శుక్రవారం 07 ఆగస్టు 2020
Medak - Jul 12, 2020 , 01:29:55

రైతు వేదిక నిర్మాణాల్లో నెంబర్‌ 1 కావాలి

రైతు వేదిక నిర్మాణాల్లో నెంబర్‌ 1  కావాలి

  •    రాత్రింబవళ్లు నిర్మాణాలు చేపట్టి త్వరగా పూర్తి చేయాలి
  •    గడువులోగా పూర్తికాకపోతే చర్యలు
  •    సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు
  •    కంగ్టి మండలంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ
  •    రాంతీర్థ్‌లో రైతు వేదిక స్థల దాతను ఫోన్‌లో  అభినందించి మంత్రి హరీశ్‌రావు

సిర్గాపూర్‌ : రైతు వేదికల నిర్మాణాలు శరవేగంగా చేపట్టి, నిర్మాణాల్లో సంగారెడ్డి జిల్లా నెం.1గా నిలువాలని కలెక్టర్‌ హనుమంతరావు సూచించారు. శనివారం ఆయన కంగ్టి మండలం రాంతీర్థ్‌, కంగ్టి గ్రామాల్లో కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతువేదికలు, డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామ నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. రైతు వేదికల నిర్మాణాలు రాత్రింబవళ్లు అయినా సరే పనులు వేగవంతంగా చేపట్టి, పూర్తి చేయాలని అధికారులు, కంట్రాక్టర్లు, సర్పంచ్‌లకు సూచించారు. గడువులోగా డంపింగ్‌ యార్డు, వైకుంఠధామ పనులు పూర్తి చేయకుంటే ఆ గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్‌కు తరలించాలని, గ్రామాల్లో ఈ రోజు నుంచి ఆరుబయట చెత్త వేసిన వారికి జరిమాన విధించాలని, ఎవరికి మినహాయింపు ఇవ్వొద్దని, ఈ మేరకు గ్రామాల్లో దండోరా వేయించాలని సూచించారు. కల్హేర్‌ మండలం రాపర్తిలో తడి,పొడి చెత్తను వేరు చేసి సేంద్రీయ ఎరువును తయారు చేయడం ప్రారంభించడాన్ని ప్రశంసించారు. డంపింగ్‌ యార్డులో ఎరువుల తయారీ, ఇతర పర్యవేక్షణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించినట్లు తెలిపారు. మండల ప్రత్యేకాధికారులు పర్యవేక్షిస్తూ, పెండింగ్‌ పనులను పూర్తి చేయించాలన్నారు. ఆయన వెంట నారాయణఖేడ్‌ ఆర్డీవో అంబాదాస్‌ రాజేశ్వర్‌, ఏడీఏ కరుణాకర్‌రెడ్డి, ఎంపీపీ, ఎంపీడీవో,ఏపీవో, అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఉన్నారు.

 రాంతీర్థ్‌లో స్థల దాత విఠల్‌కు మంత్రి, కలెక్టర్‌ అభినందన

కంగ్టి మండలం రాంతీర్థ్‌ గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి అర ఎకరం ఇచ్చిన దాత, రైతు విఠల్‌ను మంత్రి హరీశ్‌రావుతో పాటు కలెక్టర్‌ అభినందించారు. ఈమేరకు విఠల్‌ను కలెక్టర్‌ శాలువాతో సన్మానించారు. ఈ విషయాన్ని మంత్రి హరీశ్‌రావుకు కలెక్టర్‌ ఫోన్‌ చేసి చెప్పి, సదరు రైతును మంత్రితో కలెక్టర్‌ మాట్లాడించారు. విఠల్‌ను ఫోన్‌లో మంత్రి అభినందించి, కృతజ్ఞతలు తెలి పారు.

 వాసర్‌ పంచాయతీ కార్యదర్శికి నోటీసు

సిర్గాపూర్‌ మండలం వాసర్‌ పంచాయ తీ కార్యదర్శి రమేశ్‌కు కలెక్టర్‌ నోటీసు జారీ చేశారు. పంచాయతీలో పారిశుధ్యం, హరితహారం పనుల్లో నిర్లక్ష్యం గా ఉన్నాడని, అభివృద్ధి పనుల్లో పురోగతి లేకుంటే చర్యలు తప్పవని నోటీసులో కలెక్టర్‌ పేర్కొన్నారు.logo