గురువారం 29 అక్టోబర్ 2020
Medak - Jul 07, 2020 , 23:45:30

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ప్రగతి పరుగులు

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ప్రగతి పరుగులు

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని అన్ని గ్రామాల్లో నిర్మాణాల సందడి కనిపిస్తున్నది. మునుపెన్నడూ లేనివిధంగా డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలు, రైతు వేదికలు, విలేజ్‌ పార్కుల నిర్మాణాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. రైతు వేదికల నిర్మాణం మొదలైంది. విలేజ్‌ పార్కుల ఏర్పాటుకు స్థలాల సేకరణ పూర్తికాగా, పలుచోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ ఈ మూడు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు ఈ నిర్మాణాలు పూర్తి చేయించడంలో బిజీగా మారారు. రోజువారీగా ఆకస్మిక పర్యటనలు చేస్తూ హడలెత్తిస్తున్నారు. ఈ నిర్మాణాల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపడానికి మంత్రి హరీశ్‌రావు కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా అధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంత్రి సమీక్షలతో రాత్రివేళల్లో కూడా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మెదక్‌, సంగారెడ్డి కలెక్టర్లు పలువురు సర్పంచ్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. దీంతో ప్రజా ప్రతినిధులు అప్రమత్తమయ్యారు. 

రాత్రివేళలో కూడా నిర్మాణ పనులు..

సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ ఉమ్మడి జిల్లాల్లో డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాల నిర్మాణం వేగంగా కొనసాగుతున్నది. పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించమని అటు మంత్రి హరీశ్‌రావు, ఇటు కలెక్టర్లు హెచ్చరికలు చేస్తుండడంతో రాత్రివేళల్లో కూడా పనులు చేపడుతున్నారు. 

సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు ఉండగా.. 644 గ్రామాల్లో డంపింగ్‌ యార్డుల నిర్మాణం పూర్తయ్యింది. మిగతా మూడు గ్రామాల్లో బుధవారం సాయంత్రం వరకు నిర్మాణం పూర్తికానున్నది. 140 గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం పూర్తికాగా, మిగతా గ్రామాల్లో 15వ తేదీ వరకు పూర్తికానున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 116 రైతు వేదికల నిర్మాణం మొదలైంది. 364 గ్రామాల్లో విలేజ్‌ పార్కుల ఏర్పాటుకు స్థలాలను గుర్తించగా.. పలుచోట్ల నిర్మాణాలు మొదలయ్యాయి. 

సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేట జిల్లాలో 499 గ్రామ పంచాయతీలు ఉండగా.. 10 గ్రామాలు రిజర్వాయర్లలో ముంపునకు గురైన విషయం తెలిసిందే. మిగతా 489 గ్రామాలకు గాను 307 గ్రామాల్లో డంపింగ్‌ యార్డుల నిర్మాణం పూర్తయ్యింది. 204 గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం పూర్తయ్యింది. మిగతా గ్రామాల్లో వేగంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రైతు వేదికల నిర్మాణాలు అన్నిచోట్ల మొదలయ్యాయి. విలేజ్‌ పార్కుల ఏర్పాటుకు స్థలాలు గుర్తించారు.

మెదక్‌ జిల్లాలో..

మెదక్‌ జిల్లాలో 469 పంచాయతీలకు గాను, కేవలం 5 గ్రామాల్లో మినహా.. మిగతా 461 చోట్ల డంపింగ్‌యార్డుల నిర్మాణం పూర్తయ్యింది. వైకుంఠధామాల నిర్మాణం పూర్తి కావస్తున్నది. 76 రైతుల వేదికల నిర్మాణం కొనసాగుతుండగా.. విలేజ్‌ పార్కుల ఏర్పాటుకు స్థలాలు గుర్తించారు.

మూడు జిల్లాల కలెక్టర్లు బిజీబిజీ...

డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలు, రైతు వేదికలు, విలేజ్‌ పార్కుల ఏర్పాటు పనులు పూర్తి చేయించడమే లక్ష్యంగా సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల కలెక్టర్లు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆకస్మిక పర్యటనలు చేస్తూ అధికారులు, ప్రజా ప్రతినిధులను హడలెత్తిస్తున్నారు. ఆకస్మికంగా గ్రామాలను తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా అభివృద్ధి పనులను పూర్తి చేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరితహారం అమలులో నిర్లక్ష్యాన్ని సహించడం లేదు. ఇప్పటికే మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి ఒక సర్పంచ్‌ను సస్పెండ్‌ చేసి, 14 మందికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు కూడా ఒక సర్పంచ్‌కు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటున్నారు. సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి రోజువారీగా సమీక్షిస్తూనే గ్రామాలను చుట్టివస్తున్నారు. ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా.. అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎవరికి వారు ఉమ్మడి జిల్లాలో తమ జిల్లానే మొదటి స్థానంలో నిలుపడానికి పోటీ పడుతున్నారు. ఈ పోటీ నేపథ్యంలో నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. కలెక్టర్ల ఆకస్మిక తనిఖీల నేపథ్యంలో గ్రామాల్లో రాత్రివేళల్లో లైట్లు వేసుకుని నిర్మాణ పనులు చేస్తుండడం గమనార్హం.

మంత్రి ఆకస్మిక తనిఖీల ప్రకటనతో హడల్‌..

ఉమ్మడి మెదక్‌ జిల్లాను ఆదర్శంగా నిలపడమే లక్ష్యంగా జిల్లా మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలు, రైతు వేదికల నిర్మాణాలపై ఆయన జిల్లాల వారీగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు, ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర అధికారులతో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. నిర్మాణాల్లో జాప్యం కనిపిస్తే ఆ ఊరు ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చిస్తున్నారు. ఒక్కో రోజు సాయంత్రం మొదలు పెడితే రాత్రి వరకు సుదీర్ఘంగా ఈ నిర్మాణాలు పూర్తి చేయించడంపైనే సమీక్షలు జరుపుతున్నారు. బాగా పనిచేస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని పద్ధ్దతి మార్చుకోవాలని తీవ్రస్థాయిలో మంత్రి హెచ్చరిస్తున్నారు. మూడు జిల్లాల్లో జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఇప్పటికే సమీక్షలు పూర్తయ్యాయి. ఓ వైపు సమీక్షలు నిర్వహిస్తూనే, మరోవైపు గ్రామాల్లో మంత్రి పర్యటిస్తున్నారు. పనులు పూర్తి చేయించడంలో మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి బాగా పనిచేస్తున్నారని, ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అభినందించిన విషయం తెలిసిందే. తాను కూడా ఉమ్మడి జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేస్తానని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.దీంతో అధికారులు, ప్రజా ప్రతినిధుల్లో టెన్షన్‌ మొదలైంది. ఎవరికి వారు పనులు పూర్తి చేయించడానికి రాత్రివేళల్లో కూడా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. మంత్రి మొదటగా ఏ జిల్లాలో ఏ గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయనున్నారోనని ఆసక్తి నెలకొన్నది.


logo