ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Jun 17, 2020 , 23:14:19

సింగూరు నుంచి చేలు చేరిన నీరు

సింగూరు నుంచి చేలు చేరిన నీరు

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకే ప్రాజెక్టు పరిమితం  

నేడు 40వేల ఆయకట్టుకు సాగునీటి భరోసా 

భూసేకరణ, లిప్ట్‌, కాలువల మరమ్మతులు చేయించిన ప్రభుత్వం

రూ.85 కోట్లు ఖర్చు చేయడంతో అన్నదాతకు నీరు

మంజీర వాటర్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆ పేరు చెప్పగానే ఆ నీటి మాధుర్యమే వేరంటారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో మంజీర నీళ్లు బాగా వంటబట్టాయి అంటుంటారు కూడా. కానీ, ఆ నీళ్లు ఎలా వచ్చాయి..? రైతుల పంట పొలాలకు వెళ్లాల్సిన నీళ్లు ఇలా హైదరాబాద్‌ ఎందుకు తరలించారు..? ప్రాజెక్టు నిర్మాణ ఉద్దేశాన్నే మార్చింది ఎవరు..? అనే విషయాలు చాలా మందికి తెలియవు. 40వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో నిర్మించిన సింగూరు ప్రాజెక్టును కేవలం హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ జంట నగరాలకు నీరందించే వాటర్‌ ట్యాంకుగా మార్చాయి గత ప్రభుత్వాలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్‌ హయాంలో ఈ ప్రాజెక్టు నుంచి తొలిసారి 2016లో ఆయకట్టు నీరందించారు. - సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ    

సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగూరు ప్రాజెక్టు దశ మారింది. భూసేకరణ చేపట్టి లిప్ట్‌, కాలువ పనులు పూర్తిచేయించి 40వేల ఎకరాలకు నీరందించింది. పట్నం వాసులకు కృష్ణా జలాలు అందించి, సింగూరు ప్రాజెక్టు నుంచి ఉమ్మడి మెదక్‌ జిల్లా రైతాంగానికి సాగునీరు అందించిన ఘనతను టీఆర్‌ఎస్‌ సర్కారు సొంతం చేసుకుంది. 

29.99 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం...

ఎలాంటి సాగునీటి ప్రాజెక్టులు లేని ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 40వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో 29.99 టీఎంసీల సామర్థ్యంతో సింగూరు ప్రాజెక్టు నిర్మించారు. 1976లో అప్పటి సీఎం జలగం వెంగళరావు ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 1988లో పూర్తయ్యింది. ఆ ఏడాది నుంచి ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉంచారు. ఈ ప్రాజెక్టు ద్వారా అందోలు, పుల్కల్‌ మండలంలో 40వేల ఎకరాల వరకు నీళ్లు అందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిజామాబాద్‌లోని నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు, మెదక్‌ జిల్లాలోని ఘనపురం ఆనకట్టకు నీటిని కేటాయించారు. అయితే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తరువాత లిప్ట్‌, కాలువల పనులు చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా జాప్యం చేసింది. 2005లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కాలువల నిర్మాణం, భూసేకరణకు నిధులు కేటాయించగా.. కాంట్రాక్ట్‌ తీసుకున్న సంస్థలు పనులు చేపట్టలేకపోయాయి. సింగూరు నుంచి సాగునీళ్లు అనే మాటలు కేవలం ఎన్నికల వాగ్ధానాలుగానే మిగిలిపోయాయి. 

నగరానికి నీళ్లందించడానికే పరిమితం...

రైతులకు సాగునీరందించడానికి నిర్మించిన సింగూరు ప్రాజెక్టు కేవలం హైదరాబాద్‌కు తాగునీళ్లందించేందుకే పరిమితం చేశారు గత పాలకులు. సింగూరు నుంచి సంగారెడ్డి పట్టణ సమీపంలోని మంజీర బ్యారేజ్‌కు నీటిని పంపి, ఇక్కడి నుంచి ఫిల్టర్‌ చేసి హైదరాబాద్‌ తరలిస్తూ వస్తున్నారు. హైదరాబాద్‌ వాసులకు మంజీర వాటర్‌ అంటే ఎంతో ఇష్టం. సింగూరు నుంచి నీరు వెళ్లలేదంటే పట్నం వాసులకు తాగునీటి ఇబ్బందులు తప్పేవి కాదు. ఈ తరుణంలో సింగూరు జలాలను పూర్తిగా మెదక్‌ జిల్లా సాగునీటి అవసరాలకే వినియోగించాలని ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకే గ్రేటర్‌ హైదరాబాద్‌కు కృష్ణా జలాల తరలింపునకు ప్రత్యేకంగా కృషిచేశారు. ఇదే సమయంలో సింగూరు ప్రాజెక్టు కాలవల పనులు పూర్తి చేయించే బాధ్యతను సీఎం కేసీఆర్‌ మంత్రి హరీష్‌రావుకు అప్పగించారు.

రూ.85 కోట్లతో లిప్ట్‌, కాలువ పనులు పూర్తి...

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి, ప్రస్తుత ఆర్థిక మంత్రి హరీష్‌రావు సింగూరుపై ప్రత్యేక దృష్టిసారించారు. కాలువల నిర్మాణం, భూసేకరణకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. మంత్రి దగ్గరుండి పనులు చేయించారు. రూ.45 కోట్లతో సివిల్‌ వర్క్స్‌, మరో రూ. 20 కోట్లు భూసేకరణకు వెచ్చించారు. రూ.19.80 కోట్లతో లిప్ట్‌ పనులు పూర్తి చేయించారు. పలుమార్లు స్వయంగా మంత్రి హరీశ్‌రావు సింగూరుకు వచ్చి పనులను పర్యవేక్షించారు. ఉన్నతాధికారులను తీసుకువచ్చి సమీక్షలు నిర్వహించారు. కాలువలు వెంట తిరిగి పరిశీలించారు. సింగూరు ప్రాజెక్టు వద్ద సిబ్బందికి క్వార్టర్లు నిర్మించారు. అధికారులు రాత్రింబవళ్లు కష్టపడి పనులు పూర్తి చేయించారు. దీంతో 2016లో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. ఇక ఆ ఏడాది పుల్కల్‌, అందోలు మండలాల్లో 40వేల ఎకరాలకు సాగునీళ్లందించారు. 2017లో కూడా సాగునీరందించగా.. ప్రస్తుతం వర్షాలు లేక నీరు రాకపోవడంతో సాగునీరందడం లేదు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన 1988 నుంచి సాగుకు చుక్కనీరు అందలేకపోతే, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి హైదరాబాద్‌కు కృష్ణా జలాలు ఇచ్చి, ఇక్కడి సాగు అవసరాలకు సింగూరు జలాలు వాడుకుంటున్నారు. సాగునీళ్లిచ్చిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని మెతుకుసీమ రైతాంగం కృతజ్ఞతలు తెలుపుతున్నది.


logo