శనివారం 24 అక్టోబర్ 2020
Medak - Jun 22, 2020 , 01:08:53

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పెరుగుతున్న కేసులు

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పెరుగుతున్న కేసులు

  • సంగారెడ్డి జిల్లాలో 14 కేసులు నమోదు
  • చేర్యాలలో 13 మంది హోం క్వారంటైన్‌
  • కాలనీలను రెడ్‌జోన్లుగా ప్రకటించిన అధికారులు

సంగారెడ్డి మున్సిపాలిటీ: కరోనా మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నది. జిల్లాలో ఈ నెల 19వ తేదీన కరోనా పరీక్షలకు 22 మందిని పంపించగా, ఆదివారం వచ్చిన రిపోర్టులో మొత్తం 12 మందికి పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాలని  సూచించారు.    ఏడు మందికి నెగెటివ్‌ రాగా, రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు వైద్యాధికారులు వెల్లడించారు. 12 పాజిటివ్‌ కేసుల్లో ఆర్సీపురం 2, మునిపల్లి మండలం కంకోల్‌ 3, హత్నూర మండలం దౌల్తాబాద్‌ 1, జిన్నారం మండలం బొల్లారం 3, యూసుఫ్‌గూడ 2, జహీరాబాద్‌ ఒకరికి మొత్తం 12మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. సదాశివపేటలో కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం 14 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆదివారం కరోనా లక్షణాలు ఉన్న 9 మందికి పరీక్షల నిమిత్తం సంగారెడ్డి జిల్లా దవాఖా నలో చేరారు. 9 మందిలో కోహీర్‌ 1, సంగారెడ్డి 7, అమీన్‌పూర్‌ ఒకరు ఉన్నట్టు వైద్యాధికారులు తెలిపారు.

సదాశివపేటలో కరోనా కలకలం

సంగారెడ్డి టౌన్‌ : సదాశివపేటలో కరోనా కలకలం సృష్టించింది. ఇప్పటికే రెండు కేసులు నమోదు కాగా, గురునగర్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి మృతి చెందారు. ఆదివారం గాంధీ చౌక్‌ ఏరియాలో రెండు పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. మున్సిపల్‌ అధికారులు గాంధీ చౌక్‌ ఏరియాను రెడ్‌ జోన్‌గా ప్రకటించారు.  కాలనీలో మున్సిపల్‌ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కాలనీలో కంచె ఏర్పాటు చేశారు.  పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాన్ని  కమిషనర్‌ స్పందన, వైద్యారోగ్యశాఖ అధికారులు పరిశీలించారు. 

ఎంఐజీలో ముగ్గురికి,  ఆర్సీపురంలో ఒకరికి కరోనా పాజిటివ్‌

రామచంద్రాపురం: బల్దియా సర్కిల్‌ 22లోని పటాన్‌చెరు, ఆర్సీపురం, భారతీనగర్‌ డివిజన్‌ల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులతోపాటు వారికి ప్రైమరీ కాంటాక్ట్‌ ఉన్నవారిని అధికారులు కొండాపూర్‌ ప్రభుత్వ ఏరియా దవాఖానకు పరీక్షల నిమిత్తం పంపిస్తున్నారు. ఇప్పటి వరకు సర్కిల్‌ 22 పరిధిలో మొత్తం 13 మందికి కరోనా పాజిటివ్‌ రాగా, వారికి ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉన్న 25 మందికి అధికారులు పరీక్షలు చేయించారు. ఎంఐజీ విద్యుత్‌నగర్‌లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటమణికరణ్‌ తెలిపారు. ఓ పరిశ్రమలో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో అతడిని ప్రైమరీ కాంటాక్ట్‌ అయిన భార్య, కూతురికి కరోనా పాజిటివ్‌ రాగా, మరో కూతురికి నెగిటివ్‌ వచ్చింది. ఆర్సీపురం డివిజన్‌లోని ఓల్డ్‌ ఆర్సీపురంలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని బల్దియా మున్సిపల్‌ కమిషనర్‌ బాలయ్య తెలిపారు. మున్సిపల్‌, బల్దియా అధికారులు ఆయా ఇంటి పరిసరాల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు.  

