సోమవారం 26 అక్టోబర్ 2020
Medak - Jul 09, 2020 , 23:57:02

కరోనాపై నిర్లక్ష్యం వద్దు

కరోనాపై నిర్లక్ష్యం వద్దు

  • ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

సిద్దిపేట కలెక్టరేట్‌ : ‘కరోనాపై నిర్లక్ష్యం తగదు.. పూర్తి జాగ్రత్తలతో ఉండాలి.. కరోనా సోకిన వారిని చిన్న చూపొద్దు.. రోగంతో భయం కంటే జనంతో భయం ఎక్కువైంది.. కరోనా వచ్చిన వారు మనిషే కదా.. ధైర్యం చెప్పాలి.. వారిని అంటరానివారిగా చూడొద్దు’.. అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట 6వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులను మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సుతో కలిసి ఆయన ప్రారంభించారు. కరోనాతో అందరూ జాగ్రత్తగా ఉండాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ నెల 15 నుంచి కరోనా పరీక్షా కేంద్రం ప్రారంభించనున్నట్లు తెలిపారు. 100 మందికి సరిపడేలా వంద పడకల కొవిడ్‌-19 ట్రీట్‌మెంట్‌ అందిస్తూ కరోనా దవాఖాన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 20 పడకలతో ఐసీయూ కేంద్రం ఏర్పా టు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం రూ.15 లక్షలతో నిర్మించిన నూతన ప్రభుత్వ యునానీ దవాఖానను ప్రారంభించారు. పట్టణంలోని 26వ వార్డులో కాలనీ కమ్యూనిటీ హాల్‌ కంపౌండ్‌ వాల్‌ నిర్మాణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

 కేజ్‌ కల్చర్‌లో చేపలు పెంచాలి 

మత్య్సకారులకు చేపల దిగుబడిని పెంచేందుకు జిల్లాలో నూతనంగా కేజ్‌ కల్చర్‌లో చేపలను పెంచాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సుడా కార్యాలయంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకయ్య ఆధ్వర్యంలో గుర్రాలగొంది, రాఘవాపూర్‌, నారాయణరావుపేట, రాజగోపాల్‌పేట, ఎన్సాన్‌పల్లి చెరువుల్లో కేజ్‌ కల్చర్‌ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

  అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

సిద్దిపేట అర్బన్‌ : అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నా ల గ్రామంలో రైతు వేదిక, సెగ్రిగేషన్‌ షెడ్‌, వైకుంఠధామాన్ని పరిశీలించి 15రోజుల్లో పనులు పూర్తి చేయాలన్నారు.  

మెదక్‌ ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్‌

మెదక్‌ : మెదక్‌ జిల్లాలోని మెదక్‌, నర్సాపూర్‌ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, తూప్రాన్‌ మున్సిపల్‌ చైర్మన్లు, మున్సిపల్‌ కమషనర్లతో మంత్రి హరీశ్‌రావు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇప్పటికే మెదక్‌ జిల్లాను స్వచ్ఛ మెదక్‌గా గుర్తించేందుకు అవసరమై అన్ని ప్రణాళికలు రూపొందించారన్నారు. 

 సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం 

పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ వరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని తన నివాసంలో చిన్నకోడూరు, కోహెడ, నంగునూరు మండలాలకు చెందిన 11మంది లబ్ధిదారులకు రూ. 5లక్షలు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. logo