గురువారం 29 అక్టోబర్ 2020
Medak - Jul 05, 2020 , 23:48:06

సేంద్రియంతో.. లాభదాయకం

సేంద్రియంతో.. లాభదాయకం

హుస్నాబాద్‌ : మారుతున్న పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా ఫెస్టిసైడ్స్‌ రహిత పంటలు పండిస్తే రైతులకు లాభం, ప్రజలకు ఆరోగ్యదాయకంగా ఉంటుంది. ఆధునిక పోకడలకు అద్దంగా నిలుస్తున్న వ్యవసాయ విధానానికి ఇక చెల్లు చీటి తప్పదనిపిస్తోంది. ఎందుకంటే రసాయనాలతో కూడిన ఎరువులను మోతాదుకంటే ఎక్కువగా ఉపయోగించి పండించిన పంటలకు రాబోయే రోజుల్లో మార్కెట్‌లో గిరాకీ తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పుడమితల్లికి చేవనిచ్చే ఎరువులను కాకుండా రసాయనాలతో కూడిన ఎరువులను విపరీతంగా ఉపయోగించి పండించిన పంటలతో రోగాలు ఖాయమంటున్నారు నిపుణులు. ప్రపంచ మార్కెట్‌లో సేంద్రియ పంటలకు మంచి డిమాండ్‌ ఉంది. దీంతో రైతులు ఎక్కువగా సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ఎంచుకుంటున్నారు. సేంద్రియ వ్యవసాయం అంటే రసాయనాలతో కూడిన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా.. ప్రకృతి సిద్ధమైన ఎరువులు పశువుల పేడ, వేపపిండి, వేపనూనె, వర్మీకంపోస్ట్‌ వంటి పదార్థాలను ఉపయోగించి పంటలు పండించడం. సేంద్రియ వ్యవసాయానికి ఎక్కడినుంచో ఎరువులు కొనుగోలు చేయడం కాకుండా రైతుకు అందుబాటులో ఉన్న పదార్థాలు, వస్తువులతోనే తయారు చేసుకోవచ్చని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. 

సేంద్రియ పంటలకు భలే గిరాకీ.. 

సేంద్రియ వ్యవసాయంతో పండించిన పంటలకు మెట్రో నగరాల్లో మంచి డిమాండ్‌ ఉన్నది. సాధారణంగా పండించే పంటల కంటే సేంద్రియ ఎరువులు ఉపయోగించి పండించిన పంటలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంటుంది. మెట్టప్రాంత రైతులు సేంద్రియ ఎరువులను సొంతంగా తయారు చేసుకొని, సాంప్రదాయ వ్యవసాయానికి ఉన్న డిమాండ్‌ను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రైతులు మార్కెట్‌ అవసరాల దృష్ట్యా సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లినట్లయితే లాభదాయకంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

సేంద్రియ పంటలను బ్రాండింగ్‌ చేసుకునే అవకాశం.. 

సేంద్రియ వ్యవసాయంలో మొదటి రెండు లేదా మూడు సంవత్సరాలు పంట దిగుబడి అంతగా లేకపోయినా, నేల మొత్తం సారవంతంగా తయారైన తరువాత మంచి నాణ్యమైన దిగుబడులు రావడం ఖాయం. రైతులు పండించిన సేంద్రియ పంటలకు బ్రాండింగ్‌ కూడా చేసుకునే అవకాశం ఉంది. సేంద్రియ సాగు ద్వారా పండించిన పంటలను మార్కెటింగ్‌ చేసుకోవడం కోసం సేంద్రియ సర్టిఫికేషన్‌ చేయించుకోవచ్చు. ఈ ప్రక్రియను వ్యవసాయ మరియు ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏపీఈడీఏ) ద్వారా చేసుకోవచ్చు.