అమీన్‌పూర్‌లో మరో రెండు పాజిటివ్‌

అమీన్‌పూర్‌: మున్సిపల్‌ పరిధిలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం నవ్యనగర్‌ లేక్యూ కాలనీకి చెందిన 32 ఏండ్ల  వ్యక్తికి, సాయిభాగవాన్‌ కాలనీకి చెందిన మరొకరికి కరోనా సోకినట్లు తెలిపారు.  

ఒకే కుటుంబంలో మరో ముగ్గురికి..

బొల్లారం: మున్సిపాలిటీ పరిధిలోని డాక్టర్‌ రెడ్డీస్‌ పరిశ్రమలో పనిచేస్తున్న ఆరుగురికి కరోనా పాజిటివ్‌ సంఘటనలో బొల్లారానికి చెందిన కార్మికుడికి కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కాగా, అతడి కుటుంబ సభ్యులను అధికారులు పరీక్షల నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ దవఖానకు తరలించారు. వైద్యపరీక్షల్లో భార్య(42), కొడుకు (11) బావమరిది(18) కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయి నట్లు వైద్యులు తెలిపారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రోజారాణి, జిన్నారం తహసీల్దార్‌  కమిషనర్‌ కేశురాం, ప్రాథమిక ఆరోగ్య అధికారి రాధిక వారిని నగరంలోని ఈఎస్‌ఐ దవాఖానకు తరలించారు. 16వ వార్డు జ్యోతినగర్‌ కాలనీలో ఆదివారం కౌన్సిలర్‌ చంద్రారెడ్డి పర్యటించారు.   

దౌల్తాబాద్‌లో మహిళకు.. 

హత్నూర : మండలం దౌల్తాబాద్‌లో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురి కాగా, హైదరాబాద్‌లో చికిత్స చేయించుకున్నాడు.  అతనికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో అక్కడే చికిత్స పొందుతున్నాడు. కాగా, చికిత్స పొందుతున్న వ్యక్తి కుటుంబీకుల్లో నలుగురి నుంచి రక్త నమూనాలు సేకరించిన అధికారులు కరోనా పరీక్షలకు పంపడంతో ఓ మహిళకు పాజిటివ్‌ వచ్చినట్లు దౌల్తాబాద్‌ ప్రభుత్వ దవాఖాన వైద్యుడు శంకర్‌ తెలిపారు. దీంతో సదరు మహిళను హోం క్వారంటైన్‌ చేసి చికిత్స అందిస్తున్నారు.  

హోం క్వారంటైన్‌లో 13 మంది

చేర్యాల: పట్టణంలోని 4వ వార్డులోని వాసవినగర్‌కు చెం దిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వైద్యాధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. చేర్యాల సీహెచ్‌సీలోని పీపీపీ యూనిట్‌ వైద్యాధికారి అశ్వినిస్వాతితోపాటు హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మురళి, భాగ్యలక్ష్మి, సిబ్బంది, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నిమ్మ రాజీవ్‌రెడ్డి, మున్సిపల్‌ సిబ్బంది, ఎస్సై మోహన్‌బాబు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తిని కలిసిన 13 మందిని గుర్తించి వారికి ముద్రలు వేసి 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. సిద్దిపేట, జనగామ, హైదరాబాద్‌లో కరోనా సోకిన వ్యక్తిని కలిసిన మరో 15 మందిని గుర్తించి వారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. సెంకడరీ కాంటాక్ట్‌లో ఉన్న మరో 18 మందిని గుర్తించారు. చైర్మన్‌ అంకుగారి స్వరూపరాణి, వైస్‌ చైర్మన్‌ నిమ్మ రాజీవ్‌రెడ్డి సిబ్బంది రెడ్‌జోన్‌ ప్రాంతంలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.  

వీఆర్‌వోకు కరోనా పాజిటివ్‌

మద్దూరు : వీఆర్‌వోకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. సదరు వీఆర్‌వో ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు.


logo