శుక్రవారం 23 అక్టోబర్ 2020
Medak - Jul 05, 2020 , 23:51:00

పెంపుడు కుక్కలతో జాగ్రత

పెంపుడు కుక్కలతో జాగ్రత

అనాధిగా మనిషికి పెంపుడు జంతువులతో అవినాభావ సంబంధం ఉంది. పెంపుడు కుక్కలతో మనుషులకు సాన్నిహిత్యం ఎక్కువనే చెప్పవచ్చు. పాడిగేదెలు, కోళ్లు, గొర్రెలు, మేకలు మనిషి జీవనోపాధిలో భాగంగా మారాయి. వీటిని వృత్తిగా చేసుకొని మనిషి జీవనోపాధి పొందుతున్నాడు. పెంపుడు జంతువులతో ప్రేమను పెంచుకోవడం ఎంత అవసరమో, వాటి నుంచి తగిన జాగ్రతలూ పాటించడం అంతే అవసరం.  - మెదక్‌/ మెదక్‌ రూరల్‌  

‘జూనోసిస్‌' అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అంటువ్యాధులు. జూనోసిస్‌ వ్యాధుల గురించి, వాటిని ఎలా నివారించాలి వంటి తదితర విషయాలపై అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. లూయిస్‌ పాశ్చర్‌ అనే ఫ్రెంచ్‌ జీవ శాస్త్రవేత్త కుక్కల నుంచి రేబిస్‌ వ్యాధి వస్తుందని గుర్తించడమే కాకుండా దానికి టీకా మందును కనుగొన్నాడు. ఆయన విజయానికి గుర్తుగా జూలై 6న ప్రపంచ జూనోసిస్‌ డేని నిర్వహించుకుంటున్నారు. జూలై 6, 1885లో నోబెల్‌ బహుమతి గ్రహీత లూయిస్‌ పాశ్చర్‌ మొదటగా పిచ్చికక్క కాటుకు గురైనా జోసెఫ్‌ అనే అబ్బాయికి పిచ్చికుక్క వ్యాధి(రేబిస్‌) నివారణకు టీకాను వేశారు. 

జూనోసిస్‌ వ్యాధులు..

ప్లేగు, క్షయ, క్యాట్‌, స్క్రాచ్‌ ఫీవర్‌, పక్షవాతం, మెదడువాపు వ్యాధి, బర్డ్‌ఫ్లూ, మశూచి, పశువుల్లో ఈనుడు రోగం, దొమ్మ రోగం, ధనుర్వాతం, నల్లజ్వరం, అమీబియాసిస్‌, తదితర వ్యాధులు. వివిధ రకాల వైరస్‌లతో సంక్రమించే వ్యాధులను ఆంగ్లంలో ‘జూనాటిక్‌ డిసీసెస్‌' లేదా ‘జూనోసెస్‌' అని అంటారు. అంటే జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులని అర్ధం. మానవులకు సంక్రమించే వ్యాధుల్లో 75శాతం అంటువ్యాధులు కాగా, వాటిలో 60శాతం జంతువుల నుంచి సంక్రమిస్తున్నవే. జూనోసిస్‌ అంటే సాంక్రమిక వ్యాధులు రెండు అంచుల పదునైన కత్తిలాంటివి. కొన్ని సాంక్రమిక వ్యాధులతో పశుగణాభివృద్ధికి నష్టం చేకూరుతోంది. ఈ సాంక్రమిక వ్యాధులు కొన్ని వృత్తుల్లో ఉండే వారికి వృత్తిపరమైన ఇబ్బందులు కలిగిస్తాయి. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేదలు అనారోగ్యం, అపరిశుభ్రత ప్రదేశాల్లో నివసించడమే కాకుండా, దాదాపుగా జంతువులలో సహజీవనం చేయడంతో సాంక్రమిక వ్యాధుల బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

  • పశువుల మలమూత్రాలను ఎప్పటికప్పుడు సరిగా తొలగించాలి. పశువులు, జంతువులను తాకినప్పుడు చేతులను యాంటీసెప్టిక్‌తో శుభ్రంగా కడుక్కోవాలి.
  • పెంపుడు జంతువులు, పశువుల్లో నట్టల నివారణ మందుతో పాటు ఇతర టీకాలు సరైన సమయంలో వేయించాలి.
  • పిచ్చికుక్కలు కరిస్తే వెంటనే ఆ ప్రదేశాన్ని సబ్బు నీళ్లతో 2-3 సార్లు కడగాలి. ప్రథమ చికిత్స తర్వాత టీటీ, యాంటీబయోటిక్స్‌, టీకా, ఇమ్మ్యూనోగ్లోబిన్స్‌ వంటి మందులను వైద్యుని సంప్రదించి, వారి సలహా మేరకు వాడాలి.
  • మనుషుల శరీరంపై పశువుల, పెంపుడు జంతువుల, పక్షులతో ఏమైనా గాయాలైతే వైద్యుడి సలహా మేరకు చికిత్స చేయించుకొని జాగ్రత్త వహించాలి.

నేడు పెంపుడు కుక్కలకు టీకాలు..

ప్రపంచ సాంక్రమిక వ్యాధుల దినోత్సవం సందర్భంగా జూలై 6న (నేడు) జిల్లా కేంద్రం మెదక్‌లోని ప్రాంతీయ పశువైద్యశాలలో పెంపుడు కుక్కలకు ఉచితంగా యాంటీ రేబిస్‌ టీకాలు వేస్తామని జిల్లా పశువైద్యాధికారి అశోక్‌కుమార్‌ తెలిపారు. మెదక్‌ పట్టణ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 


logo