మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Jul 17, 2020 , 23:12:53

విజృంభిస్తున్న కరోనా

విజృంభిస్తున్న కరోనా

  • సంగారెడ్డి జిల్లాలో మరిన్ని పాజిటివ్‌ కేసులు
  • ఇద్దరు మృతి
  • మెదక్‌ జిల్లా వ్యాప్తంగా  114కు చేరిన కేసులు 
  •  తగ్గని కరోనా మహమ్మారి 

మెదక్‌ ఉమ్మడి జిల్లా నెట్‌వర్క్‌: సంగారెడ్డి జిల్లాలో కొత్తగా శుక్రవారం 72 కరోనా కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో మోజీరాం రాథోడ్‌ తెలిపారు. సంగారెడ్డిలో 18, జహీరాబాద్‌ 28, బీరంగూడ, అమీన్‌పూర్‌, , సదాశివపేటలో నాలుగు చొప్పున, పోతేజి, దోమడుగు రెండు చొప్పున,  హద్నూర్‌,  పొట్టిపల్లి, చిద్రు ప్ప,  బొంతపల్లి, ఇస్నాపూర్‌ , బొల్లారం, జోగిపేట, చింతల్‌పల్లి, బిలాల్‌పూర్‌, పటాన్‌చెరులో ఒక్కొక్కటి చొప్పున నమోదైనట్లు వెల్లడించారు. ఇందులో 63 మంది హోం ఐసొలేషన్‌కు పంపగా, 9మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారన్నారు. సదాశిపేటలో ఇద్దరు మృతి చెందారన్నారు. సదాశివపేటలో 70 మందికి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు చే యగా, 17మందికి, పటాన్‌చెరు 166మందికి నిర్వహించగా, 26 మందికి పాజిటివ్‌ లక్షణాలు ఉన్నట్లు తెలిపారు. సంగారెడ్డి దవాఖానలో 153 మంది, జహీరాబాద్‌ దవాఖానలో 109 మంది శాంపిళ్లు సేకరించారు. ఝరాసంగం మండలం పొట్‌పల్లికి చెందిన వ్యక్తి(35) కి పాజిటివ్‌గా రాగా, చీలమామిడి పంచాయతీ పరిధి అనంతసాగర్‌లో ఒకే కుంటుంబంలో ముగ్గురికి కరోనా నిర్ధారణ అయినట్లు డాక్టర్‌ మాజిద్‌ తెలిపారు.   గుమ్మడిదల మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి పాజిటివ్‌ వచ్చినట్లు పీహెచ్‌సీ డాక్టర్‌ యాకలక్ష్మి తెలిపారు. అందోల్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, జోగిపేటలో ఇద్దరికి కరోనా సోకినట్లు తాలెల్మ పీహెచ్‌సీ వైద్యురాలు సంధ్యారాణి తెలిపారు. వారితో సన్నిహితంగా ఉన్న వారిని క్వారంటైన్‌కు తరలించారు.  

మెదక్‌ జిల్లాలో మరో తొమ్మిది.. 

మెదక్‌ జిల్లాలో తొమ్మిది కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. రామాయంపేట, చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి, మెదక్‌, తూప్రాన్‌, అల్లాదుర్గం మండలం చిల్వర్‌లో ఒక్కొక్కటి చొప్పున, మాసాయిపేట, హవేళీఘణాపూర్‌ మండలం కుచన్‌పల్లి రెండు చొప్పన నమోదవగా, జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 114కు చేరిందన్నారు. ఇందులో హోం ఐసొలేషన్‌లో 57 మంది ఉండగా, 15 మంది ప్రభు త్వ, ప్రైవేట్‌ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.  చిన్నశంకరంపేట మండలంలో రెండు కేసులు నమోదైనట్లు మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రావణి తెలిపారు. మండలంలోని ఓ వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్‌గా వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.  మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి కూడా పాజిటివ్‌గా వచ్చిందని తెలిపారు. మిర్జాపల్లి, శేరిపల్లి గ్రామాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో రెండు కుంటుంబాలకు చెందిన 65 మందిని 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. వెల్దుర్తి మండలం మాసాయిపేటలో ఇద్దరికి కరోనా వచ్చినట్లు మండల వైద్యాధికారి డాక్టర్‌ బాపురెడ్డి తెలిపారు. గ్రామంలో జరిగిన ఓ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనడంతోనే కరోనా సోకినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తూప్రాన్‌ పట్టణంలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పీహెచ్‌సీ డాక్టర్లు ఆనంద్‌, భావన తెలిపారు. సదరు వ్యక్తులతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న 8మందిని, సెకండరీ కాంటాక్ట్‌లో ఉన్న 20మందిని గుర్తించినట్లు పేర్కొన్నారు. అల్లాదుర్గం మండలం చిల్వెర గ్రామానికి చెందిన ఓ మహిళ(63)కు పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి దివ్యజ్యోతి తెలిపారు. 

