సోమవారం 26 అక్టోబర్ 2020
Medak - Jun 25, 2020 , 23:54:11

కరోనా కల్లోలం

కరోనా కల్లోలం

  • l ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 24 మందికి పాజిటివ్‌
  • l భయం గుప్పిట్లో జనం
  • l ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
  • l స్వీయ నిర్బంధమే శ్రీరామ రక్ష అంటున్న వైద్యులు

కరోనా వైరస్‌ రోజురోజుకు పెరుగుతూ ప్రజల మనస్సును కల్లోలం చేస్తున్నది. బయటకు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు. మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలని విస్తృత ప్రచారం జరుగుతున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఈ పరిణామాలకు దారితీస్తుంది. గురువారం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 24 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. జాగ్రత్తలు తీసుకోవడం, లేదంటే స్వీయ నిర్బంధమే శ్రీరామ రక్ష అని వైద్యులు సూచిస్తున్నారు. 

ఏడాకులపల్లిలో ఏడేండ్ల బాలుడికి కరోనా..

ఝరాసంగం : మండలంలోని ఏడాకులపల్లిలో ఏడేండ్ల బాలుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు డాక్టర్‌ మజీద్‌ తెలిపారు. హైదరాబాద్‌ నీలోఫర్‌ దవాఖానలో చిక్సిత పొందుతున్న బాలుడికి రక్త పరీక్షలు చేయగా, పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గాంధీ దవాఖానకు తరలించారు. ఝరాసంగం  తహసీల్దార్‌, తారాసింగ్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది, ఎస్సై ఏడుకొండలు గ్రామాన్ని సందర్శించి ప్రజలకు పలు సూచనలు చేశారు. సర్పంచ్‌  విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి కృష్ణ, పంచాయతీ సిబ్బందితో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.

మూసాపేట్‌లో మహిళకు.. 

నర్సాపూర్‌ రూరల్‌ : మండలంలోని మూసాపేట్‌ గ్రామానికి చెందిన మహిళ(60)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీం ఇన్‌చార్జి డా.విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. సదరు మహిళ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించి రక్త పరీక్షలు చేయగా, కరోనా సోకినట్లు తెలిపారు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. 

బీడీఎల్‌లో 21 మందికి కరోనా

పటాన్‌చెరు :  పటాన్‌చెరు మండలం బీడీఎల్‌ భానూర్‌లోని బీడీఎల్‌ పరిశ్రమ ఉద్యోగులు, వారి కుటుంబీకులను కలిపి 21మందికి కరోనా సోకింది. దీంతో పరిశ్రమ ఎదురుగా వెలసిన బీడీఎల్‌ టౌన్‌షిప్‌వాసుల్లో భయాందోళన నెలకొన్నది. గడిచిన వారం చెన్నై నుంచి వచ్చిన వృద్ధురాలికి కరోనా సోకగా, ఆమె కూతురు, ముగ్గురు చిన్నారులకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. టౌన్‌షిప్‌లో సెక్యూరిటీకి, అతడి భార్యకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడం, ఆ తరువాత ఇద్దరు ఉద్యోగులకు వైరస్‌ సోకడం... ఇలా కరోనా విస్తరిస్తున్నది. దీంతో భానూర్‌ గ్రామస్తులు భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు. 


logo