మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Jun 28, 2020 , 01:01:24

వ్యవసాయంలో కొత్త పుంతలు

వ్యవసాయంలో కొత్త పుంతలు

  • n కొత్త రకం పంటలు పండిస్తున్న మన రైతులు
  • n వ్యవసాయ అనుబంధ రంగాలపైనా దృష్టి
  • n చేపల చెరువులు తవ్వి, చేపల పెంపకం చేస్తున్న కొందరు
  • n సంప్రదాయ సాగుకు స్వస్తి పలికి.. మార్పు దిశగా పయనం
  • n లాభాల సాగుకు శ్రీకారం

మన రైతులు మార్పును కోరుకుంటున్నారు. ‘సాగు’లో కొత్తదారులు వెతుక్కుంటున్నారు. సంప్రదాయ సాగుకు స్వస్తిపలికి.. ఆధునిక విధానాలు అవలంబిస్తున్నారు. కొత్త పంటల సాగును ఎంచుకుంటూ లాభాలు చూస్తున్నారు. ఎక్కడెక్కడో పండే పంటలను మన వద్ద పండిస్తూ ఔరా! అనిపిస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో సాగుచేసే డ్రాగన్ ఫ్రూట్ జహీరాబాద్ ప్రాంతంలో కొందరు రైతులు పండిస్తున్నారు.ఈ ప్రాంతంలో ఈ పంటనే కాకుండా ఎక్కువగా వాణిజ్య, చిరు ధాన్యాలు వంటి పంటలు పండిస్తూ రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మెట్ట ప్రాంతంలో పంటల సాగే కష్టంతో కూడుకున్న పని, అలాంటిది హుస్నాబాద్ ప్రాంతంలో కొందరు రైతులు ఏకంగా చేపల చెరువులు తవ్వి చేపల పెంపకం చేపడుతున్నారు. చేపల చెరువులు, చేపల పెంపకం అనగానే ఆంధ్ర ప్రాంతానికే పరిమితమని అనుకుంటారు అంతా. కానీ, తగిన నీటి సౌకర్యం ఉంటే మన వద్ద కూడా సాధ్యమని నిరూపిస్తున్నారు మన రైతులు.

ఈ ఫొటోలో కనిపిస్తున్న యువరైతు పేరు తిరుమల్ బాలస్వామి. ఇతనిది హుస్నాబాద్ మండలం బంజేరపల్లి పరిధిలోని గుంటూరుపల్లి. బంజేరపల్లి గ్రామ సర్పంచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇతనికి 15ఎకరాల భూమి ఉంది. ఇందులో రెండున్నర ఎకరాల్లో ఏడు ఫిష్ నిర్మించుకున్న ఈయన, 40వేల ఫంగస్ రకం చేప పిల్లలను పెంచుతున్నాడు. ఇప్పటికే రెండు నెలలు గడిచింది. మరో నాలుగు నెలలు గడిస్తే పంట చేతికొచ్చి మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నాడు. ఏటా పత్తి, వరి పంట వేసి అధిక పెట్టుబడులతో తక్కువ లాభాలు వస్తున్నాయని గమనించిన బాలస్వామి, కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతో కొంతమంది మిత్రులతో కలిసి ఆంధ్రా ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ చేపల పెంపకం విధానం, లాభాల ఆర్జన గురించి తెలుసుకున్నాడు.  రెండున్నర ఎకరాల్లో ఫిష్ నిర్మించి చేపల పెంపకం చేపట్టాడు. బోరు మోటారు ద్వారా నీటిని నింపుతూ, ఎరువులు వేస్తూ చేపలను కాపాడుతున్నాడు. మార్కెట్ చేపలకు డిమాండ్ ఉండడంతో లాభాలు వస్తున్నాయని అంటున్నాడు.

పెంపకం ఇలా...