వాతావరణానికి అనుకూలంగా సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేస్తే రైతులకు ఎంతోమేలు జరుగుతుంది. సేంద్రియ పంటలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. కాబట్టి, రైతులు తమకు అందుబాటులో ఉన్న పదార్థాలతో సేంద్రియ ఎరువులను తయారు చేసుకొని తమ పొలంలో సేంద్రియ పంటలను సాగు చేసుకుంటే లాభాలతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి.- నాగరాజు, మండల వ్యవసాయశాఖ అధికారి, హుస్నాబాద్‌

సేంద్రియ ఎరువుల్లో రకాలు..

సేంద్రియ వ్యవసాయంలో ముఖ్యంగా పచ్చిరొట్ట పైరు సాగు, పశువుల పేడ, వర్మీకంపోస్టు, వర్మీవాష్‌, వేపనూనె, వేపపిండి, ద్రవ జీవామృతం, ఘన జీవామృతం, జీవన ఎరువుల వినియోగం తదితరాలు ఉంటాయి. వీటిని వినియోగించి సేంద్రియ వ్యవసాయాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు చేసుకోవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. 
1) వర్మీకంపోస్టు తయారీ విధానం.. 
వర్మీకంపోస్టు తయారు చేసుకోవాలనుకున్న రైతు మొదటగా తన భూమిలో రేకులషెడ్‌ను నిర్మించుకోవాలి. 50 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, ఒక అడుగులోతు ఉన్న గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కో గుంతలో వానపాములు 5 కిలోలు, కుళ్లిన వ్యర్థ పదార్థాలు వేసి ప్రతి రోజు తేమ ఉండేలా రెండు నుంచి మూడు సార్లు నీళ్లు చల్లాలి. ఇలా 45 రోజులు చేసినట్లయితే వర్మీకంపోస్టు తయారవుతుంది. దీనిని పంటపొలంలో చల్లినట్లయితే మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. 
2) వర్మీవాష్‌ .. 
వర్మీవాష్‌ అనేది వర్మీకంపోస్టు నుంచి ద్రవరూప ఎరువును తయారు చేయడం. ఇది ఎలా తయారు చేస్తారంటే అప్పటికే తయారు చేసుకున్న వర్మీకంపోస్టును ఒక కుండలో పోసి కింద చిన్న రంధ్రం చేస్తే చాలు. కుండలో పై నుంచి నీళ్లు పోయడంతో ఆ నీరు కిందికి చేరుకుని ఒక ద్రవణంగా మారి కుండ కింద చేసిన రంధ్రం ద్వారా బయటకు వస్తుంది. దీనిని పంటలపై పిచికారీ చేస్తే మొక్కలు ఎంతో ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. వర్మీవాష్‌తో మొక్కల ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. 
3) ఘన జీవామృతం..
ఘన జీవామృతం తయారు చేసుకోవడం కోసం 5 కిలోల పేడ, 2 కిలోల బెల్లం, ఒక కిలో పప్పుపిండి, 5 లీటర్ల ఆవు మూత్రం, పిడికెడు పుట్టమట్టి కావాల్సి ఉంటుంది. ఈ పదార్థాలన్నింటినీ కలిపి 48 గంటల వరకు నిల్వ ఉంచి పైరుపై చల్లితే మంచి దిగుబడులు పొందడంతో పాటు ఆరోగ్యకరమైన పంట చేతికొస్తుంది. 
4) ద్రవ జీవామృతం తయారీ విధానం.. 
ద్రవ జీవామృతం తయారీ కోసం 200 లీటర్ల డ్రమ్ము, 10 లీటర్ల ఆవు మూత్రం, 10 కిలోల పేడ, 2 కిలోల పిండి, 2 కిలోల బెల్లం, పిడికెడు మెత్తని మట్టిని సేకరించాలి. వీటన్నింటినీ డ్రమ్ములో వేసి రోజుకు రెండుసార్లు కలపాలి. 10 రోజుల తరువాత ద్రవ జీవామృతం తయారవుతుంది. దీనిని పంటలపై పిచికారీ చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.

 


logo