బుధవారం 21 అక్టోబర్ 2020
Medak - Jul 08, 2020 , 23:11:16

అరచేతి నిండుగా.. గోరింటాకు పండుగ

అరచేతి నిండుగా.. గోరింటాకు పండుగ

‘గోరింట పూసింది కొమ్మా లేకుండా... మురిపాల అరచేత మొగ్గ తొడిగింది... ’ గోరింటాకుపైన ఓ సినీ కవి రాసిన పాట ఇది. పెట్టుకున్న గోరింటాకు మందారంలా ఎర్రబడితే మంచి మొగుడు వస్తాడని యుక్త వయసు యువతులు, సింధూరంలా పూస్తే బతుకును పండిస్తాడని కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు విశ్వసిస్తారు. ఆషాఢ మాసం కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. ఆషాఢ మాసం వచ్చిన నేపథ్యంలో అమ్మాయిల చేతులు గోరింటాకు ఎర్రదనంతో మెరిసిపోతుంటాయి.    - టేక్మాల్‌/ చేర్యాల/ మెదక్‌ రూరల్‌

తమలపాకు నోటిని పండిస్తే.. గోరింటాకు చేతిని పండిస్తుందనేది నానుడి.. భారతీయ సంస్కృతిలో మెహందీకి ఉన్న ప్రత్యేకత అంతాఇంతా కాదు. పండుగలు, వివాహాలు, శుభకార్యాల్లో కులమతాలకు అతీతంగా మహిళలు మైదాకు పెట్టుకుంటారు. గోరింటాకు లేని పెళ్లి కూతురిని మనం ఊహించలేం. పెళ్లి వేడుకల్లో మెహందీ వేడుకలు జరుపుకొనే ప్రాంతాలు నేటికీ ఉన్నాయి. అరచేతిలో ఎర్రని మందారమై పండి.. తన బతుకు పండించే మంచి భర్త వస్తాడని చెబుతూ ఆమె సిగ్గులను ఎరుపెక్కించే గోరింట.. అందాన్నే కాదు ఆరోగ్యాన్నీ ప్రసాదిస్తుంది. గోరింటాకు అంటే ఇష్టపడని మహిళలు ఉండరు. పల్లెలైనా, పట్టణాలైనా, పండుగలు, శుభకార్యాల వేళ గోరింటాకుకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. ఆషాఢ మాసంలో మహిళలు, యువతులు, చిన్నారులు చేతులు, కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడం తెలుగింట సంప్రదాయం. తరాలుగా వ స్తున్న ఈ సంప్రదాయం వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు. మైదాకు చెట్లనుంచి లేత ఆకులను తీసి, మెత్తగా రుబ్బుకొని మహిళలు చేతులకు, పా దాల చుట్టూ అందంగా పెట్టుకుంటారు. ప్రస్తుత కాలంలో చాలామంది సహజ సిద్ధ్దమైన గోరింటాకును మాని రెడీమేడ్‌గా షాపుల్లో లభిస్తున్న కోన్‌లను ఆశ్రయిస్తున్నారు. పల్లెలు, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం నేటికి అధిక శాతం మంది సంప్రదాయంగా గోరింటాకునే రుబ్బి పెట్టుకుంటున్నారు. 

నువ్వుల నూనెలో గోరింటాకు వేసి మరిగించి తలకు రాసుకుంటే కాలేయ రోగాలు, నోటిపూ త తగ్గిస్తుంది. కీళ్ల నొప్పి, వాపు కూడా గోరింటాకుతో తగ్గిపోతుంది. ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులే కాదు పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఆషాఢంలో గోరింటా కు పెట్టుకోవాలని చాలామంది రెడీమేడ్‌గా దొరికే కోన్ల మీద ఆధారపడుతారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులోఉండే లాసోన్‌ అనే సహజమైన రసాయనంతో ఎరుపురంగు వస్తుం ది. కానీ, చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. దీంతో ఆరోగ్యం మాట అటుంచితే, అలర్జీ ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో చెట్ల నుంచి లభించే గోరింటాకుని వాడుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. 

గోరింటాకుతో ప్రయోజనం

వాస్తవానికి ఆషాఢ మాసంలోనే లేత గోరింటాకు దొరుకుతుంది. లేత ఆకు అయితే బాగా పండుతుందని మహిళల నమ్మకం. వర్షాలు పడిన తర్వాత చిగురించిన లేత గోరింటాకును నూరి చేతులు, కాళ్లకు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది. గోరింటాకు మంచి యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుందని సైన్స్‌ చెబుతుంది. ఒకప్పుడు మన జీవనం పూర్తి వ్యవసాయాధారితం. మృగశిరలో నారుమళ్లు వేయడం, ఆషాఢంలో నాట్లు వేయడమనేది సంప్రదాయంగా వస్తోంది. గతంలో రైతులతో పాటు వారి కుటుంబసభ్యులు పొలం పనుల్లో ఎక్కువగా పాల్గొనేవారు. దీంతో మట్టి, బురదనీరు కాళ్లు, చేతుల ద్వారా శరీరంలోకి ప్రవేశించి జ్వరాలు, చర్మవ్యాధులు వంటి రోగాల బారిన పడటం జరిగేది. గోరింటాకు పెట్టుకుంటే యాంటీ బయోటిక్‌గా పనిచేసి వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో కూడా గోరింటాకుకు ప్రముఖ స్థానం ఉంది. ఆషాఢ మాసం అంటే వర్షాలు జోరుగా పడే రోజులు. నేలంతా తేమగా, బురదతో నిండి ఉంటుంది. నిత్యం ఇంటి పనుల్లో తలమునకలయ్యే మహిళలు ఎక్కువగా నీటిని ఉపయోగిస్తుంటారు. తడి నేలపై పదే పదే తిరగాల్సి ఉంటుంది. వర్షాకాలంలో సహజంగా ఉండే తేమ ప్రభావంతో మహిళల చేతులు, కాళ్లు ఒరిసిపోవడంతో పాటు గోళ్లు దెబ్బతినేవి. ఈ సమస్యకు గోరింటాకు నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. చేతికి గోరింటాకు పెట్టుకోవడంతో శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. దీన్ని తలకు, వెంట్రుకలకు పట్టిస్తే రాలిపోకుండా, మృదువుగా ఉండడంతో పాటు చుండ్రు, దురద వంటి సమస్యలు దరిచేరవు. ఆటలమ్మ మచ్చలు, గాయాలు, నల్లని మచ్చల నివారణకు గోరింటాకును వినియోగిస్తారు. 

ప్రాశస్త్యం ఉంది..

ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం అనాదిగా వస్తోంది.గోరింటాకు అమ్మవారికి ప్రతీకగా భావిస్తారు. ఈ మాసంలో అమ్మవారిని శాకంబరీ మాతగా అలంకరిస్తారు. మైదాకులో లక్ష్మీదేవి రూపాన్ని చూసుకుంటారు. ఆషాఢంలో శుభగడియలు లేకున్నా, వ్రతాలు, పూజలు చేసుకుంటారు.


logo