శనివారం 31 అక్టోబర్ 2020
Medak - Jul 07, 2020 , 02:20:44

గజ్వేల్‌ పట్టణానికి అందాల ‘ఆక్సిజన్‌'

గజ్వేల్‌ పట్టణానికి అందాల ‘ఆక్సిజన్‌'

  • అందంగా ముస్తాబైన అర్బన్‌ పార్కు
  • 117 హెక్టార్ల అడవిలో దాదాపు రూ.10 కోట్లతో నిర్మాణం 
  • బస చేసేందుకు వీలుగా కాటేజీలు
  • రాశి వనం, నక్షత్రవనం, లాబ్రింత్‌, చిల్డ్రన్స్‌ పార్కులు, ఓపెన్‌ జిమ్‌ ప్రత్యేకతలు..
  • మూడు గజ్‌బౌళ్లు.. తాటి చెట్లతో మీటింగ్‌ హాలు

చుట్టూ ఆకుపచ్చని చెట్లు.. ఆహ్లాదకర పరిసరాలు.. అందమైన మొక్కలు.. బస చేసేందుకు కాటేజీలు.. అటవీ అందాలు ఆస్వాదించేందుకు మూడు గౌజ్‌బౌళ్లు.. సేద దీరడానికి తాటిచెట్లతో పర్ణశాల.. రాశి వనం.. నక్షత్రవనం.. లాబ్రింత్‌, చిల్డ్రన్స్‌ పార్కు.. ఓపెన్‌ జిమ్‌.. ఇవన్నీ గజ్వేల్‌ పట్టణవాసులకు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. సీఎం కేసీఆర్‌ అద్భుత ఆలోచనతో గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధి సంగాపూర్‌ అటవీ ప్రాంతంలో ‘కల్పకవనం’ పేరిట అర్బన్‌ పార్కు రూపుదిద్దుకుంది. 117 హెక్టార్ల అటవీ ప్రాంతంలో సుమారు రూ.10 కోట్లతో పార్కు సిద్ధమైంది. ఓ వైపు మొక్కలతో పుడమికి ప్రాణం పోస్తూనే, మరోవైపు ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఆక్సిజన్‌ పార్కు ఏర్పాటు చేయడంపై సర్వత్రా సంతోషం వ్యక్తమవుతున్నది. త్వరలోనే సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. హరిత సంకల్పానికి ఊపిరి గజ్వేల్‌ అర్బన్‌ పార్కు. అక్కడ ఉన్న అందాలను వీక్షించేందుకు గజ్‌బౌల్‌ 3, సేద తీరడానికి తాటిచెట్లతో పర్ణశాల.., బస చేసేందుకు వీలుగా కాటేజీల నిర్మాణాలు ఇక్కడ చేపడుతున్నారు. అంతేకాకుండా రాశివనం, నక్షత్రవనం, లాబ్రింత్‌ పార్కు, ఓపెన్‌ జిమ్‌, చిల్డ్రన్స్‌ పార్కుతో ఆహ్లాదాన్ని అందించనున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రజలకు పచ్చదనాన్ని చేరువ చేసి స్వచ్ఛమైన గాలిని అందించేందుకు, గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్‌ అటవీ ప్రాంతంలోని 117 హెక్టార్లలో ‘కల్పకవనం’ పేరుతో అర్బన్‌ పార్కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకుగానూ సుమారు రూ.10 కోట్లను కేటాయిస్తున్నారు. ఓ వైపు మొక్కలతో పుడమికి ప్రాణం పోస్తూనే, మరోవైపు ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు అర్బన్‌ పార్కు ఏర్పాటు చేయడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  - గజ్వేల్‌ అర్బన్‌

గజ్వేల్‌ పట్టణం రోజురోజుకూ విస్తరించడంతో పాటు జనాభా పెరుగుతున్నది. మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల నిర్మాణంతో జనాభా మరింత రెట్టింపు కానున్నది. దీంతో ప్రజలందరికీ ఆరోగ్యంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన పార్కులు అవసరమని సీఎం కేసీఆర్‌ గుర్తించారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో కాలుష్యం పెరిగిపోతున్నందున స్వచ్ఛమైన ఆక్సిజన్‌ పీల్చుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఎంతో అవసరం. అందుకోసం సంగాపూర్‌ అటవీ ప్రాంతాన్ని అర్బన్‌పార్కుగా మార్చివేసి కొత్త అందాలను సృష్టించారు. ప్రస్తుతం ఈ పార్కు నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది.  

