గురువారం 29 అక్టోబర్ 2020
Medak - Jul 12, 2020 , 23:14:14

డ్రైవరన్నా జర భద్రం!

డ్రైవరన్నా జర భద్రం!

పొలం దున్నేందుకు కేజ్‌వీల్స్‌తో వెళ్తున్న డ్రైవర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. పొలం దున్నేందుకు వెళ్లిన డ్రైవర్‌ ఇంటికి వస్తాడన్న భరోసా లేకుండా పోతోంది. రెక్కాడితే గాని డొక్కాడని డ్రైవర్లు అనుకోకుండా ప్రమాదాల బారిన పడి ప్రాణాలు విడుస్తున్నారు. కుటుంబాలకు కడుపుకోత మిగుల్చుతున్నారు. కేజ్‌వీల్స్‌ ట్రాక్టర్లు బోల్తా పడి ఏటా అనేక మంది మృతిచెందుతున్నారు. సాగులో యాంత్రీకరణ తప్పనిసరి కావడం, డ్రైవర్‌కు అవగాహన లేకపోవడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రతి ఏటా వర్షాకాలంలో ఎక్కడో ఒకచోట మృత్యువాత పడుతున్న ఘటనలు వెలుగు చూస్తుడడంతో డ్రైవర్ల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. -మెదక్‌

ప్రమాదాలకు కారణాలివే ..

 • పొలాలు అన్నీ ఒకే విధంగా ఉం డవు. నీటితో నింపిన తర్వాత డ్రైవర్‌కు భూమి ఎలాంటిదో తెలియకపోవడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
 • పొలం దున్నినా కొద్ది అక్కడక్కడా గుంతలు ఏర్పడుతాయి. దాన్ని గుర్తించకపోవడం.
 • నారు ఎక్కువగా ఉన్న స్థలంలో ఎక్కువ లోతుగా కేజ్‌వీల్స్‌ వెళ్తా యి. ఫలితంగా అక్కడి భూమి వదులుగా మారుతుంది.
 • గట్టి ప్రదేశంలోకి వెళ్లడానికి డ్రైవర్లు యాక్సిలేటర్‌ ఎక్కువగా ఇస్తుంటా రు. బరువంతా కేజ్‌వీల్స్‌పై పడుతుంది. ముందు టైర్లు అంతగా బరువు లేకపోవడంతో ట్రాక్టర్‌ బోల్తా పడుతుంది.
 • పొలం చివర మూలల్లో ఎక్కువ సార్లు కేజ్‌వీల్స్‌ నడుస్తాయి. అక్కడలోతుగా తయారవుతుంది. వేగంగా వెళ్లే క్రమంలో దిగబడి బోర్లా పడుతుంది.
 • డ్రైవర్లకు పూర్తి స్థాయి నైపుణ్యం లేకపోవడం, ఓవర్‌ స్పీడ్‌తో పొలాల్లో దున్నడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాక్టర్‌ దున్నడంతో లోతు పెరిగినా కొద్దీ ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువగా ఆస్కారం ఉందని ఇంజినీరింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. మామూలుగా 20-25 సెంటీ మీటర్ల లోతుకన్నా ఎక్కువ లోతుకు వెళ్తే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

ముందు జాగ్రత్తలు పాటించండి

  • కేజ్‌వీల్స్‌ బిగించేటప్పుడు తప్పనిసరిగా వెను క టైర్లు సమాన స్థాయిలో ట్రాక్టర్‌ బంపర్‌ ముందు వెయిట్‌ బిళ్లలు వేసుకోవాలి.
  • బరువు ఎక్కువైతే మైలేజ్‌ తక్కువ వస్తుందనే ఉద్దేశంతో వాడడం లేదు. 
  • ట్రాక్టర్‌ను పొలంలోకి దించే ముందు పూర్తి స్థాయి కండిషన్‌లో ఉందో లేదో చూసుకోవాలి. పొలం దున్నుతున్న సమయంలో ట్రాక్టర్‌ను ఎప్పుడూ ఒకే వేగంతో నడుపాలి. యజమానుల మొప్పు కోసం వేగం పెంచవద్దు. మూల మలుపుల దగ్గర వేగం తగ్గించాలి.
  • కేజ్‌వీల్స్‌తో దున్నేటప్పుడు ట్రాక్టర్‌కు కల్టివేటర్‌ అమర్చుకోవాలి. ఇలా ఉంటే బోల్తా పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

  తొందరపాటు వద్దు

  పొలం మడుల్లో నీరు ఎక్కువగా ఉంచాలి. దీనిద్వారా ట్రాక్టర్‌ సులువుగా తిరుగుతుంది. తొందరగా దున్నాలనే ఉద్దేశంతో ట్రాక్టర్‌ను ఇష్టమొచ్చినట్లు నడుపుతుంటారు. దీంతో ప్రమాదాలు జరుగుతుంటాయి. సరైన నైపుణ్యం లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. కేజ్‌వీల్స్‌కు సమానమైన వెయిట్‌ బిళ్లలను బంపర్‌కు పెట్టుకుంటే ప్రమాదాలను నివారించవచ్చు.   - రాజ్‌నారాయణ, మండల వ్యవసాయాధికారి, రామాయంపేట్‌


logo