గురువారం 29 అక్టోబర్ 2020
Medak - Jul 08, 2020 , 23:04:19

భయం గుప్పిట్లో ఉమ్మడి మెదక్‌

భయం గుప్పిట్లో ఉమ్మడి మెదక్‌

మెదక్‌ : జిల్లా కేంద్రం మెదక్‌ పట్టణంలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గతంలో కరోనా సోకిన వారి కుటుంబ సభ్యుల రక్తనమూనాలను సేకరించి టెస్ట్‌లకు పంపగా, అందులో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు తెలిపారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో మెదక్‌

పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 63 మందికి పాజిటివ్‌ రాగా, ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.   మెదక్‌ పట్టణంలోని కోలిగడ్డకు చెందిన ఓ వ్యాపారికి కరోనా పాజిటివ్‌ రాగా, అతడి కుటుంబ సభ్యులకు రక్త పరీక్షలు చేశారు. దీంతో అతడి కుమారుడికి కరోనా పాజిటివ్‌ వచ్చిందన్నారు. పట్టణంలోని బ్రాహ్మణవీధికి చెందిన రిటైర్డ్‌ ట్రాన్స్‌కో ఉద్యోగి కరోనాతో మృతి చెందాడు. అతడితో చనువుగా ఉన్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎప్పటికప్పుడు వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని వివరించారు.

సిద్దిపేట జిల్లాలో ఇద్దరికి కరోనా.. 

సిద్దిపేట కలెక్టరేట్‌ : సిద్దిపేట జిల్లాలో బుధవారం ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జిల్లా కొవిడ్‌ -19 నోడల్‌ అధికారి పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లిలో ఒకరికి, సిద్దిపేట రూరల్‌ మండలం చింతమడకలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. సన్నిహితంగా మెలిగినవారిని హోం క్వారంటైన్‌ చేసినట్లు వివరించారు.

రామాయంపేటలో ఒకరికి...

రామాయంపేట : మున్సిపల్‌ పరిధిలోని గొల్పర్తి దుర్గమ్మ బస్తీకి చెందిన వ్యక్తి(45)కి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు హైదరాబాద్‌లోకి కింగ్‌కోఠి వైద్యులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి... వ్యక్తికి అనారోగ్యం కారణంగా 20 రోజుల కింద హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతున్న సదరు వ్యక్తికి రక్త పరీక్షలు చేయగా బుధవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ధ్రువీకరణ పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేసిన రామాయంపేట వైద్య సిబ్బంది... హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఇంటింటి సర్వే చేసిన వైద్య సిబ్బంది మాత్రలను అందజేశారు. వైద్య సిబ్బంది వెంట మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌, కమిషనర్‌ శేఖర్‌రెడ్డి ఉన్నారు.

సంగారెడ్డి జిల్లాలో 21 మందికి... 

సంగారెడ్డి మున్సిపాలిటీ : జిల్లాలో బుధవారం ఒక్క రోజే 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్‌వో మోజీరాం రాథోడ్‌ తెలిపారు. సంగారెడ్డిలో 5, పటాన్‌చెరు 3, బీరంగూడ 1, సదాశివపేట 1, ఆర్సీపురం 1, ఇస్నాపూర్‌ 1, తెల్లాపూర్‌ 3, అమీన్‌పూర్‌లో నలుగురికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో 11 మంది దవాఖానల్లో చికిత్సలు పొందుతున్నారని, మిగతా 8 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని పేర్కొన్నారు. పటాన్‌చెరులో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారని అధికారులు తెలిపారు. సంగారెడ్డిలో వర్తక వ్యాపారులు, వాణిజ్య సంస్థలు సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయాలని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ విజయలక్ష్మీరవి తెలిపారు. 

కరోనా కాటుకు ముగ్గురు బలి

నిజాంపేట : బతుకుదెరువుకు దుబాయ్‌కి వెళ్లి తిరిగి సొంత ఊరు నిజాంపేటకు వచ్చిన ఓ వ్యక్తి కరోనా వైరస్‌ సోకి మృతి చెందినట్లు బుధవారం హెల్త్‌ సూపర్‌వైజర్‌ ఉజ్వలరాణి తెలిపారు. కుటుంబ సభ్యులు 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. బయటకు రావాల్సి వస్తే మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలని గ్రామస్తులకు ఆమె సూచించారు. ఆమె వెంట ఉప సర్పంచ్‌ బాబు, సెకండ్‌ ఏఎన్‌ఎం బాలమణి, ఆశ వర్కర్లు లక్ష్మి, అనిత, బాలమణి ఉన్నారు.
ఆర్సీపురంలో ఒక్కరు, పటాన్‌చెరులో మరొకరు...
రామచంద్రాపురం : ఆర్సీపురం డివిజన్‌లోని శ్రీనివాస్‌నగర్‌కాలనీకి చెందిన ఓ వ్యక్తి (59) కరోనా వైరస్‌ సోకడంతో ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు పీహెచ్‌సీ వైద్యురాలు రజినీ బుధవారం తెలిపారు. కుటుంబ సభ్యులతోపాటు మృతుడికి సన్నిహింతంగా ఉన్నవారిని గుర్తించి రక్త పరీక్షలు చేయనున్నట్లు అన్నారు. పటాన్‌చెరులో ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.


logo