చేపల పెంపకానికి కావాల్సింది మొదట నీటి సౌకర్యం. నల్లరేగడి, ఎర్రచెల్క భూముల్లో కూడా వీటిని పెంచవచ్చు. ఆరు అడుగుల లోతుతో వెడల్పాటి బడులను ఏర్పాటు చేసుకోవాలి. నల్లరేగడి భూముల్లో ఒకసారి నీటి మడులను నింపితే , పది రోజుల వరకు నీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎర్ర చెల్క భూముల్లోని ఫిష్ అడుగున పాలిథిన్ కవరు వేసుకుంటే, నీటి అవసరం అంతగా ఉండదు. పది రోజులకోసారి మడుల్లోకి నీళ్లు పెట్టడం, చేపలకు అవసరమైన ఎరువులు ఉదయం, సాయంత్రం వేయడం, చేపలు పావు కిలో సైజు వచ్చే వరకు కొంగలు, ఇతర పక్షుల బారి నుంచి కాపాడుకుంటే మంచి దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. హుస్నాబాద్: మెట్ట ప్రాంత రైతులు సంప్రదాయ సాగుకు స్వస్తి పలికి నూతన విధానాలు అవలంభిస్తున్నారు. చేపల చెరువులు, చేపల పెంపకం కేవలం ఆంధ్ర ప్రాంతంలోనే సాధ్యమని అనుకుంటాం. కానీ, మెట్ట ప్రాంతంలోనూ సుసాధ్యం చేస్తూ నూతన ఒరవడికి నాంది పలికారు ఇద్దరు హుస్నాబాద్ రైతులు. ఆరు నెలల కాలంలో సాధారణ పంటల కంటే చేపల పెంపకంతో ఇబ్బడిముబ్బడిగా లాభాలు పొందవచ్చని గుర్తించారు వారు. 

అధిక పెట్టుబడి.. రెట్టింపు లాభాలు...

చేపల పెంపకం భారీ పెట్టుబడితో కూడిన పరిశ్రమగా చెప్పుకోవచ్చు.  లాభాలు సైతం రెట్టింపు ఉంటాయి. రెండెకరాల భూమిలో చేపల పెంపకం చేపట్టాలంటే 40వేల చేపపిల్లలు అవసరం పడతాయి. 40వేల చేప పిల్లల కొనుగోలు, రవాణా ఖర్చులకు సుమారు రూ.4లక్షలు ఖర్చు అవుతాయి. ఒక్కో నెలకు ఎరువులు, మందులు, ఇతర ఖర్చులు కలిపి మరో లక్ష రూపాయల వరకు ఖర్చవుతుంది. దాదాపు ఆరు నెలలకు దాణాకే రూ.6 లక్షలు ఖర్చు వస్తుంది. మొత్తం పెట్టుబడి రూ.10లక్షలు అవుతుంది. ఆరు నెలల్లో ఒక్కో చేప కిలోన్నరకు పైగా ఎదుగుతుంది. వేసిన చేపల్లో 5వేల చేపలు చనిపోయినా, మిగతా 35వేల చేపలను మార్కెట్ విక్రయించుకోవచ్చు. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఒక్కో చేపకు రూ. 130 నుంచి రూ.150లు వస్తాయి. అంటే సుమారు రూ.45లక్షల నుంచి రూ.50లక్షల ఆదాయం వస్తుంది. కూలీలు, రవాణా, ఇతర అన్ని ఖర్చులు పోను దాదాపు రూ.30 నుంచి రూ.35లక్షలు మిగులుతాయి. ఏడాది వ్యవధిలో రైతు రెండు పంటలు తీయొచ్చు. సంవత్సర కాలంలో ఒక రైతు రెండున్నర ఎకరాల్లో రూ.60 నుంచి రూ.70లక్షల ఆదాయం పొందే అవకాశం ఉంది. అధిక పెట్టుబడితో పాటు భారీగా లాభాలు  ఉండటంతో మెట్ట రైతులు చేపల పెంపకంపై ఆసక్తిని కనబరుస్తున్నారు. చీడ పీడలు లేకుండా చేపలు ఆరోగ్యంగా పెరిగినప్పుడే పైన చెప్పిన ఆదాయాన్ని రైతులు పొందగలుగుతారు. 


logo