హరితతోరణం పార్కు ద్వారం

అచ్చం చెట్ల కాండలు, ఊడలతో అల్లుకున్న విధంగా సిమెంట్‌తో అర్బన్‌పార్కు ద్వారం వద్ద హరితతోరణాన్ని ఏర్పాటు చేశారు. నిజంగా చెట్లే స్వాగతం తెలుపుతున్నట్లుగా హరితతోరణం కనిపిస్తుంది. పార్కు చుట్టూ నాలుగున్నర కిలోమీటర్ల పొడవునా పటిష్టమైన ఫెన్సింగ్‌ నిర్మాణంతో పాటు ప్రధాన ద్వారం పక్కన గోడలపై అడవి మృగాలు, జంతువుల బొమ్మలను తీర్చిదిద్దారు.

ఓపెన్‌ జిమ్‌, చిల్డ్రన్స్‌ పార్కు

ఉదయం, సాయంత్రం వేళల్లో అర్బన్‌పార్కులోకి వాకింగ్‌, జాగింగ్‌ కోసం వచ్చే వాళ్లకు ప్రత్యేక ఓపెన్‌ జిమ్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. చిన్నారుల వినోదాల కోసం చిల్డ్రన్స్‌ పార్కు కూడా ఉంది. ప్రత్యేకంగా వారు ఆడుకోవడానికి లాబ్రింత్‌ పార్కును అందంగా తీర్చిదిద్దారు. అలాగే, అడవి మధ్యలోంచి గజ్‌బౌల్‌లను కలుపుతూ వాకింగ్‌ 9 కిలోమీటర్ల రోడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వాకింగ్‌ చేసేవారికి నీడ కోసం ఇరువైపులా రెండు వరుసలలో చెట్లు పెంచారు.  

గజ్‌బౌల్‌, తాటిచెట్లతో మీటింగ్‌హాల్‌..

అర్బన్‌ పార్కులోని అటవీ ప్రాంతాన్ని మొత్తం చూసేవిధంగా చెట్ల మధ్యలో గజ్‌బౌల్‌లను ఏర్పాటు చేశారు. వాకింగ్‌ మధ్యలో సేద తీరడానికి ఈ గజ్‌బౌల్‌లు ఉపయోగపడడంతో పాటు గజ్‌బౌల్‌పైకి ఎక్కి చూస్తే అటవీప్రాంతాన్ని మొత్తం వీక్షించవచ్చు. అలాగే కుటుంబ సమేతంగా, మిత్రబృందాలుగా వచ్చే వారు సమావేశం కావడానికి తాటిచెట్లతో మీటింగ్‌హాలు నిర్మాణాలు కూడా చేపట్టారు. అంతేకాకుండా ఒక రోజు బస చేసేందుకుగానూ పార్కులో అవకాశం కల్పించారు. రోజంతా పార్కులో గడపడంతో పాటు రాత్రి వేళలో అడవి అందాలను వీక్షించేందుకు వీలుగా అక్కడక్కడా కాటేజీలు, మెస్‌ ఏరియాలను కూడా ఏర్పాటు చేశారు. 

మల్కబావికి పూర్వవైభవం

సంగాపూర్‌ అటవీప్రాంతంలోని పురాతన మల్కబావి కూడా అర్బన్‌పార్కు పరిధిలోకి వచ్చింది. దీనిని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి పరిశీలించి పాడుబడ్డ మల్కబావిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు. బావి నిర్మాణంలో వినియోగించిన రాళ్లుతోనే మళ్లీ కట్టారు. బావిని మొత్తం శుభ్రం చేయడంతో అందంగా తయారైంది. అక్కడ ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకుకోకుండా బావి చుట్టూ కంచె ఏర్పాటు చేశారు.