మంగళవారం 27 అక్టోబర్ 2020
Medak - Jul 16, 2020 , 23:15:42

ఏ పంట..ఎంతేశారు..!

ఏ పంట..ఎంతేశారు..!

  • పక్కాగా సాగు లెక్కలు      n క్షేత్రస్థాయిలో సేకరిస్తున్న వ్యవసాయశాఖ సిబ్బంది
  • పంట ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఈ లెక్కలే ప్రామాణికం n  వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు
  • వివరాలు ఉంటేనే ఐకేపీ, సీసీఐ, మార్క్‌ఫెడ్‌, పీఏసీఎస్‌ల ద్వారా పంట కొనుగోలు
  • రోజు వారీగా నమోదును పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయశాఖ అధికారులు
  • ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఇప్పటి వరకు 9.37 లక్షల ఎకరాల్లో పంటల సాగు
  • రైతులు ఈ నెల 21 వరకు ఏఈవోల వద్ద నమోదు చేయించుకోవాలి : వ్యవసాయశాఖ

తెలిసి, తెలియక పంటలు సాగు చేసి, సరైన మద్దతు ధర దక్కక రైతులు నష్టపోతుండ టంతో నియంత్రిత సాగు విధానాన్ని ప్రభుత్వం ముందుకు తెచ్చింది. రైతులకు లాభం చేకూర్చడమే లక్ష్యంగా, ఈ వానకాలం సీజన్‌లో ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేస్తున్నది. ప్రభుత్వ సూచనలతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మెజార్టీ రైతులు నియంత్రిత సాగుకే మొగ్గుచూపారు. మొక్కజొన్న పంటకు దాదాపు క్రాప్‌ హాలీడే ప్రకటించారు. పత్తి, కంది, తక్కువ మొత్తంలో వరి సాగు చేశారు. ఈ సీజన్‌లో ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా దాదాపు 13 లక్షల ఎకరాలకు గానూ ఇప్పటి వరకు 9.37 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, పంటల సాగు వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. వీటి ఆధారంగానే రానున్న రోజుల్లో రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.              - సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ

వివరాలు సేకరిస్తున్న ఏఈవోలు...

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతి గ్రామంలో పంటల సాగు వివరాలను సేకరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 118 మంది, సిద్దిపేట జిల్లాలో 127 మంది, మెదక్‌ జిల్లాలో 77 మంది... మొత్తం 322 మంది ఏఈవోలు పనిచేస్తున్నారు. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఖాళీగా ఉన్న ఏఈవో పోస్టులను భర్తీ చేసింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఈ వానాకాలం నుంచి నియంత్రిత సాగు విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఈ పద్ధతి ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వందశాతం విజయవంతమైంది. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల పరిధిలో ఏ గుంటలో సాగైన పంటల వివరాలను ఇప్పుడు ఏఈవోలు సేకరిస్తున్నారు. ప్రతి 5 వేల ఎకరాలకు క్లస్టర్‌గా విభజించి, ఆ పరిధిలో పంటల సాగు వివరాల సేకరణ బాధ్యతను వారికి అప్పగించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా పంటల సాగు లెక్కల సేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. 

21వరకు వివరాలు అందించాలి...

ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా సాగైన పంటల వివరాలను ఈనెల 21 వరకు సేకరించాల్సి ఉన్నది. ఈ మేరకు రైతులంతా తమ వ్యవసాయ క్లస్టర్‌ పరిధిలోని ఏఈవోల వద్ద పంటల సాగు వివరాలు నమోదు చేయించాల్సి ఉంటుంది. ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా దాదాపు 13 లక్షల ఎకరాల్లో పంటల సాగు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 9.37 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, కంది, సోయాబీన్‌, మినుము, పెసర వంటి పంటలు సాగయ్యాయి. కేవలం 5 వేల ఎకరాల్లోపే మొక్క జొన్న పంట వేశారు. మొక్క జొన్న పంట సాగుచేయవద్దని ప్రభుత్వం సూచించడంతో, ఆ మేరకు రైతులంతా ఆ పంటకు ఈ వానాకాలానికి దాదాపుగా స్వస్తి చెప్పారని చెప్పవచ్చు. సేకరించిన పంటల సాగు లెక్కలను ఏఈవోలు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. కంప్యూటర్‌ మీట నొక్కితే ఏ ఊరిలో, ఏ రైతు, ఏ పంట, ఎన్ని ఎకరాల్లో సాగుచేశారో చూసుకోవచ్చన్న మాట.

వివరాలు ఉంటేనే పంట ఉత్పత్తులకొనుగోలు... 

వ్యవసాయ అధికారులు నమోదు చేస్తున్న లెక్కల్లో వివరాలు ఉంటేనే పంటల ఉత్పత్తులను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏ జిల్లాలో ఏ పంట ఏ మేరకు పండనున్నది..? కొనుగోలుకు ఏ స్థాయిలో ఏర్పాట్లు చేసుకోవాలి..? అనే అంశాలపై పూర్తి స్పష్టత రానున్నది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఆన్‌లైన్‌లో నమోదైన పంటల వివరాల ప్రకారమే ఆయా రైతుల దిగుబడుల కొనుగోలుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనున్నది. ఎఫ్‌సీఐ, పీఏసీఎస్‌, మార్క్‌ఫెడ్‌, ఐకేపీ ద్వారా రైతుల నుంచి పత్తి, వడ్లు, మక్కలు, ఇతర దిగుబడులను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ఆన్‌లైన్‌లో వివరాలు లేని రైతుల నుంచి పైసంస్థలు పంటల దిగుబడులు(ఉత్పత్తులు) కొనుగోలును నిరాకరించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి రైతు తప్పనిసరిగా తాము సాగుచేసిన పంటల వివరాలనే నమోదు చేయించాలని అధికారులు సూచిస్తున్నారు. రోజు వారీగా క్షేత్రస్థాయిలో సేకరిస్తున్న లెక్కలను వ్యవసాయ శాఖ జిల్లా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 


logo