రామానికో పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కృషికి ప్రజల సహకారం అవసరమన్నారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరే చేసి ఇస్తే, ఎరువు తయారు చేస్తారని, పొడి చెత్త రీసైక్లింగ్‌ అవుతుందన్నారు.

  అధైర్యపడితే ఆగమే..

కరోనా వస్తుందని ఎవరూ కూడా అధైర్య పడొద్దని, అధైర్య పడితే ఆగమవుతామని మంత్రి సూచించారు. ప్రస్తుత తరుణంలో ఎవరు పండుగలు, పబ్బాలు చేసుకోవద్దని, దావత్‌ అని తోటివారిని పిలిపించుకోవద్దన్నారు. ఏదైనా మొక్కలుంటే, ఇంటి వద్దే చెల్లించు కోవాలని సూచించారు. కరోనా పోయినంక పండుగలు చేసుకుందామని సూచించారు.

 డంపింగ్‌ యార్డు బాగుంది..

మల్లంపేటలో డంపింగ్‌ యార్డు చాలా బాగుందని ఎంపీపీ చందనాప్రశాంత్‌రెడ్డి, సర్పంచ్‌ బాపురెడ్డిని మంత్రి హరీశ్‌రావు అభినందించారు. సొంతింటిని నిర్మించినట్లు నిర్మించారని, అది తనకు బాగా నచ్చిందని చెప్పారు. అందుకే ఫొటోలు కూడా తీస్తున్నానని మంత్రి సభాముఖంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి, మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి, అదనపు కల్టెర్‌ నగేశ్‌, పీఆర్‌ఈఈ వెంకటేశ్వర్లు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, జడ్పీటీసీ సభ్యురాలు, షర్మిలారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, సంరక్షించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్‌ జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ నూతన పార్టీ కార్యాలయంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో కలిసి ఆయన మొక్కలు నాటా రు. మొక్కలు మానవాళి మనుగడకు ఎంతో ఉపయోగపడతాయని, అందుకే ప్రతి ఒక్క రూ మొక్కలను నాటాలని సూచించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీ నూతన కార్యాలయాన్ని పరిశీలించారు. ‘టీఆర్‌ఎస్‌ పార్టీ మెదక్‌ కార్యాలయ భవనం చాలా బాగుం ది.. ఈ షెడ్డులో ఎంత మంది కూర్చుంటారు’?.. అని ఎమ్మెల్యేను మంత్రి అడుగగా, 600 మంది కార్యకర్తలతో సమావేశం నిర్వహించుకోవచ్చని ఎమ్మెల్యే సమాధానమిచ్చారు.


logo