మంగళవారం 04 ఆగస్టు 2020
Medak - Jul 05, 2020 , 23:55:08

ప్రభుత్వ కార్యాలయాలు పచ్చదనానికి నిలయాలు

ప్రభుత్వ కార్యాలయాలు పచ్చదనానికి నిలయాలు

ప్రభుత్వ కార్యాలయాలు పచ్చదనానికి నిలయాలుగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుతల వారీగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఐదు విడుతల్లో నాటిన మొక్కలు చెట్లుగా మారి నీడనిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలు, అధికారుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో నాటిన మొక్కలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఆయా కార్యాలయాలకు వెళ్లే ప్రజలు పచ్చదనాన్ని ఆస్వాధిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నర్సాపూర్‌: పట్టణంలోని  ప్రభుత్వ  కార్యాలయాల్లో నాటిన మొక్కలు ప్రస్తుతం చెట్లుగా మారి ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో హరితహారం కింద నాటిన మొక్కలు పచ్చదనాన్ని పంచుతున్నాయి. పండ్లు, పూలమొక్కలతో పాటు వివిధ రకాల మొక్కలను నాటారు. అవి చెట్లుగా మారి దవాఖానకు వచ్చే వారికి ఆహ్లాదాన్నిస్తున్నాయి. దవాఖాన అధికారులు మొక్కల రక్షణకు సిబ్బందిని నియమించి వాటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు.  

నర్సాపూర్‌లో ‘హరిత’ఠాణా

నర్సాపూర్‌ పట్టణంలో ఎస్‌ఐ వెంకటరాజాగౌడ్‌ ప్రత్యేక శ్రద్ధతో పోలీస్టేషన్‌ ఆవరణలో పార్కును ఏర్పాటు చేశారు. వివిధ రకాల అందమైన మొక్కలను నాటి, బెంచీలను కూడా ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల నుంచి రకరకాల సమస్యలతో వచ్చిన ప్రజలు ఇక్కడ కాసేపు ఇబ్బందులను మరిచి ప్రశాంతత కోసం కూర్చుని వెళ్తున్నారు. మొక్కల సంరక్షణ కోసం ప్రత్యేకంగా కానిస్టేబుల్‌ను నియమించారు. అలాగే, నర్సాపూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మొక్కలను నాటారు. ప్రస్తుతం అవి పెరిగి కార్యాలయానికి వచ్చిన రైతులకు ఎంతో నీడనిస్తున్నాయి. ఎంపీడీవో కార్యాలయం, ప్రభుత్వ హాస్టళ్లు, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, డివిజన్‌ అటవీ కార్యాలయంతో పాటు, గురుకుల పాఠశాల, బాలికల వసతి గృహానికి ఇరువైపులా నాటిన మొక్కలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. మండల పరిధిలోని మహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన కస్తూర్బా వసతి గృహంలో నాటిన మొక్కలు పెరిగి చెట్లుగా మారాయి. 

చేర్యాల: పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌ హరితమయంగా మారింది. ఎస్‌ఐ మోహన్‌బాబు ప్రత్యేక శ్రద్ధతో పచ్చని వాతావరణం నెలకొన్నది. పోలీస్‌ స్టేషన్‌ ఆవరణతో పాటు పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం సైతం మొక్కలతో నిండిపోయింది. స్టేషన్‌ పూలు, పండ్లు తదితర మొక్కలతో ఆకర్షణీయంగా మారింది.

ఆహ్లాదం.. రోడ్డు ప్రయాణం..

వెల్దుర్తి: ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా చేపట్టిన హరితహారంలో నాటిన మొక్కలు ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని కల్పిస్తుంది. వెల్దుర్తి-నర్సాపూర్‌కు వెళ్లే రెండు వరుసల బీటీ రోడ్డుకు ఇరువైపులా నాలుగో విడుత హరితహారంలో ఆటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. వాటిని సంరక్షించడంతో ఏపుగా పెరిగి రంగురంగుల పూలతో ఆహ్లాదాన్ని కల్గిస్తున్నాయి.  

బీరప్ప మర్రికి వందేండ్లు..

వందేండ్ల క్రితం మొలచిన ఆ మర్రి నేడు మహావృక్షమై నీడనిస్తున్నది. పెద్దపెద్ద ఊడలతో విస్తరించిన ఈ చెట్టు సుమారు అర ఎకరం వరకు నీడనిస్తున్నది. జగదేవ్‌పూర్‌ మండల పరిధిలోని చాట్లపల్లిలో గొల్లకుర్మల ఆరాధ్యదైవమైన బీరప్ప దేవాలయం వద్ద ఉన్న ఈ మర్రిచెట్టును వారు పవిత్రంగా కొలుస్తూ పూజలు చేస్తుంటారు. ఆలయం వద్ద ఏటా బోనాలు నిర్వహించే కులస్తులు ఈ చెట్టుకు బీరప్ప మర్రి అని పేరుపెట్టుకున్నారు. కొండపోచమ్మ దేవాలయానికి వెళ్లే భక్తులు ఈ చెట్టుకింద సేద తీరుతూ, సెల్ఫీలు తీసుకుంటారు. - జగదేవ్‌పూర్‌


logo