గురువారం 22 అక్టోబర్ 2020
Medak - Jun 30, 2020 , 02:36:46

పీవీ హయాలోనే రాజీవ్హ్రదారి

పీవీ హయాలోనే రాజీవ్హ్రదారి

  • శంకుస్థాపన రోజే రాజీవ్‌ రహదారిగా నామకరణం
  • సికింద్రాబాద్‌ నుంచి రామగుండం వరకు రోడ్డు నిర్మాణం
  • 200 కిలో మీటర్లలో 105 కిలో మీటర్లు సిద్దిపేట జిల్లాలోనే..
  • మొత్తం మూడు టోల్‌ప్లాజాల్లో రెండు ఇక్కడే..
  • నాలుగు వరుసల రహదారిపై నిత్యం వేలాది వాహనాల రాకపోకలు
  • ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు

సిద్దిపేట నమస్తే తెలంగాణ: తెలంగాణ బిడ్డ, భారతదేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రాజీవ్‌ రహదారిని మంజూరు చేయించి పనులు పూర్తి చేయించారు. ఇవాళ ఈ ప్రాంత ప్రజలు రాజీవ్‌ రహదారి సేవలను వినియోగించుకుంటున్నారు. సికింద్రాబాద్‌ నుంచి గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌-సిద్దిపేట-కరీంనగర్‌-పెద్దపల్లి-రామగుండం ప్రధాన పట్టణాలను కలుపుతూ రహదారిని నిర్మించారు. ప్రస్తుతం నాలుగులైన్ల రహదారిగా మారడంతో నిత్యం వేలాది వాహనాలు నడుస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో వంటిమామిడి వద్ద రహదారి ప్రారంభమై బెజ్జంకి మండలం దేవక్కపల్లి వరకు మన జిల్లా పరిధిలోకి వస్తుంది. సుమారు 105 కిలో మీటర్లు ఉంటుంది. రాష్ట్రం ఏర్పాటయ్యాక, సీఎం కేసీఆర్‌ ఈ రహదారిపై ప్రత్యేక చొరువ తీసుకున్నారు. 

సిద్దిపేటలో 105 కిలోమీటర్లు.. 

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నుంచి ఉత్తర తెలంగాణలోని పాత ఉమ్మడి జిల్లాల మీదుగా గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌, సిద్దిపేట, కరీంనగర్‌, పెద్దపల్లి, రామగుండం వరకు సుమారుగా 200 కిలో మీటర్లు ఉంటుంది. సిద్దిపేట జిల్లాలో వంటిమామిడి నుంచి బెజ్జంకి మండలం దేవక్కపల్లి వరకు సుమారు 105కిలో మీటర్లు ఉంటుంది. సికింద్రాబాద్‌ నుంచి రామగుండం వరకు ఈ రోడ్డును మరమ్మతును చేపట్టడానికి అప్పటి ప్రభుత్వం సుమారుగా రూ.220 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఈ పనుల నిర్వహణను ఏడీబీ ప్రాజెక్టుకు అప్పగించారు. భారతదేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు  సికింద్రాబాద్‌లో రోడ్డు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. ఆ రోజే ఈ రోడ్డుకు రాజీవ్‌ రహదారిగా పీవీ నరసింహారావు నామకరణం చేశారు. రెండు వరుసలుగా రోడ్డు మరమ్మతు పనులు త్వరతిగతిన పూర్తి చేశారు. రోజు రోజుకు ట్రాఫిక్‌ పెరగడంతో రాజీవ్‌ రహదారిని రెండు వరుసల నుంచి నాలుగు వరుసల రహదారిగా మార్చాలనే ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. దీంతో అప్పటి ప్రభుత్వాలు ప్రైవేటు పబ్లిక్‌ పార్టిసిపేషన్‌(పీపీటీ) కింద అనుమతిచ్చింది. సికింద్రాబాద్‌ నుంచి రామగుండం వరకు నాలుగు వరుసలుగా రోడ్డు విస్తరించేందుకు సుమారుగా రూ.1100 కోట్లతో పీపీటీ కింద పనులు చేపట్టడానికి ఒప్పందం కుదిరింది. ఈ పనులను హెచ్‌కేఆర్‌ ఏజెన్సీ దక్కించుకుంది. టోలు వసూలు చేసుకొని, తాను పెట్టిన ఖర్చులను పూర్తి చేసుకునేలా ఏజెన్సీలు  ముందుకొచ్చాయి. ఈ పనులను ప్రతి 50 కిలో మీటర్లకు ఒక ప్యాకేజీ చొప్పున నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. గాయత్రీ, మెగా కంపెనీలు రోడ్డు పనులను పూర్తి చేశాయి. శామీర్‌పేట నుంచి పొన్నాల వరకు ఒక టోల్‌ ప్లాజాను దుద్దెడ వద్ద ఏర్పాటు చేశారు. పొన్నాల నుంచి కరీంనగర్‌ వరకు రేణిగుంట వద్ద రెండో టోల్‌ ప్లాజాను ఏర్పాటు చేశారు. నాలుగు వరుసల రహదారి పనలు పూర్తి చేయగానే, 2014 జూన్‌ 1 నుంచి టోల్‌ప్లాజాను అమలులోకి తెచ్చారు. ఈ టోల్‌ ప్లాజా గడువు 2035వ సంవత్సరం వరకు ఉంది. ప్రతి రోజు వేలాది వాహనాలు ఈ రోడ్డుపై రాకపోకలు జరుగుతున్నాయి. ఈ రహదారిపై లాక్‌డౌన్‌కు ముందు నిత్యం 17 వేల నుంచి 18 వేల వరకు వాహనాలు నడిచినట్లు టోల్‌పాజా రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం రోజుకు సుమారుగా 12 వేల వివిధ రకాల వాహనాలు నడుస్తున్నట్లు తెలిసింది. మంచిర్యాల, రామగుండం నుంచి సికింద్రాబాద్‌ వరకు ఎన్నో వాహనాలు నడుస్తున్నాయి. ఈ నెల 28న అన్ని రకాల వాహనాలు 11,600 వెళ్లినట్లు సమాచారం. వీటిలో కంటైనర్లు 1800 ఉన్నాయి. మొత్తంగా రాజీవ్హ్రదారితో ఈ ప్రాంత ప్రజలు సేవలు పొందుతున్నారు. మన తెలంగాణ బిడ్డ, దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు మంజూరు చేసిన రాజీవ్‌ రహదారితో ఉత్తర తెలంగాణలోని పలు నగరాల ప్రజలతో పాటు ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్‌ ఈ రహదారిపై ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో వాటి నివారణకు పలు చర్యలు చేపట్టి ప్రమాదాలు తగ్గించారు. చాలా చోట్ల మూలమలుపులను తీసివేయడంతో రోడ్డు ప్రమాదాలు భారీగా తగ్గాయి. ప్రమదాల స్థలాలను అధికారులు గుర్తించి, నివారణ చర్యలు చేపట్టారు. రాజీవ్‌ రహదారిపై స్పీడ్‌ లేజర్‌ గన్లను ఏర్పాటు చేయడంతో పరిమిత వేగంతో వాహనాలు వెళ్తున్నాయి.logo