శనివారం 31 అక్టోబర్ 2020
Medak - Jul 07, 2020 , 02:20:24

వెరీ గుడ్‌ కలెక్టర్‌

వెరీ గుడ్‌ కలెక్టర్‌

  • జిల్లాను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కష్టపడుతున్నారు..
  • ఆకస్మిక తనిఖీలతో అభివృద్ధిని పరుగు పెట్టిస్తున్నారు.. 
  • నేనూ.. ఉమ్మడి జిల్లాలో ఆకస్మికంగా పర్యటిస్తా..
  • మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డిపై మంత్రి హరీశ్‌రావు ప్రశంసలు
  • అధికారులు, ప్రజాప్రతినిధులతో  టెలీకాన్ఫరెన్స్‌

మెదక్‌ : ‘వెరీ గుడ్‌ కలెక్టర్‌.. మెదక్‌ జిల్లాను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు బాగా కష్టపడుతున్నారు.. వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు, రైతు వేదికల నిర్మాణాలను ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలన్నదే లక్ష్యం.. మెదక్‌ జిల్లాలో ఆకస్మిక తనిఖీల్లో అభివృద్ధిని పరుగుపెట్టిస్తున్నారు.. ఉమ్మడి జిల్లాలో నేనూ ఆకస్మిక పర్యటన చేస్తా.. అనుకున్న లక్ష్యం పూర్తయ్యే వరకు నిరంతరం పర్యవేక్షించాలి’.. అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట నుంచి మెదక్‌ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. మెదక్‌ జిల్లాను పారిశుధ్యం విషయంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా, స్వచ్ఛ మెదక్‌ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. జిల్లాలో చేపడుతున్న వైకుంఠధామాలు, రైతు నివేదికలు, డంపింగ్‌ యార్డులు, రైతు కల్లాల గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలు జరుగాలని, దీంతో పాటు వర్మీ కంపోస్టు తయారు చేయించాలని ప్రజాప్రతినిధులు, అధికారులను మంత్రి సూచించారు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. మెదక్‌ జిల్లాలోని కొన్ని మండలాల్లో పనుల పురోగతి బాగుందని, మరికొన్ని మండలాల్లో చాలా వెనుకబడి ఉన్నారని, ఒకరిద్దరు సర్పంచులతో జిల్లా వెనుకబడితే ఉపక్షేంచేది లేదని, సర్పంచులను తొలగించైనా పనులను పూర్తి చేయిస్తామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మెదక్‌ జిల్లాలోని గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు, రైతు వేదికల పనులు జరిగేలా చూసే బాధ్యత ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలదేనన్నారు. అనుకున్న లక్ష్యం పూర్తయ్యే వరకు నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. పనులు చేసిన వాటికి సకాలంలో బిల్లులు వస్తాయని, నిధులకు ఎలాంటి కొరత లేదని మంత్రి తెలిపారు. రైతు వేదికల నిర్మాణాలు పూర్తి కావాలంటే ఇసుక కొరత ఉందని, వాటిని పూర్తి చేసేందుకు ఇసుకను ఉచితంగా అందజేస్తామని మంత్రి చెప్పారు.

31లోగా పూర్తికాకపోతే చర్యలు

ఈ నెల 31వతేదీ గడువులోగా రైతు వేదికల నిర్మాణాలు పూర్తికాకపోతే సంబంధిత ఏఈవోలపై చర్యలు తీసుకుంటామని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా యుద్ధప్రాతిపదికన, వేగవంతంగా ఆయా నిర్మాణాలు పూర్తి చేసి, జిల్లాను దేశంలోనే మొదటి స్థానంలో ఉంచాలని కోరారు. ఏదైనా గ్రామాల్లో పనులు నెమ్మదిగా జరుగుతుంటే రాత్రి పూట కూడా పనులు చేయించి పూర్తి చేయాలని లేనట్లయితే వారిపై చర్యలు తప్పవని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. 

* దేశంలోనే మొదటి స్థానంలో నిలుపుతాం.. : ధర్మారెడ్డి

మెదక్‌ జిల్లాను పారిశుధ్యం విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో అనుకున్నంత మేర సెగ్రిగేషన్‌ షెడ్డు(డంపింగ్‌యార్డులు) పూర్తయ్యాయని, ఈ నెల 10వరకు వంద శాతం పూర్తి చేస్తామని కలెక్టర్‌ ధర్మారెడ్డి చెప్పారు. తడి, పొడి చెత్తను ఇంటి వద్దనే వేరు చేయడం విషయంలో గ్రామాల్లో ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లను అందించామని పేర్కొన్నారు. తడి, పొడి చెత్త వేరు చేయడంలో దేశానికి మెదక్‌ జిల్లా ఆదర్శంగా నిలవాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు.

ఎమ్మెల్సీ శేరి సుభాష్‌కు మంత్రి అభినందనలు

తన స్వగ్రామమైన హవేళీఘణాపూర్‌ మండలం కుచన్‌పల్లిలో సొంత నిధులతో రైతు వేదిక నిర్మించేందుకు గతంలోనే హామీ ఇచ్చానని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ చెప్పారు. పనులు కూడా పూర్తి చేయనున్నట్టు వివరించారు. ఈ విషయమై మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తన సొంత నిధులతో రైతు వేదిక నిర్మించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, దుబ్బాక, అందోల్‌, నారాయణఖేడ్‌ ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, చంటి క్రాంతికిరణ్‌, భూపాల్‌రెడ్డి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నగేశ్‌, డీఆర్‌డీవో శ్రీనివాస్‌, డీపీవో హనోక్‌, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.