సిద్దిపేట జిల్లాలో ఐదు.. 

సిద్దిపేట జిల్లాలో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని జిల్లా కొవిడ్‌-19 నోడల్‌ అధికారి పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ములుగు మండలం సింగన్నగూడ, గజ్వేల్‌, హుస్నాబాద్‌లో ఒకటి చొప్పున, చిన్నకోడూరు మండలం రంగనాయకసాగర్‌ వద్ద రెండు కేసులు నమోదయ్యాయన్నారు. చిన్నకోడూరు మండలంలో 40మందికి పరీక్షలు చేయగా, తల్లితోపాటు 7నెలల బాలుఢఙకి పాజిటివ్‌ వచ్చినట్లు పీహెచ్‌సీ వైద్యురాలు సరిత తెలిపారు.  చంద్లాపూర్‌లోని శ్రీరంగనాయకసాగర్‌ నిర్మాణ ఏజె న్సీ మెగా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న 30మందికి  పరీక్షలు చేయగా, వారికి నెగెటివ్‌ వచ్చిందన్నారు. చిన్నకోడూరు ఠాణాలో ఎస్సైతోపాటు మొత్తం 10 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందరికీ నెగెటివ్‌ వచ్చిందని తెలిపారు. హుస్నాబాద్‌ పట్టణంలో ఇప్పటి వరకు మొత్తం ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. కొండపాక మండలంలో ముగ్గురికి కరోనా వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. కుకునూర్‌పల్లికి చెందిన కానిస్టేబుల్‌కు మూడు రోజుల కింద పాజిటివ్‌గా రాగా, శుక్రవారం అతడి భార్యకూ కరోనా నిర్ధారణ అయ్యింది. తిప్పారం గ్రామానికి చెందిన వ్యక్తికి, ఎర్రవల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి  పాజిటివ్‌గా వచ్చింది. తొగుట మండలం పెద్దమాసాన్‌పల్లికి చెందిన పోలీస్‌ ఉద్యోగికి పాజిటివ్‌ వచ్చినట్లు పీహెచ్‌సీ సూపర్‌వైజర్‌ స్వామి తెలిపారు. చేర్యాల పట్టణంలోని ఓ బ్యాంకు మేనేజర్‌కు పాజిటివ్‌ వచ్చిట్లు పీపీ యూనిట్‌ వైద్యురాలు తెలిపారు. బ్యాంకు సిబ్బందితో పాటు అసిస్టెంట్‌ మేనేజర్‌ను హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

ఏఎస్సై మృతి

బంజారాహిల్స్‌, నమస్తే తెలంగాణ: కరోనాతో బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహి స్తున్న ఏఎస్సై (55) శుక్రవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్‌ దవాఖానలో మృతిచెందాడు. సంగారెడ్డి జిల్లా కోహీర్‌కు చెందిన అతడు ఏఎస్సైగా పనిచేస్తూ యూసుఫ్‌గూడ సమీపంలోని ఎస్‌పీఆర్‌ హిల్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 7వ తేదీన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావడంతో నేచర్‌ క్యూర్‌ దవాఖానలో కొవిడ్‌-19 పరీక్ష చేయించుకున్నాడు. రెండురోజుల తర్వాత నెగెటివ్‌గా తేలింది.  శ్వాస తీసుకోవడంలో ఇబ్బం ది తీవ్రం కావడంతో ఈ నెల 9న అతడిని ఓ ప్రైవే ట్‌ దవాఖానలో చేర్పించారు. అక్కడి వైద్యు లు అతడికి సిటీ స్కాన్‌ చేయగా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు గుర్తించారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో ఓ కార్పొరేట్‌ దవాఖానలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.


logo