శనివారం 31 అక్టోబర్ 2020
Medak - Jun 17, 2020 , 23:43:06

చెరువులు, చానళ్ల మరమ్మతులు చేయాలి

చెరువులు, చానళ్ల మరమ్మతులు చేయాలి

మెదక్‌ : జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇరిగేషన్‌ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో చెరువుల, చానళ్లు, పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ సందీప్‌సుల్తానియా, నీటి పారుదల శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు అన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో అన్ని వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని చెరువులు, తూములు, ఫీడర్‌ చానళ్లను మర్మతులు చేయించుకోవాలన్నారు. దీనికి గాను డీఆర్‌డీవో, ఇరిగేషన్‌ శాఖ అధికారులు ప్రతి గ్రామంలో ఎలాంటి పనులు పెండింగ్‌లో ఉన్నాయి..? ఎలా చేయాలనే విషయాలను నోట్‌ చేసుకొని అందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలన్నారు. గ్రామాల్లో ఉన్న వాటర్‌ ట్యాంకులు, కెనాల్‌ పనుల ప్రణాళికలను తయారు చేసి, కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రతి వారం జరిగిన పనికి సంబంధించిన నగదు డబ్బులను సైతం అప్పటికప్పుడే చెల్లించాలని కలెక్టర్లకు వివరించారు. వీసీలో  అదనపు కలెక్టర్‌ నగేశ్‌, డీఆర్‌డీవో శ్రీనివాస్‌, నీటి పారుదల శాఖ ఈఈ ఏసయ్య, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అందరూ ప్రణాళికలు రూపొందించుకోవాలి

జిల్లాలో ఎక్కువగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేయడానికి అధికారులు అందరూ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ సూచించారు. కాలువలు, చెరువుల పనులు ఎక్కువగా ఉపాధి హామీ కింద జరిగేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. చెక్‌డ్యాంలు, చెరువులు, ఫతేనహర్‌ కాలువ, మహబూబ్‌నహర్‌ కాలువ, హల్దీవాగు పనులకు ఈ నిధులను వాడుకునే అవకాశమున్నందున, నీటి పారుదల శాఖ అధికారులు పనులను వేగవంతం చేయాలన్నారు.