ఆదివారం 05 జూలై 2020
Medak - Jul 01, 2020 , 00:19:45

రోజురోజుకూ పెరుగుతున్న కేసులు

రోజురోజుకూ పెరుగుతున్న కేసులు

  • పట్టణాలు, కాలనీల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌
  • వర్తక, వ్యాపార సంఘాలు ఎక్కడికక్కడ తీర్మానాలు
  • హుస్నాబాద్‌లో 6గంటలకే వైన్స్‌లు బంద్‌
  • సిద్దిపేటలో 4 గంటలకు దుకాణాలు మూసివేత

రోజు రోజుకూ కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతున్నది. రోజువారీగా పాజిటివ్‌ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతున్నది. ఒకటి రెండు కేసులతో మొదలైన కొవిడ్‌-19 పాజిటివ్‌ లెక్క ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 246కు చేరింది. కేసులు పెరుగుతుండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నది. మరో వైపు వ్యాపార, వాణిజ్య, వర్తక సంఘాలు ఎక్కడికక్కడ స్వచ్ఛంద లాక్‌డౌన్‌లు ప్రకటించుకుంటున్నాయి. ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోయినప్పటికీ ఎవరికి వారుగా అప్రమత్తమవుతున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులు ఇచ్చినప్పటి నుంచే కేసులు పెరిగాయని భావిస్తున్న వ్యాపార సంస్థలు ఈ మేరకు లాక్‌డౌన్‌ విధించుకుంటున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 6 గంటలకే వైన్స్‌లు బంద్‌ చేస్తున్నారు. సిద్దిపేటలో వ్యాపార, వాణిజ్య సంస్థలు 4 గంటలకే క్లోజ్‌ చేస్తున్నారు. జహీరాబాద్‌, అందోలు, సంగారెడ్డి, పటాన్‌చెరు, ఆర్సీపురం ప్రాంతంలో ఇదే తరహా స్వచ్ఛంద లాక్‌డౌన్‌లు కొనసాగుతున్నాయి. ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే కేసులు పెరుగుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా, ప్రభుత్వం పాజిటివ్‌ వచ్చిన వారికి ప్రత్యేక కేర్‌ తీసుకుని చికిత్స అందిస్తుండడంతోనే రోజుల వ్యవధిలోనే కరోనాను జయించి ఆరోగ్యంగా ఇండ్లకు చేరిపోతున్న విషయం తెలిసిందే. - సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ

ఎవరికి వారుగా నిర్ణయం..

మార్చిలో కరోనా కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఆ వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించిన విషయం కూడా విధితమే. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో జిల్లాలో కేసుల సంఖ్య పెరుగడం మొదలైంది. వాస్తవానికి ఈ 15 రోజుల్లోనే పాజిటివ్‌ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇది గమనించిన ఉమ్మడి జిల్లాలోని వ్యాపార, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు ఎవరికి వారు స్వచ్ఛంద లాక్‌డౌన్‌లు పెట్టుకుంటున్నారు. కరోనా మొదట్లోనే సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ కొనసాగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇది అన్ని ప్రాంతాలకు విస్తరించింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వైన్స్‌లు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థలు 6 గంటలకు మూసి వేస్తున్నారు. అన్ని సంస్థల వ్యాపారులు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో కూడా 4 గంటలకే దుకాణాలు మూసి వేస్తున్నారు. నంగునూరు మండల కేంద్రంలో సాయంత్రం 5 గంటల నుంచి బంద్‌ పాటిస్తున్నారు. గజ్వేల్‌లో డయాగ్నస్టిక్‌ సెంటర్లు, వర్తక, వాణిజ్య సంస్థలు 5 గంటల వరకు తెరిచి ఉంటున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం, అమీన్‌పూర్‌, పటాన్‌చెరులలో కూడా కాలనీ వారీగా లాక్‌డౌన్‌ విధించుకున్నారు. సాయంత్రం నుంచి దుకాణాలను మూసి వేసుకుంటున్నారు. ప్రధానంగా ఇక్కడ బీడీఎల్‌లో ఎక్కువ కేసులు పెరుగుతుండడంతో అన్ని మూసి వేసుకుంటున్నారు. తూప్రాన్‌ మున్సిపాలిటీలో కూడా స్వచ్ఛందంగా పలు కాలనీల్లో లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. అందోలులో సాయంత్రం 4 గంటలకు వ్యాపార సంస్థలు మూసి వేస్తున్నారు. మొత్తంగా ఎవరికి వారు చైతన్యంగా వ్యాధి కట్టడికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలో 246 పాజిటివ్‌ కేసులు

