మంగళవారం 20 అక్టోబర్ 2020
Medak - Jun 19, 2020 , 23:56:24

వేగంగా ‘గౌరవెల్లి’ పనులు

వేగంగా ‘గౌరవెల్లి’ పనులు

  •  గౌరవెల్లి రిజర్వాయర్‌, పంపుహౌస్‌ సందర్శన, పనులపై సమీక్షలో  నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్‌

హుస్నాబాద్‌/అక్కన్నపేట : మెట్ట ప్రాంత వరప్రదాయని అయిన గౌరవెల్లి రిజర్వాయర్‌ పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌ అన్నారు. ఇప్పటికే 85 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని, మిగతా పనులను కూడా సత్వరమే పూర్తి చేయాలని, గత నెలలో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమీక్షలో అధికార యంత్రాంగాన్ని ఆదేశించారని తెలిపారు.  ఆయన ఆదేశాలతోనే రిజర్వాయర్‌ను శుక్రవారం సందర్శించిన అధికారులు అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి రిజర్వాయర్‌ పంపుహౌస్‌తో పాటు డెలివరీ సిస్టర్న్‌, ప్రాజెక్టు కట్ట ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. అంతకు ముందు స్థానిక ఎమ్మె ల్యే వొడితెల సతీశ్‌కుమార్‌, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు పనుల జాప్యానికి భూసేకరణ, నిర్వాసితుల, ఆర్‌అండ్‌ఆర్‌ సమస్యలు కారణమని, వీటిని నెల రోజుల్లోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించామని, ఇందు కు అవసరమైన రూ.60 కోట్లను మంజూరు చేస్తామన్నారు. ఈ నెల 23న భూనిర్వాసితులతో జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారులు సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ప్రాజెక్టు సామర్థ్యం 8.23టీఎంసీలకు పెంచాక, 1800ఎకరాల భూమి అవసరమైందని, ఇందు లో 350ఎకరాలు మినహా మిగతా అంతా సేకరించామన్నారు. 350ఎకరాల్లో ప్రస్తుతం 44ఎకరాలకు సంబంధించిన పరిహారం అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. ప్రాజెక్టు పంపు హౌస్‌కు అవసరమైన మూడు మోటార్లు రావాల్సి ఉండగా, కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కాస్త ఆలస్యమవుతున్నదని తెలిపారు. అక్టోబర్‌ నాటికి మొదటి మోటార్‌ను బిగించి, ట్రయల్న్‌ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే వానకాలం నాటికీ హుస్నాబాద్‌ ప్రాంతంలోని 200 చెరువులను గౌరవెల్లి రిజర్వాయర్‌ ద్వారా నింపుతామనే ధీమా వ్యక్తం చేశారు. కుడికాలువ పనులు తుదిదశలో ఉన్నాయని, ఎడమ కాలువ పనులు త్వరలోనే వేగవంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్‌ చీఫ్‌ మురళీధర్‌, ఇంజినీరింగ్‌ చీఫ్‌ ప్రాజెక్టు కరీంనగర్‌ అనిల్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌, వరద కాలువ ఎస్‌ఈ శ్రీకాంత్‌రావు, క్వాలిటీ కంట్రోల్‌ ఎస్‌ఈ దేవేందర్‌రెడ్డి, ఈఈ రాములు నాయక్‌, ఆర్డీవో జయచంద్రారెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ రాజిరెడ్డి, రుణ విమోచన కమిషన్‌ సభ్యుడు లక్ష్మారెడ్డి, తోటపల్లి ఈఈ రమేశ్‌, డీఈలు ప్రశాంత్‌, కరుణశ్రీ, చైతన్య, ఎంపీపీ మాలోతు లక్ష్మి, జడ్పీటీసీ భూక్య మంగ, మార్కెట్‌ చైర్మన్‌ తిరుపతిరెడ్డి అధికారులు  పాల్గొన్నారు.


logo