మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Jul 04, 2020 , 02:47:33

మధ్య తరహా ప్రాజెక్టుకు మహర్దశ

 మధ్య తరహా ప్రాజెక్టుకు మహర్దశ

  • జోరుగా సాగుతున్న ఘన్‌పూర్‌ ఆనకట్ట ఎత్తు పెంపు పనులు
  • n ప్రొటెక్షన్‌ వాల్‌ పనులు పూర్తి
  • n వేగంగా చేపడుతున్న మట్టి పనులు
  • n భూములిచ్చేందుకు చిన్నాఘన్‌పూర్‌ రైతుల అంగీకారం
  • n పెరుగనున్న నీటినిల్వ సామర్థ్యం
  • n అదనంగా మరో ఏడు వేల ఎకరాలకు లబ్ధి 

ఆనకట్ట ఎత్తు పెంపుదలతో కొల్చారం మండలంలోని చిన్నఘన్‌పూర్‌, సంగాయిపేట గ్రామాలకు చెందిన 98మంది రైతులు 69 ఎకరాలు,  పాపన్నపేట మండలంలోని నాగ్సాన్‌పల్లి, కొడుపాక, చిత్రయాల్‌ గ్రామాలకు చెందిన 268 మంది రైతుల 121 ఎకరాల భూములు ముంపునకు గురికానున్నట్లు అధికారులు గుర్తించారు. ముంపు భూముల విషయంలో అధికారులు తప్పుడు సర్వేలు చేశారని కొన్నాళ్ల పాటు రైతులు గొడవ చేశారు. ముంపునకు గురయ్యే భూములకు సంబంధించి నీటిపారుదల అధికారులు సర్వేచేసి రెవెన్యూ అధికారులకు నివేదిక అందజేశారు. అప్పట్లోనే పాపన్నపేట మండలానికి సంబంధించిన భూములకు రెవెన్యూ అధికారులు డ్రాప్ట్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు. ఆనకట్ట ఎత్తు పెంపు పనులు ప్రారంభించేందుకు వెళ్లగా, కొల్చారం మండలం చిన్నఘన్‌పూర్‌ గ్రామానికి చెందిన 63మంది రైతులు అభ్యంతరం తెలిపారు. ఆనకట్ట ఎత్తు పెంపు పనులు నిర్వహించమని, కేవలం ప్రొటెక్షన్‌వాల్‌ పనులు మాత్రమే చేపడతామని అధికారులు రైతులకు వివరించడంతో వారు అంగీకరించారు. ఆనకట్ట ఎత్తు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.43.64 కోట్లు మంజూరు చేయగా, ఇందులో ఎత్తు పెంపు, ఇతర పనులకు రూ.28 కోట్లు, భూసేకరణ పరిహారానికి రూ.15.01 కోట్లు కేటాయించారు. మంజీరా నదిపై 0.2 టీఎంసీల నీటినిల్వ సామర్ధ్యంతో కొల్చారం మండలం చిన్నఘన్‌పూర్‌ వద్ద నిర్మించారు. మెదక్‌, హవేళిఘన్‌పూర్‌, కొల్చారం, పాపన్నపేట మండలాల్లో 21,625 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఈ ఆనకట్ట పరిధిలో మహబూబ్‌నహర్‌, ఫతేనహర్‌ కాలువల ద్వారా నీరందుతాయి. ఎంఎన్‌ కెనాల్‌ 43 కిలోమీటర్లు ఉండగా, ఈ కాలువ ద్వారా మెదక్‌, హవేళిఘన్‌పూర్‌, కొల్చారం మండలాలకు ఎఫ్‌ ఎన్‌ కెనాల్‌ 12 కిలోమీటర్లు ఉండగా, పాపన్నపేట మండలంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరందేలా కాలువలు నిర్మించారు. సింగూరు ప్రాజెక్టులో 0.4 టీఎంసీల నీటివాటా ఉండగా, ఏడాదిలో వానకాలం, యాసంగి సీజన్‌లలో నీటిని ఘన్‌పూర్‌ ప్రాజెక్టుకు విడుదల చేస్తారు. సింగూరు నుంచి ఘన్‌పూర్‌ ఆనకట్టకు నీరు చేరగానే, అధికారులు వాటిని ఎంఎన్‌, ఎఫ్‌ఎన్‌ కెనాల్‌లకు నీటిని విడుదల చేస్తారు. కేవలం మూడు, నాలుగు రోజులు మాత్రమే నీరు నిల్వ ఉంటుంది. ఆ తర్వాత ఆనకట్ట ఎడారిలా మారుతున్నది. ఆనకట్టలో పూడిక పేరుకుపోవడంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందడం లేదు. దీంతో రెండు కాల్వల కింద పూర్తిస్థాయిలో ఆయకట్టు స్థిరీకరణ జరుగడం లేదు. కేవలం పది వేల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది.  

