మంగళవారం 27 అక్టోబర్ 2020
Medak - Jul 16, 2020 , 02:41:09

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో భారీ వర్షం

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో భారీ వర్షం

పలుచోట్ల నీట మునిగిన పంటలు

సిద్దిపేట,చేర్యాల, గజ్వేల్‌,మెదక్‌లో రోడ్లు జలమయం

నీటి వనరులకు జలకళ

హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగంఉమ్మడి మెదక్‌ జిల్లాలో బుధవారం ఓ మోస్త

రు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో నీటి వనరులు జలకళను సంతరించుకోగా.. పంటలకు ప్రాణం వచ్చింది. మెదక్‌ జిల్లాలో సరాసరి 7.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్‌లోని రాందాస్‌ చౌరసాల్తో వర్షపునీరు చేరి చెరువును తలపించింది. సిద్దిపేట జిల్లాకేంద్రంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. సిద్దిపేట. గజ్వేల్‌, చేర్యాలలో రోడ్లు జలమయమయ్యాయి. పలుచోట్ల పంటలు నీటమునిగాయి. సంగారెడ్డి జిల్లాలో సరాసరి 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి జహీరాబాద్‌ ప్రాంతంలోని వాగులు, చెరువులు, కుంటలు జలకళతో ఉట్టిపడుతున్నాయి. నారింజ ప్రాజెక్టు వరద నీటితో కళకళలాడుతోంది. - ఉమ్మడి మెదక్‌ జిల్లా నెట్‌వర్క్‌ 

మెదక్‌/మెదక్‌ రూరల్‌/పాపన్నపేట/పెద్దశంకరంపేట: మెదక్‌ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా సరాసరి 7.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా పెద్దశంకరంపేటలో 31.0 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. వెల్దుర్తిలో 23.4 మి.మీటర్లు, టేక్మాల్‌లో 17.6, అల్లాదుర్గం 18.3, కొల్చారంలో 16.0, మనోహరాబాద్‌లో 11.9 మి.మీటర్ల వర్షం కురిసింది. జిల్లా కేంద్రం మెదక్‌లో మధ్యాహ్నం కురిసిన వర్షానికి రాందాస్‌ చౌరస్తాలో వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.  

సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం 

సిద్దిపేట కలెక్టరేట్‌/మద్దూరు/గజ్వేల్‌/దౌల్తాబాద్‌/చేర్యాల: సిద్దిపేట జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. జిల్లాకేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన వర్షం రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అత్యధికంగా వర్గల్‌ మండలంలో 16.3 మి.మీ, అత్యల్పంగా దుబ్బాక మండలంలో 0.1 మి.మీ వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా చూస్తే.. సిద్దిపేట రూరల్‌ 2.3 మి.మీ, చిన్నకోడూరు 1.9, బెజ్జంకిలో 4.3, కోహెడలో 4.3, అక్కన్నపేటలో 8.8, నంగునూరులో 3.5, సిద్దిపేట అర్బన్‌లో 1.7, తొగుటలో 4.1, మిరుదొడ్డిలో 1.3, దౌల్తాబాద్‌లో 1.4, రాయిపోల్‌లో 2.6, ములుగులో 8.6, మర్కూక్‌లో 9.6, జగదేవ్‌పూర్‌లో 8.2, గజ్వేల్‌లో 5.8, కొండపాకలో 13.1, కొమురవెల్లిలో 14.3, చేర్యాలలో 10.2, మద్దూరులో 5.8, నారాయణరావుపేటలో 1.8 మి.మీ కాగా, జిల్లా మొత్తంలో సరాసరిగా 5.9 మి.మీ వర్షపాతం నమోదైంది. మద్దూరు మండలంలో వరి, పత్తి, కంది, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. బంజెరలో పొలాల ఒడ్లు తెగిపోవడంతో వరి పంట దెబ్బతింది. నర్సాయపల్లిలోని వాయిల్లకుంట పొంగిపొర్లింది. గజ్వేల్‌ పట్టణం, చేర్యాల పట్టణంతో పాటు మండలాల్లోని ఆయా గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.  

జహీరాబాద్‌లో 120 మిల్లీమీటర్లు..

సంగారెడ్డి/జహీరాబాద్‌/వట్‌పల్లి: సంగారెడ్డి జిల్లాలో సరాసరి 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా జహీరాబాద్‌లో 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం నుంచి సంగారెడ్డి పరిసరాల ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి జహీరాబాద్‌ ప్రాంతంలోని వాగులు, చెరువులు, కుంటలు జలకళతో ఉట్టిపడుతున్నాయి. నారింజ ప్రాజెక్టు వరద నీటితో కళకళలాడుతోంది. కురిసిన వర్షం పత్తి, కంది, జొన్న, పెసర, మినుము, పంటలకు ఎంతో మేలు చేసినందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శేకాపూర్‌ ఎల్లమ్మ చెరువులోకి వర్షపు నీరు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్‌ పట్టణంలో తమ్మడపల్లి శివారులో ఉన్న బైపాస్‌ రోడ్డు పక్కన పొలాలు జలమయమయ్యాయి. ఆదర్శనగర్‌తో పాటు పలు కాలనీల్లో వరద నీరు రోడ్లపై నిలిచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  


logo