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మార్చి నుంచి ఇప్పటి వరకు మొత్తం 246 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొదట్లో ఒకటి, రెండుతో మొదలైన కేసుల సంఖ్య ప్రస్తుతం రోజు 20కి చేరుతున్నది. రోజువారీగా సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ మూడు జిల్లాలో కేసులు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 161 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. అయితే గ్రేటర్‌ హైదరాబాద్‌లో కలిసి ఉండడంతో కేసుల సంఖ్య పెరుగుతున్నదని చెప్పుకోవచ్చు. పటాన్‌చెరు, రామచంద్రాపురం, అమీన్‌పూర్‌లలో రోజువారీగా కేసులు నమోదు అవుతున్నాయి. సోమవారం ఒక్క రోజే పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని ఓ ఫార్మా పరిశ్రమలో 25 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇకపోతే సిద్దిపేట జిల్లాలో 46 కేసులు, మెదక్‌ జిల్లాలో 39 పాజిటివ్‌ కేసులు ఇప్పటి వరకు నమోదు అయ్యాయి. కేసులు నమోదు అవుతున్నప్పటికీ అప్రమత్తంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నది. వ్యాధి తీవ్రతను బట్టి హైదరాబాద్‌లోని గాంధీతో పాటు ఇతర దవాఖానలకు పంపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా దవాఖానలో కూడా కరోనా చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 246 కేసులు నమోదు అయితే 103 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మిగతా వారు కోలుకుని ఆరోగ్యంగా తమ ఇండ్లకు చేరుకున్నారు.

మెరుగైన వైద్య సేవలు..

కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిన వారికి ప్రభుత్వ యంత్రాంగం మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నది. ఎక్కడికక్కడ వైద్య బృందం అప్రమత్తంగా ఉంటున్నది. కేసు వచ్చిందని తెలిసిన వెంటనే వైద్య సిబ్బంది, పోలీసులు, స్థానిక తాసిల్దార్‌ పాజిటివ్‌ వచ్చిన వారి ఇంటి పరిసరాల వద్దకు వెళ్తున్నాయి. అక్కడ మందులు పిచికారీ చేయడంతో పాటు కేసు వచ్చిన వ్యక్తితో ఎవరెవరో కలిసారో విచారించి అందరినీ క్వారంటైన్‌కు పంపుతున్నారు. అనుమానం ఉంటే పరీక్షలు జరుపుతున్నారు. సమాజంలోని ప్రజలు భయపడినప్పటికీ వైద్య సిబ్బంది మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా దవాఖానలో ఓ నర్సుకు కూడా కరోనా వచ్చింది. అయినప్పటికీ సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యసేవలు అందిస్తున్నారు. తూప్రాన్‌, మెదక్‌ జిల్లాలో వైద్యులు, నర్సులకు కూడా పాజిటివ్‌ వచ్చింది. అయినా వైద్య సిబ్బంది మంచి వైద్యసేవలు అందిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ ఇతర శాఖల సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండి, వైద్యుల సేవలకు సహకరిస్తున్నారు. ఓ వైపు పెద్దఎత్తున కేసులు పెరుగుతున్నప్పటికీ అంతేస్థాయిలో కోలుకుంటున్నారు కూడా. అయితే కొంతమంది ఏ మాత్రం అప్రమత్తంగా ఉండకపోవడంతోనే కేసులు పెరుగుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. logo