శనివారం 31 అక్టోబర్ 2020
Medak - Jul 05, 2020 , 00:58:24

ఊరంతా కూరగాయలే

ఊరంతా కూరగాయలే

  • కరీంనగర్‌, వరంగల్‌, సిద్దిపేట మార్కెట్లకు ఉత్పత్తుల తరలింపు
  • ఆదర్శంగా నిలుస్తున్న తురుకవానికుంట గ్రామస్తులు
  • పాడిపరిశ్రమలోనూ ముందంజ 

ఒక్కరిద్దరూ కాదు... ఊరంతా కూరగాయలే పండిస్తారు. గుంట నుంచి మొదలు ఐదు, పది, ఇరవై గుంటల్లో ఎటూచూసినా కూరగాయలు, ఆకుకూరల పంటలే సాగు చేస్తారు. ఒకరిని మించి ఒకరు పోటీపడుతూ పండిస్తారు. దీనికి తోడు పెద్దఎత్తున పాడిపరిశ్రమలో స్వయం ఉపాధి పొందుతూ ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పోతారం(జే) గ్రామ పరిధిలోని తురుకవానికుంట రైతులు. ఇక్కడి రైతులు బెండకాయ, టమాట, మిర్చి, దొండకాయ, కాకరకాయ, చిక్కుడు, బీరకాయ, సొరకాయ, గోరుచిక్కుడు, అలచింత కాయతో పాటు ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, పుదీన, మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు, పాలకూర, గంగావాయిలి కూర, తోటకూర, బచ్చలికూర పండిస్తూ కరీంనగర్‌, వరంగల్‌, సిద్దిపేట, హుస్నాబాద్‌ మార్కెట్లలో హోల్‌సేల్‌ ధరలకు విక్రయిస్తున్నారు.  - అక్కన్నపేట

తురుకవాని కుంట గ్రామంలో ఏడాది పొడవునా అన్నిరకాల కూరగాయలు లభిస్తాయి. పోతారం(జే) గ్రామ పంచాయతీ పరిధిలోని తురుకవానికుంటలో 49 వరకు ఇండ్లు ఉన్నాయి. ఈ గ్రామానికి చెందిన 25మంది ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తుండగా, మరో 15మంది ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నారు. సుమారు 50మంది రైతులు ఊరిలో ఉండి వ్యవసాయం చేస్తున్నారు. ఇందులో 40మంది రైతులు పూర్తిగా కూరగాయలు సాగుచేస్తుండగా, మరో 10మంది రైతులు కేవలం పాడిపరిశ్రమ చేపడుతున్నారు. ఈ ఊరిలో ఇతర కూలీలు, జీతగాళ్లు లేకుండా కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే పనులు చేసుకోవడం విశేషం.గ్రామంలోని పాలకేంద్రంలో నిత్యం 400 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుందంటే ఇక్కడ ఏస్థాయిలో పాడిపరిశ్రమ అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు.   

కరీంనగర్‌, వరంగల్‌, సిద్దిపేట మార్కెట్లకు తరలింపు...

తురుకవానికుంట రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలు ఆటోల ద్వారా కరీంనగర్‌, వరంగల్‌, సిద్దిపేట, హుస్నాబాద్‌ మార్కెట్లకు తరలించి హోల్‌సేల్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. కొందరు రైతులు ద్విచక్ర వాహనాలు, ఆటోల ద్వారా చుట్టుపక్కల ఊర్లలో జరిగే అంగళ్లతో పాటు గ్రామాల్లో తిరుగుతూ విక్రయిస్తున్నారు. ప్రస్తుతం బెండకాయ, టమాట, మిర్చి, సొరకాయ, కొత్తిమీర, పుదీన, మెంతి, తోటకూర, గంగావాయిలికూర, పాలకూర, బచ్చలికూర సాగులో ఉన్నాయి. ఈ గ్రామంలో వరి, పత్తి, మొక్కజొన్న ఇతరత్రా పంటల సాగు విస్తీర్ణం చాలా తక్కువగా ఉంటుంది. 

ఏడాది పొడువునా సాగు.. 

ఐదు, పది గుంటల్లో ఏడాది పొడువునా ఏదో ఒక కూరగాయ పంట పండిస్తుంటాం. నీటి వినియోగం, పెట్టుబడి తక్కువ ఉండడం, తక్కువ రోజుల్లో డబ్బులు చేతికి వస్తుండడంతో ప్రధానంగా కూరగాయలు సాగుచేస్తున్నాం. పండించిన కూరగాయలు, ఆకుకూరలను ముగ్గురు, నలుగురు రైతులం కలిసి ఆటోల ద్వారా కరీంనగర్‌, వరంగల్‌, సిద్దిపేట మార్కెట్‌కు తీసుకుపోయి అమ్ముకుంటాం. 

- ఎలుమెట్ల అంజిరెడ్డి, రైతు, తురుకవానికుంట  

కూరగాయల సాగు లాభదాయం.. 

రెండు ఎకరాలు వరి సాగుచేస్తే వచ్చే లాభం కన్నా, పది గుంటల్లో సాగుచేసే కూరగాయలతో ఎక్కువ సంపాదించవచ్చు. నాకు ఆరు ఎకరాల భూమి ఉంది. మూడెకరాల్లో పత్తి, వరి సాగుచేస్తుండగా, మిగతా మూడెకరాల్లో ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నా.

- గడ్డం పద్మ, మహిళా రైతు, తురుకవానికుంట