కొల్చారం: మెదక్‌ జిల్లాలోనే ఏకైక మధ్య తరహా ప్రాజెక్టు అయిన  ఘన్‌పూర్‌ ఆనకట్ట ఎత్తు పెంపు పనులు జోరుగా సాగుతున్నాయి. భూసేకరణ ప్రక్రియ పూర్తయినప్పటికీ, పరిహారం విషయంలో నెలకొన్న స్తబ్దతతో కొన్ని రోజులుగా పనులు స్తంభించిపోయాయి. ఇటీవల నీటిపారుదల, రెవెన్యూశాఖల అధికారులు చిన్నాఘన్‌పూర్‌ రైతులతో జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయి. పరిహారం చెల్లింపు విషయంలో అధికారులకు రైతులతో అంగీకారం కుదిరింది. రైతులు పత్రాలపై సంతకాలు చేశారు. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు ఇటీవల పనులు ప్రారంభించారు. ఇప్పటికే ఆనకట్ట ఎత్తు 1.725 మీటర్లు పెంచేందుకు వీలుగా ప్రొటెక్షన్‌ వాల్‌ పనులు పూర్తిచేశారు. ఇప్పుడు చిన్నాఘన్‌పూర్‌ ఐబీ వైపు చిన్నగా ఉన్న మట్టికట్టను వెడల్పు చేసేందుకు టిప్పర్లతో మట్టిని పోస్తున్నారు. నెల రోజుల్లో మట్టికట్ట వెడల్పు పనులు పూర్తి చేయడంతో పాటు ఆనకట్ట ఎత్తు పెంపుదల పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వానకాలం ప్రారంభం కావడంతో ఆనకట్ట ఎత్తు పెంపు పనుల్లో మరో నాలుగు నెలలు ఆలస్యం కానుండగా, వచ్చే ఏప్రిల్‌ నాటికి పూర్తి చేయనున్నారు. వచ్చే వానకాలం నాటికి పనులు పూర్తిచేసి రైతులకు 0.300 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా పనులు చర్యలు చేపడతామని నీటిపారుదల శాఖ డీఈ శివనాగరాజు తెలిపారు.  

హామీ నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌...

నిజాం కాలంలో నిర్మించిన ఘన్‌పూర్‌ ఆనకట్టను 2014లో సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్‌ వ్యూలో చూశారు. ఆనకట్ట పునరుద్ధరణకు నిధులు మంజూరు చేస్తానని అప్పట్లో ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు నీటిపారుదల అధికారులు ఆనకట్ట పునరుద్ధరణ, ఎత్తు పెంపుదలకు రూ.43.64 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆనకట్ట నీటినిల్వ సామర్థ్యం 0.135 మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్లు ఉండగా, కట్ట ఎత్తు 1.725 మీటర్ల ఎత్తు పెంపుతో ఆనకట్ట సామర్ధ్యం 0.3 మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్లకు చేరనుంది. 

రూ. 16కోట్లతో ప్రొటెక్షన్‌ వాల్‌ పనులు...

ఘన్‌పూర్‌ ఆనకట్ట ఎత్తు పెంపు పనుల్లో భాగంగా అధికారులు రైతులను ఒప్పించి ఆనకట్ట వద్ద ప్రొటెక్షన్‌ వాల్‌ పనులు పూర్తిచేశారు. డ్యాం పొడవు 724.5 మీటర్లు ఉండగా, దిగువన రూ.16 కోట్లతో ప్రొటెక్షన్‌ వాల్‌ పనులు నిర్వహించారు. ఘన్‌పూర్‌ ఆనకట్ట ఆయకట్టు కింద 21,625 ఎకరాలు స్థిరీకరించగా, 1.725 మీటర్ల ఎత్తు పెంపుదలతో మరో ఆరు నుంచి ఏడు వేల ఎకరాలు పెరగనుంది. అదనంగా ఆయకట్టు స్థిరీకరణతో పాటు సింగూర్‌ నుంచి వచ్చే నీటిని 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.

ఆనకట్ట ఎత్తు పెంపుతో రెండు పంటలు..

ఘన్‌పూర్‌ ఆనకట్ట ఎత్తు పెంపుతో నీటినిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ఇప్పటి వరకు ప్రతిసారి నీళ్ల కోసం ఉద్యమాలు చేసేవారం. హైదరాబాద్‌కు పోయి ఎమ్మెల్యేల దగ్గర మోకరిల్లాల్సి వచ్చేది. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ ఘన్‌పూర్‌ ఆనకట్ట పెంచడానికి నిధులు మంజూరు చేశారు. దీంతో పనులు చకచకా నడుస్తున్నాయి. పనులు పూర్తయితే ప్రతి ఏడాది రెండు పంటలు పండుతయి.


logo