ఆదివారం 25 అక్టోబర్ 2020
Medak - Jun 17, 2020 , 00:41:38

ఇది వ్యాధుల కాలం.. జాగ్రత్తే శ్రీరామ రక్ష

 ఇది వ్యాధుల కాలం.. జాగ్రత్తే శ్రీరామ రక్ష

l నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలే..

l పరిసరాల శుభ్రతతోనే ఈగలు, దోమలు దూరం

l వేడి చేసి చల్లార్చిన నీటిని తాగితే మేలు

l వ్యక్తిగత, పరిసరాల శుభ్రతతో ఆరోగ్యం

వానకాలం వ్యాధులను మోసుకొచ్చే కాలం... అప్రమత్తంగా లేకపోతే అనారోగ్యం పాలే.. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే దోమలు, ఈగలు వ్యాప్తిచెంది రోగాలను కొనితెచ్చుకున్నట్లే.. దీనికి తోడు కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది.. హానికరమైన వైరస్‌, బ్యాక్టీరియా గాలి, నీటి ద్వారా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి... టైఫాయిడ్‌, మలేరియా, డెంగీ, డయేరియా, ఫైలేరియా, మెదడు వాపు వంటి వ్యాధులు సోకే తరుణమిది... వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతలో జాగ్రత్తగా ఉండడమే శ్రీరామ రక్ష అని వైద్యులు సూచిస్తున్నారు...  

టేక్మాల్‌ : వానకాలంలో వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి.  ఇటీవల కురిసిన వర్షాలతో  గుంతలు, కుంటలు, మురుగు కాల్వల్లోకి చెత్తాచెదారం చేరడం వల్ల దోమలు, ఈగలు, బ్యాక్టీరియా పెరిగి రోగాలు వస్తాయి.  కలుషిత నీటిని తాగకుండా, వేడి చేసి చల్లార్చిన నీటిని తాగడమే ఆరోగ్యం. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించి, జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.

దోమలతో రోగాలు...

వేసవిలో తక్కువగా ఉండే దోమలు వానలకు వృద్ధి చెందుతాయి. ‘ఎనాఫిలస్‌' అనే ఆడదోమ వల్ల మలేరియా వ్యాధి వస్తుంది. ఇది అన్ని సీజన్లలో వచ్చినా.. వానకాలం ప్రారంభంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇది ఎడిస్‌ ఈజిప్ట్‌ అనే దోమ కుట్టడం వల్ల మలేరియా వ్యాధి సోకుతుంది. క్యూలెక్స్‌ దోమ కాటు వల్ల ఫైలేరియా (బోధకాలు) వ్యాధి సంక్రమిస్తుంది. శరీరంలోని ఏ భాగానికైనా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఎడిస్‌, క్యూలెక్స్‌ అనే దోమలు కుట్టడం వల్ల చికెన్‌గున్యా వస్తుంది. కలుషిత నీటిని తాగడం, కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల డయేరియా బారిన పడే ప్రమాదం ఉంటుంది.  టైఫాయిడ్‌ సాల్మోనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా ద్వారా సోకుతుంది. ఈ కాలంలో వైరస్‌ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దగ్గు, జలుబుతో మొదలై జ్వరం వస్తుంది. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంటే వాంతులు, విరేచనాలు అవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. వృద్ధుల్లో శ్వాసకోస వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. చిన్న పిల్లల్లో జ్వరం ఎక్కువగా వస్తే మూర్చపోయే ముప్పు ఉంటుంది. ఇంటి ఆవరణ, పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పరిసర ప్రాంతాల్లో దోమలు పెరుగకుండా చర్యలు తీసుకోవాలి. దోమలు వృద్ధి చెందకుండా మందులు చల్లాలి. 

పౌష్టికాహారం తీసుకోవాలి...

అనారోగ్యానికి గురైనప్పుడు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఏదైనా వ్యాధి సోకినప్పుడు మాంసాహారాన్ని మానివేయాలి. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. తాజా కూరగాయలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు వంటి అధిక పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. పండ్ల రసాలు, కొబ్బరి బొండాలు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

  • l ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా  చూసుకోవాలి.
  • l పనికిరాని, వాడని వస్తువులను  పరిసరాల్లో ఉంచరాదు.
  • l వారానికోసారి ఇంట్లోని సంపులు,  వాటర్‌ ట్యాంకులను శుభ్రం చేయాలి. 
  • l దోమలు రాకుండా  జాలీలు ఏర్పాటు చేసుకోవాలి.
  • l కలుపు మొక్కలు,  కంప చెట్లను తొలిగించాలి.  


logo