సోమవారం 19 అక్టోబర్ 2020
Medak - Jun 17, 2020 , 23:35:00

స్వరాష్ట్రంలో నల్లవాగు మురిసింది..

స్వరాష్ట్రంలో నల్లవాగు మురిసింది..

n ప్రాజెక్టు ఆధునీరణకు రూ.24.19 కోట్లు కేటాయింపు

n కొనసాగుతున్న కాలువల మరమ్మతులు 

n ఆధునీకరణతో 6,030 ఎకరాలకు అందనున్న సాగునీరు

n చివరి ఆయకట్టు రైతులకు తీరనున్న బెంగ 

ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులు.. స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ హయాంలో మహర్దశకు చేరుకుంటున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాగునీటి రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుండడంతో రైతుల వెతలు తీరుతున్నాయి. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని సిర్గాపూర్‌ నల్లవాగు ప్రాజెక్టు టీఆర్‌ఎస్‌ హయాంలోనే ఆధునీకరణకు నోచుకుంటోంది. ప్రభుత్వం కేటాయించిన రూ.24.19 కోట్లతో వేగంగా ఆధునీకరణ పనులు పూర్తి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద 5వేల వరకు సాగునీరు అందుతుండగా.. పనులు పూర్తయితే 6,030 ఎకరాలకు సాగునీరందనున్నది.  -సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ  

6,030 ఎకరాలకు సాగునీరు... 

6,030 ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో 1967లో నల్లవాగు ప్రాజెక్టును నిర్మించారు. సిర్గాపూర్‌ మండలంలోని సుల్తానాబాద్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువ ద్వారా 15 గ్రామాలకు నీళ్లు అందుతాయి. కుడి కాలువ ద్వారా సుల్తానాబాద్‌, పోచాపూర్‌, బీబీపేట, కృష్ణాపూర్‌, మార్డి, ఖానాపూర్‌, ఇంద్రానగర్‌, కల్హేర్‌, గోసాయిపల్లి, సిర్గాపూర్‌ గ్రామాలు ఉన్నాయి. ఎడమ కాలువ కింద బొక్కాస్‌గావ్‌, అంతర్‌గావ్‌లతో పాటు కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని తిమ్మనగర్‌ గ్రామాలు ఉన్నాయి. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ప్రాజెక్టు కాలువలు ధ్వంసమయ్యాయి. దీంతో నీళ్లు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాలువల ద్వారా నీరు వదిలితే దగ్గరలో ఉన్న కొద్దిమంది రైతులకు మాత్రమే నీరు అందేది. 6,030 ఎకరాలకు నీరందించాల్సిన ప్రాజెక్టు.. కేవలం 3వేల ఎకరాలకు మాత్రమే అందించే స్థాయికి వచ్చింది. పలుచోట్ల గండ్లు పడడం, తూములు పాడైపోవడంతో కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఈ క్రమంలో నల్లవాగు ఆధునీకరణకు కావాల్సిన నిధుల కోసం మంత్రి హరీశ్‌రావు సీఎం కేసీఆర్‌ను సంప్రదించారు. దీంతో రూ.24.19 కోట్లు సీఎం మంజూరు చేశారు. ఈ నిధులతో కాలువల మరమ్మతులు, ఇతర పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

శరవేగంగా సాగుతున్న పనులు...

సుల్తానాబాద్‌, గోసాయపల్లి, పోచాయిపల్లి గ్రామాల పరిధిలో సిమెంట్‌ సైడ్‌వాల్స్‌ నిర్మించారు. గతంతో భూమిలో పాతిన పైపులకు రంద్రాలు వేసి నీటిచౌర్యం చేశారు. ఈ క్రమంలో అలాంటి చౌర్యానికి అవకాశం లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. కృష్ణానగర్‌, ఖానాపూర్‌, మధ్యన ఇంద్రానగర్‌ వెళ్లే మార్గంలో నీళ్లు వృథాగా పోకుండా బలమైన సైడ్‌వాళ్లు నిర్మించారు. తూములు, కాలువలు, కట్టలపై వెళ్లడానికి వీలుగా తోవలు, కాలువలకు సిమెంట్‌ లైనింగ్‌ పనులు పూర్తిచేశారు. ఇంకా అక్కడక్కడా పనులు కొనసాగుతున్నాయి. పనుల పూర్తయితే పూర్తి ఆయకట్టకు నీరందనున్నది. ఇప్పటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా.. ఎప్పటికప్పుడు రైతులు పంటలు సాగుచేస్తుండడంతో కొంత జాప్యం జరిగినట్లు అధికారులు చెప్పారు. నల్లవాగు ఆధునీకరణతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. 


logo