మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Jun 22, 2020 , 23:24:35

పెరుగుతున్న పాజిటివ్‌ కేసుల సంఖ్య

పెరుగుతున్న పాజిటివ్‌ కేసుల సంఖ్య

  • సంగారెడ్డి జిల్లాలో 8 కేసులు నమోదు
  • పటాన్‌చెరులో కొవిడ్‌-19తో వ్యక్తి మృతి
  • ఎప్పటికప్పుడు అప్రమత్తమై చర్యలు చేపడుతున్న వైద్య బృందాలు

అమీన్‌పూర్‌: మున్సిపల్‌ పరిధిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యాధికారులు తెలిపారు. మారుతీహిల్స్‌లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రాగా, సదరు వ్యక్తి జీహెచ్‌ఎంసీ పరిధిలోని ముషీరాబాద్‌ కేర్‌ దవాఖానలో పనిచేస్తున్నాడు. దీంతో చికిత్స కోసం అతని  దవాఖానకు తరలించారు. బీరంగూడలోని ప్రణీత్‌ ప్రణవ్‌హోమ్స్‌లో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 

పటాన్‌చెరులో కొవిడ్‌-19తో వ్యక్తి మృతి

పటాన్‌చెరు: ఈ నెల 18న కొవిడ్‌-19 పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ సోమ వారం మృతి చెందాడు. పటాన్‌చెరు పట్టణంలో అంబేద్కర్‌ కాలనీలో కరోనా వచ్చి 57 ఏండ్ల వ్యక్తి మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం మృతుడి అంత్యక్రియలు నిర్వహించారు. 

పట్టణంలో మరో ఇద్దరికి.. 

పట్టణంలోని శాంతినగర్‌లో 51ఏండ్ల వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని  తెలిపారు. చికిత్స నిమి త్తం గాంధీ దవాఖానకు తరలించారు. ఇంద్రేశం గ్రామంలో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, గాంధీ దవాఖానకు తరలించారు. బీడీఎల్‌ భానూర్‌ టౌన్‌షిప్‌లో మరో రెండు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

కంకోల్‌ మరో ముగ్గురికి.. 

మునిపల్లి: మండలంలోని కంకోల్‌లో ఒకే కుటుంబంలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ శిరీష తెలిపారు. సోమవారం గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని గాంధీ దవాఖానకు తరలించినట్లు చెప్పారు.  

ఇంటింటికీ వైద్య పరీక్షలు

సంగారెడ్డి: కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి థర్మల్‌ స్క్రినింగ్‌ నిర్వహించారు. సోమవారం సదాశివపేట 19వ వార్డు గాంధీచౌక్‌ ప్రాంతంలో మున్సిపల్‌ కమిషనర్‌ స్పందన పర్యటించి పలు సూచనలు చేశారు. మున్సిపల్‌ అధికారులు వార్డుకు వెళ్లే దారులన్నీ మూసివేశారు. కమిషనర్‌ వెంట మున్సిపల్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు. 

లక్ష్మీనగర్‌లో రసాయనాలు పిచికారీ

బొల్లారం: మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు లక్ష్మీనగర్‌లో నాలుగు కరోనా కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చైర్‌పర్సన్‌ రోజారాణి, రెవెన్యూ అధికారి శ్రీధర్‌ కాలనీలో పర్యటించారు. మున్సిపల్‌ కార్మికులతో కాలనీలో రసాయన మందు పిచికారీ చేయించారు. పెద్దగుండవెళ్లిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు 

దుబ్బాక : దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో పది రోజుల కింద  హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం అతనికి పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దుబ్బాక సీఐ హరికృష్ణ, తిమ్మాపూర్‌ సీహెచ్‌సీ వైద్యాధికారి భార్గవి గ్రామాన్ని సందర్శించి ప్రజలను అప్రమత్తం చేశారు. గ్రామ సర్పంచ్‌ రాజిరెడ్డి పంచాయతీ సిబ్బందితో రసాయన మందు  చేయించారు.

హోం క్వారంటైన్‌లోనే ఉండాలి

మద్దూరు: తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేసే వీఆర్వోకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అతనితో కాంటాక్ట్‌ అయిన వ్యక్తులను హోం క్వారంటైన్‌లోనే ఉండాలని మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్‌ రాజు సూచించారు. సోమవారం మండలంలోని కమలాయపల్లి, అర్జున్‌పట్ల గ్రామాలను వైద్య బృందం సందర్శించి, వీఆర్వోతో కాంటాక్ట్‌ అయిన రెండు గ్రామాల్లో 4 కుటుంబాలకు చెందిన 13 మందిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు అంజయ్య, మధుసూదన్‌రెడ్డి, హెల్త్‌ సూపర్‌వైజరు రాజయ్య, ఏఎన్‌ఎం, ఆశవర్కర్లు ఉన్నారు.

గజ్వేల్‌లో కరోనా కలకలం

గజ్వేల్‌: పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో స్థానికంగా కలకలం ఏర్పడింది.  మూడు రోజుల కింద గజ్వేల్‌ పట్టణానికి చెందిన ముగ్గురు నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం దవాఖానకు పంపించారు. సోమవారం గజ్వేల్‌కు చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన రిపోర్టు పాజిటివ్‌గా వచ్చినట్లు గడా వైద్యశాఖ ప్రత్యేకాధికారి కాశీనాథ్‌ ధ్రువీకరించారు. మిగతా ఇద్దరి రిపోర్టులు రావాల్సి ఉంది. 


logo